ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
జాతీయ డెంటల్ (దంత) కమిషన్ నూతన ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
ఆంధ్రప్రదేశ్ లో 3, జమ్ముకశ్మీర్ లో 1 నర్సింగ్ కాలేజీలకు శంకుస్థాపన చేసిన డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
నేషనల్ డెంటల్ కమిషన్ కు చెందిన నేషనల్ డెంటల్ రిజిస్టర్ ను ప్రారంభించిన డాక్టర్ మాండవీయ: డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మధ్య అవగాహనా ఒప్పంద కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డాక్టర్ మాండవీయ
డెంటల్ కమిషన్ ఏర్పాటు దంత విద్య, పరిపాలనలో కొత్త శకానికి నాంది: డెంటల్ కమిషన్ చట్టం ద్వారా, దంత విద్యను మరింత ఆచరణాత్మకంగా, తక్కువ ఖర్చుగా మార్చడానికి, మొత్తం వ్యవస్థలో పారదర్శకతను
తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసింది; అదే సమయంలో రోగులకు తక్కువ ఖర్చు కు , మెరుగైన చికిత్సను అందిస్తుంది: డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
నోటి ఆరోగ్యం గురించి విస్తృతంగా అవగాహన కల్పించి, నోటి ఆరోగ్య సంరక్షణ దిశలో మరిన్ని అవకాశాలను సృష్టించాల్సిన అవసరం ఉంది
Posted On:
05 FEB 2024 8:13PM by PIB Hyderabad
దంత ఆరోగ్య సంరక్షణలో భాగంగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ జాతీయ దంత వైద్య కమిషన్ (ఎన్ డి సి) నూతన ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ లో మూడు , జమ్మూ కాశ్మీర్ లో ఒక నర్సింగ్ కళాశాలలకు, వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఇంకా, అండర్ గ్రాడ్యుయేట్ దంత కళాశాలల మూల్యాంకనం , రేటింగ్ కోసం డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా , క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన అవగాహన ఒప్పంద కార్యక్రమానికి డాక్టర్ మాండవీయ అధ్యక్షత వహించారు. నేషనల్ హెల్త్ డిజిటల్ మిషన్ కింద నేషనల్ డెంటల్ రిజిస్టర్ ను ప్రారంభించారు. త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా వర్చువల్ గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
డాక్టర్ మాండవీయ "డెంటల్ కమిషన్ ఏర్పాటు దంత విద్య , పరిపాలనలో కొత్త శకానికి నాంది పలుకుతుంది" అని పేర్కొన్నారు. డెంటల్ కమిషన్ చట్టం ద్వారా దంత విద్యను మరింత ఆచరణాత్మకంగా, చౌకగా, మొత్తం వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడానికి, అదే సమయంలో రోగులకు తక్కువ ఖర్చుతో , మెరుగైన చికిత్సను అందించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసిందని ఆయన అన్నారు. "మన దేశానికి ప్రయోజనం చేకూర్చే ఈ రంగంలోని అపారమైన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి వీలుగా నోటి పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడం అత్యవసరం" అని డాక్టర్ మాండవీయ అన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను కొనియాడిన డాక్టర్ మాండవీయ, ఆరోగ్య సేవ ల కల్పన, లభ్యతను పెంపొందించే ప్రయోజనాల కారణాన్ని ప్రస్తావిస్తూ, ఆరోగ్యం పట్ల క్రియాశీలక దృక్పథాన్ని ప్రశంసించారు.
వన్ నేషన్ వన్ రిజిస్టర్ కింద రూపొందించిన నేషనల్ డెంటల్ రిజిస్టర్ (ఎన్ డి ఆర్) ఆవిష్కరణతో దేశ ప్రజలకు పారదర్శకంగా దంతవైద్యుడి గుర్తింపు, అర్హత లభిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి ఉద్ఘాటించారు. ‘భారతదేశంలో ప్రాక్టీస్ చేస్తున్న దంతవైద్యులందరికీ సంబంధిత రాష్ట్ర దంత మండలి నుండి ధృవీకరణ తర్వాత ఎన్ డి ఆర్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (డిసిఐ ఐడి) అందిస్తుంది. రాష్ట్ర దంత మండళ్లు ధృవీకరించిన దంతవైద్యులను గుర్తించడానికి ఎన్ డి ఆర్ పౌరులకు సహాయపడుతుంది‘ అని చెప్పారు.
