విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

దేశంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా తగినంత విద్యుత్‌ అందుబాటులో ఉంచుకునేలా 'వనరుల సమృద్ధి మార్గదర్శకాలకు' కట్టుబడి ఉండాలంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాసిన కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ


అన్ని రాష్ట్రాలు & యూటీలు 2024-25 - 2033-34 కాలానికి వనరుల సమృద్ధి ప్రణాళికలను పూర్తి చేయాలని సూచన

2033-34 సంవత్సరం వరకు జాతీయ స్థాయి వనరుల సమృద్ధి ప్రణాళికను సిద్ధం చేస్తున్న 'సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ'

Posted On: 11 FEB 2024 6:51PM by PIB Hyderabad

దేశంలో వేగంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు 'వనరుల సమృద్ధి మార్గదర్శకాలు' పాటించాలని భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది.

2030 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ అధిక స్థాయిలో వృద్ధి చెందుతుందని & ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని అంచనా. ఈ ప్రకారం ఇప్పటికే దేశంలో విద్యుత్ వినియోగం కూడా పెరిగింది. గరిష్ట విద్యుత్ డిమాండ్ 2014లోని 136 గి.వా. నుంచి ప్రస్తుతం 243 గి.వా.కు చేరింది, 79% పైగా వృద్ధి చెందింది. దీనికి అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యమూ పెరిగింది. 2014 మార్చిలోని 248.5 గి.వా. నుంచి 2023 డిసెంబర్‌లో 428.3 గి.వా.కు చేరింది, ఇది 72.4% పెరుగుదల. దీంతోపాటు, దేశంలో 117 గి.వా. విద్యుత్‌ పంపిణీకి తగిన అంతర్-ప్రాంతీయ ప్రసార మౌలిక సదుపాయాలు ఏర్పాటయ్యాయి.

విద్యుత్ (వినియోగదార్ల హక్కులు) నిబంనధలు-2020లోని 10వ నిబంధన ప్రకారం, రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంఘం తక్కువ సరఫరా గంటలను నిర్ణయించిన కొన్ని వినియోగ వర్గాలకు మినహా, మిగిలిన అందరికీ 24 గంటల విద్యుత్‌ను పంపిణీ లైసెన్స్‌ పొందిన సంస్థలు అందించాలి. ఇందుకోసం, పంపిణీ సంస్థలన్నీ 24 గంటలూ తగినంత సరఫరా సామర్థ్యంతో పని చేయాలి. దీనికి సంబంధించి, 2023 జూన్‌ 28న విద్యుత్ (సవరణ) నిబంధనలు-2022లోని 16వ నిబంధన ప్రకారం 'వనరుల సమృద్ధి మార్గదర్శకాలను' భారత ప్రభుత్వం జారీ చేసింది.

వనరుల సమృద్ధి (ఆర్ఏ) మార్గదర్శకాల ప్రకారం, విద్యుత్‌ అవసరాలను తీర్చడానికి పంపిణీ సంస్థలు 10 సంవత్సరాలకు ఆర్‌ఏ ప్రణాళికను సిద్ధం చేయాలి. 2024-25 నుంచి 2033-34 వరకు అన్ని రాష్ట్రాలు & యూటీలు తప్పనిసరిగా తమ వనరుల సమృద్ధి ప్రణాళికలను పూర్తి చేయాలి.

ఇప్పటి వరకు, 'సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ' (సీఈఏ) ద్వారా,  దిల్లీ, గోవా, సిక్కిం, హరియాణా, బిహార్, పశ్చిమ బెంగాల్, చండీగఢ్, పుదుచ్చేరి & జమ్ము&కశ్మీర్‌ వంటి 23 రాష్ట్రాలు & యూటీలకు 2031-32 వరకు 'వనరుల సమృద్ధి అధ్యయనాలు' పూర్తయ్యాయి. మిగిలిన రాష్ట్రాలు & యూటీలకు ఆర్‌ఏ అధ్యయనాలు పురోగతిలో ఉన్నాయి. అయితే, జాతీయ స్థాయి ఆర్‌ఏ అధ్యయనాల కోసం 2033-34 సంవత్సరానికి సంబంధించిన సమాచారాన్ని పంపిణీ లైసెన్స్‌ సంస్థలు సీఈఏకి సమర్పించాలి. ఈ ప్రకారం, 'రిసోర్స్ అడిక్వసీ గైడ్‌లైన్స్' పాటించాలంటూ ఈ నెల 2న ఒక లేఖను రాష్ట్రాలు & యూటీలకు భారత విద్యుత్‌ మంత్రిత్వ శాఖ పంపింది.

***



(Release ID: 2005117) Visitor Counter : 108


Read this release in: English , Urdu , Hindi