వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

భారత్‌-డొమినికన్ రిపబ్లిక్ మధ్య 'ఉమ్మడి ఆర్థిక & వాణిజ్య కమిటీ' ఏర్పాటు కోసం విధివిధానాలను ఆమోదించిన కేంద్ర మంత్రివర్గం

Posted On: 24 JAN 2024 6:03PM by PIB Hyderabad

కేంద్ర వాణిజ్యం & పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర వాణిజ్య విభాగం - డొమినికన్ రిపబ్లిక్‌ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మధ్య 'జాయింట్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ కమిటీ' (జెట్కో) ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాల పత్రంపై సంతకం చేసే ప్రతిపాదనకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

భారత్‌-డొమినికన్ రిపబ్లిక్ మధ్య చక్కటి స్నేహ సంబంధం ఉంది, అన్ని రంగాల్లో సహకారం కొనసాగుతోంది. ప్రస్తుతం, వర్తకం & వాణిజ్యం విషయంలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంస్థాగత యంత్రాంగం లేదు. డొమినికన్ రిపబ్లిక్ నుంచి భారత్‌ ప్రధానంగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. ఆ దేశానికి ఔషధాలు, సముద్ర ఉత్పత్తులు, మోటారు వాహనాలు, ద్వి చక్ర & త్రి చక్ర వాహనాలు వంటివి ఎగుమతి చేస్తుంది.

జెట్కో ఏర్పాటుతో భారత్‌-డొమినికన్ రిపబ్లిక్ మధ్య ఆర్థిక బంధం మరింత బలోపేతం అవుతుంది. సమాచారం, విజ్ఞానం, ఆలోచనల మార్పిడికి మార్గం సుగమం అమవుతుంది, తద్వారా వర్తకం & వాణిజ్య పరిశ్రమలకు కొత్త బాటలు ఏర్పడతాయి. ఈ విధివిధానాల పత్రం లాటిన్ అమెరికన్, కరేబియన్ మార్కెట్లలో ప్రవేశానికి సులువైన ద్వారంలా ఉంటుంది.

ఉమ్మడి కమిటీ వల్ల రెండు దేశాల అధికార్ల మధ్య సమాచార మార్పిడికి ఒక వేదిక రూపొందుతుంది. ఇది వస్తు & సేవల వ్యాపారాన్ని సులభంగా మారుస్తుంది, రెండు దేశాల్లోని నిపుణులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడంలో సాయపడుతుంది.

జెట్కో ఏర్పాటుతో భారతీయ ఉత్పత్తుల ఎగుమతుల్లో సవాళ్లు తగ్గుతాయి. భారత్‌లో తయారయ్యే ఔషధాలు, వాహనాలు, ఇంజినీరింగ్ వస్తువుల ఎగుమతులు పెరుగుతాయి. ఇది, ఆత్మనిర్భర్ భారత్‌ సాకారం కోసం విదేశీ మారక ద్రవ్య నిల్వలను పెంచుతుంది.

***



(Release ID: 1999284) Visitor Counter : 102