వ్యవసాయ మంత్రిత్వ శాఖ

రైతుల సంక్షేమం కోసం అనేక చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం


డేర్‌తో సహా, వ్యవసాయం & సహకార విభాగానికి బడ్జెట్ కేటాయింపులు 2013-14లోని రూ.27,662.67 కోట్ల నుంచి 2023-24లో రూ.1,25,035.79 కోట్లకు పెంపు

Posted On: 18 JAN 2024 2:07PM by PIB Hyderabad

‘గత 5 ఏళ్లలో బడ్జెట్‌ కేటాయింపుల్లో రూ.లక్ష కోట్లు కోత పెట్టిన వ్యవసాయ మంత్రిత్వ శాఖ’ అనే శీర్షికతో ఒక వార్తా కథనం ప్రచురితమైంది. మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి వివరణ అడగకుండానే నిధుల కోత కథనాన్ని ప్రచురించారు. కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను మాత్రం అందులో పేర్కొనలేదు. రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. డేర్‌తో సహా వ్యవసాయం & సహకార విభాగానికి బడ్జెట్ కేటాయింపులను అనేక రెట్లు పెంచింది. 2013-14లో ఈ కేటాయింపులు రూ.27,662.67 కోట్లు కాగా, 2023-24లో అవి రూ.1,25,035.79 కోట్లకు చేరాయి.

కేంద్ర వ్యవసాయం & రైతుల సంక్షేమ శాఖ బడ్జెట్‌లో మూడు ప్రధాన పథకాలు ఉన్నాయి, మొత్తం బడ్జెట్‌ కేటాయింపుల్లో వాటి వాటా 80-85% వరకు ఉంటుంది. వాటిలో, పీఎం-కిసాన్‌ పథకం 2019లో ప్రారంభమైంది. 30.11.2023 నాటికి, 'డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్' (డీబీటీ) ద్వారా 11 కోట్ల మందికి పైగా రైతులకు రూ.2.81 లక్షల కోట్లకు పైగా నగదు విడుదలైంది. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) 2016లో ప్రారంభమైంది. గత 7 సంవత్సరాల్లో 49.44 కోట్ల మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు, వారిలో 14.06 కోట్ల (తాత్కాలిక లెక్క) రైతులకు రూ.1,46,664 కోట్లకు పైగా క్లెయిమ్‌లు స్వీకరించారు. వ్యవసాయ రంగానికి సంస్థాగత రుణం 2013-14లోని రూ.7.3 లక్షల కోట్ల నుంచి 2022-23 నాటికి రూ.21.55 లక్షల కోట్లకు పెరిగింది. కేసీసీ ద్వారా సంస్థాగత రాయితీ రుణం ప్రయోజనాన్ని ఇప్పుడు పశు సంవర్ధక, మత్స్య రైతులు కూడా పొందుతున్నారు.

పైన చెప్పిన మూడు ప్రధాన కేంద్ర రంగ పథకాలు భూమి ఉన్న అర్హులైన రైతులందరికీ అందుతున్నాయి. ఈశాన్య ప్రాంతంలో భూమి యాజమాన్యం సంఘ ఆధారితం. ఆ ప్రాంతంలో సాగు చేయదగిన భూమి తక్కువగా ఉంది కాబట్టి, ఈ పథకాలపై చేసే వ్యయం ఈశాన్య రాష్ట్రాల్లో 10% తక్కువగా ఉంటుంది. బడ్జెట్‌ కేటాయింపుల్లో మిగిలిన మొత్తం ఇతర పథకాలు, విభాగాల కోసం అందుబాటులో ఉంటుంది.

నిధుల అవసరాలపై రాష్ట్ర ప్రభుత్వాలు, రైతు సంఘాలు, పథకాలను అమలు చేసే ఏజెన్సీలతో సంప్రదించిన తర్వాత, కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రాయోజిత పథకాల కోసం బడ్జెట్ అంచనాలను (బీఈ) వ్యవసాయం & సహకార విభాగం సిద్ధం చేస్తుంది. ఆ సంవత్సరంలో వాస్తవ వ్యయం, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద మిగిలిన నిల్వలు, నిధుల అవసరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, సవరించిన అంచనా (ఆర్‌ఈ) దశలో కేటాయింపులు పెరుగుతాయి/తగ్గుతాయి. గత 4 సంవత్సరాల్లో, ఆర్‌ఈ దశలో ఈ ఖాతా తప్పనిసరి సవరింపు ద్వారా మిగిలిన మొత్తం రూ.64900.12 కోట్లుగా ఉంది. ఈశాన్య ప్రాంతానికి మొత్తం కేటాయింపులో 10% తగ్గింపు నిబంధన కారణంగా సుమారు రూ.40,000 కోట్ల మొత్తం తగ్గించడం జరిగింది.

కేంద్ర ప్రాయోజిత పథకాలైన రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, కృషివున్నతి యోజనను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు నిదానంగా ఉండటం, నిధుల విడుదల విషయంలో కొత్త విధానం కారణంగా క్షేత్ర స్థాయిలో నిధుల వ్యయం తక్కువగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర వాటాను చేర్చి సకాలంలో నిధులను ఖర్చు చేయాలి. ఆ తర్వాత కేంద్రం నుంచి తదుపరి దఫా నిధులు విడుదలవుతాయి. వ్యవసాయం & రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, నిధులను సరైన సమయంలో ఖర్చు చేసిన రాష్ట్రాలకు తదుపరి దఫాల్లో తగినన్ని నిధులను అందుబాటులో ఉంచింది, రైతు సంక్షేమ పథకాల అమలుకు నిధుల కొరత లేకుండా చూస్తోంది. 

***



(Release ID: 1997574) Visitor Counter : 258