రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
ఉత్తరాఖండ్‌లోని తనక్‌పూర్‌లో రూ. 2,217 కోట్ల విలువైన 8 జాతీయ హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన శ్రీ నితిన్‌గడ్కరీ
Posted On:
13 FEB 2024 4:48PM by PIB Hyderabad
ఉత్తరాఖండ్‌లోని తనక్‌పూర్‌లో రూ. 2,217 కోట్ల విలువైన 8 జాతీయ హైవే ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ ధామీ, కేంద్ర సహాయ మంత్రి శ్రీ అజయ్‌భట్, శ్రీ అజయ్ తమ్‌తా, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారుల సమక్షంలో కేంద్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ (రహదారి రవాణా & హైవేల) మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ మంగళవారం శంకుస్థాపన చేశారు.
కాట్‌గోదాం నుంచి నైనితాల్ రహదారిని రెండు లేన్లతో పేవ్డ్ షోల్డర్ (రహదారి పక్కన పేవ్‌మెంట్)తో విస్తరించడం నైనితాల్-మానస్‌ఖండ్ ఆలయాల మధ్య అనుసంధానతను మెరుగుపరుస్తుంది. అలాగే, కాశీపూర్ నుంచి రామ్‌నగర్ రోడ్డును 4 లేన్లతో విస్తరించడం అన్నది పర్యాటకులు జిమ్ కార్బెట్ నేషనల్ పార్కును, మానస్‌ఖండ్ ఆలయాలను చేరుకోవడాన్ని సులభతరం చేస్తుంది. కంగర్‌చినా నుంచి అల్మొడా రోడ్డును 2 లేన్లతో విస్తరించడం వల్ల బాగేశ్వర్ వెళ్ళే పర్యాటకుల సంఖ్యను పెంచడమే కాక సమయాన్ని ఆదా చేస్తుంది. జాతీయ రహదారి 309 ఎపై ఉడియార్ బండ్ నుంచి కందా మార్గ్ 2 లేన్ల విస్తరణ, పునరుద్ధరణ బాగేశ్వర్‌లోని బాగ్‌నాథ్, బైజ్‌నాథ్ ఆలయాలకు ప్రవేశాన్ని సులభతరం చేస్తుంది. అంతేకాదు, బాగేశ్వర్ నుంచి పితోడ్‌గఢ్‌కు క్లిష్టంగా ఉండే ప్రయాణాన్ని మెరుగుపరిచి, సురక్షితం, సమయం ఆదా అయ్యేలా చేస్తుంది.
ఉత్తరాఖండ్‌లో అద్భుతమైన మౌలిక సదుపాయాలను సృష్టించాలన్న లక్ష్యం కేవలం రహదారులను,హైవేల పని చేయడానికే పరిమితం కాదని, ప్రజల భద్రతను మనసులో పెట్టుకొని జాతీయ రహదారి 87 విస్తరణపై గోడలను కూడా నిర్మిస్తున్నామని శ్రీ గడ్కరీ తెలిపారు. అలాగే బాగేశ్వర్ జిల్లాలో సరయు, గోమ్దీ నదులపై రెండు వంతెనల మరమ్మత్తులను రూ. 5 కోట్ల వ్యయంతో చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు పర్యాటకులకు లబ్ధి చేకూర్చడమే కాక స్థానిక ప్రజలు ప్రయాణించడాన్ని సులభతరం చేస్తాయి. అంతేకాకుండా, పర్యావరణానికి ఎటువంటి హానీ కల్పించకుండా స్థానిక ఆర్థిక వ్యవస్థలు బలోపేతం అవుతాయని ఆయన అన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ నాయకత్వంలో ఉత్తరాఖండ్ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని శ్రీ గడ్కరీ పేర్కొన్నారు.
***
(Release ID: 2005747)
Visitor Counter : 77