నర్సింగ్ శ్రామిక శక్తిని బలోపేతం చేయడానికి ప్రాంతాల మధ్య ఆరోగ్య అసమానతలను తగ్గించడానికి ప్రభుత్వ నిబద్ధతను వివరిస్తూ, "ప్రస్తుతం ఉన్న వైద్య కళాశాలలతో కలిసి 157 కొత్త నర్సింగ్ కళాశాలలను స్థాపించే ప్రభుత్వ పథకంలో ఈ కార్యక్రమం ఒక భాగం" అని డాక్టర్ మాండవీయ పేర్కొన్నారు. ‘ ఆరోగ్య, వైద్య మౌలిక సదుపాయాల రంగంలో సాధించిన పురోగతి నాణ్యమైన , సరసమైన ఆరోగ్య సంరక్షణను అందిస్తుంది. ఆరోగ్య సంరక్షణ రంగంలో అనేక అవకాశాలను తెరుస్తుంది, ఇది దేశానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది‘ అని ఆయన పేర్కొన్నారు. విదేశాల్లో శిక్షణ పొందిన భారతీయ నర్సులకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా వైద్య విద్యా సంస్థలలో విదేశీ భాషా కోర్సులను ప్రభుత్వం ప్రవేశ పెడుతోందని , అస్సాంలోని రెండు నర్సింగ్ కళాశాలల్లో జపనీస్ భాషలో విదేశీ భాషా కోర్సు ఇందుకు ఉదాహరణ అని ఆయన తెలిపారు. విదేశాలలో అవకాశాలను అందిపుచ్చుకోవడంలో విద్యార్థులకు అదనపు ప్రయోజనాన్ని అందించే విధంగా విదేశీ భాషా కోర్సులను ప్రభుత్వం వైద్య విద్యా సంస్థల్లో చేర్చిందని వివరించారు.
శ్రీ మాణిక్ సాహా మాట్లాడుతూ, ఆరోగ్య రంగంలో చోటు చేసుకున్న మార్పును ప్రశంసించారు. "ఈ సంస్థల స్థాపన సామాన్యులకు ప్రయోజనం చేకూరుస్తుంది, అందుబాటు ధరలో ఆరోగ్య సంరక్షణ సేవలు సులభంగా అందుబాటులోకి వస్తాయి" అని అన్నారు.
ఈ సందర్భంగా జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా ప్రసంగిస్తూ, ఆరోగ్య సేవలను అందించడంలో నర్సుల పాత్ర కీలకమని అన్నారు. సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ కోసం జాతీయ ఆదేశానికి అనుగుణంగా ఆరోగ్య సంరక్షణలో అర్హత కలిగిన మానవ వనరులను పెంచే దిశగా నర్సింగ్ కళాశాలల స్థాపన ఒక ముఖ్యమైన అడుగు అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర, ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ విపుల్ అగర్వాల్, సీనియర్ ప్రభుత్వ అధికారులు, పద్మశ్రీ (1992), పద్మభూషణ్ (2005) (హెచ్ ఒ ఎన్ వై ) బ్రిగేడియర్ డాక్టర్ అనిల్ కోహ్లీ, పద్మశ్రీ డాక్టర్ ఆర్ కె బాలి, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా,
డెంటల్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ డాక్టర్ దిబ్యేందు మజుందార్, ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ మోంటు ఎం పటేల్, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ డాక్టర్ టి.దిలీప్ కుమార్, రాజ్ భవన్ జమ్మూలోని సర్దార్ పటేల్ పీజీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ అండ్ మెడికల్ సైన్స్, బుద్ధా డెంటల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, జమ్ముకశ్మీర్ నర్సింగ్ కాలేజ్, మచిలీపట్నం నర్సింగ్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్, డెంటల్ కాలేజ్, రిమ్స్, రాంచీ, సవీత డెంటల్ కాలేజ్, చెన్నై, శిక్షా 'ఓ' అనుసంధన్ (ఐడీఎస్) లకు చెందిన అధ్యాపకులు, విద్యార్థులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.
****
(Release ID: 2002860)
Visitor Counter : 124