శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రారంభమైన ఐఎస్ఎఫ్ 2023


శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణలు భారతదేశానికి ప్రపంచ ఖ్యాతిని సాధించాయి.. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

Posted On: 17 JAN 2024 5:03PM by PIB Hyderabad

ఫరీదాబాద్ లోని ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ (టీహెచ్ఎస్టీఐ)-రీజినల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ (ఆర్సీబీ)లో ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2023(ఐఐఎస్ఎఫ్ 2023)ఈరోజు ప్రారంభమయింది. ఐఐఎస్ఎఫ్ 2023 ప్రారంభ కార్యక్రమంలో  కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి  (స్వతంత్ర బాధ్యత) డాక్టర్ జితేంద్ర సింగ్ పాల్గొని ప్రసంగించారు. శాస్త్ర సాంకేతిక రంగంలో భారత్ మూడు ముఖ్యమైన విజయాలు సాధించిన నేపథ్యంలో జరుగుతున్న ఐఐఎస్ఎఫ్ 2023 ప్రాధాన్యత సంతరించుకుంది అని  మంత్రి పేర్కొన్నారు.  చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతంలో భారత్ ప్రయోగించిన  చంద్రయాన్ -3 విజయవంతంగా దిగడం, డీఎన్ఏ వ్యాక్సిన్ ను తయారు చేసిన తొలి దేశంగా భారత్ గుర్తింపు సాధించడం, ఆరోమా మిషన్ ఐఐఎస్ఎఫ్ 2023 కు ప్రాధాన్యత ఏర్పడిందన్నారు.  ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం  ఐదో స్థానంలో ఉందన్నారు. శాస్త్ర సాంకేతిక, వినూత్న ఆవిష్కరణలు భారతదేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. రెండు సంవత్సరాల వ్యవధిలో కేంద్ర ప్రభుత్వం శాస్త్ర, సాంకేతిక రంగాలకు సంబంధించిన 5 ప్రధాన అంశాలపై విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుకుందని మంత్రి వివరించారు. అంతరిక్ష రంగంలో  ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం, నేషనల్ క్వాంటమ్ మిషన్, అనుసంధాన్-నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎన్ఆర్ఎఫ్), నేషనల్ జియోస్పేషియల్ పాలసీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ) లాంటి ప్రధాన  సంస్కరణలు.రెండు సంవత్సరాల కాలంలో అమలు అయ్యాయని మంత్రి వివరించారు.   శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ద్వారా జాతీయ అభివృద్ధి కోసం స్థానిక  సమస్యల పరిష్కారానికి స్వదేశీ  భారతీయ పరిష్కారాలు,  పరిశోధన కోసం సమాచార సేకరణ, దేశ ప్రజల కోసం భారత డాక్టర్లు, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం అంశాలకు కేంద్రం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి వివరించారు.

 2015 నుంచి ఐఐఎస్ఎఫ్ ను నిర్వహిస్తున్నారు. గతంలో 8 సార్లు  ఐఐఎస్ఎఫ్ జరిగింది.  ఐఐఎస్ఎఫ్ 2023 ని వినూత్నంగా, అందరినీ ఆకట్టుకునే విధంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరిగాయి. ' అమృత కాలంలో ప్రజలకు శాస్త్ర సాంకేతిక ఫలాలు'' అనే ఇతివృత్తంతో  ఐఐఎస్ఎఫ్ 2023 జరుగుతుంది. 

 ప్రారంభోత్సవ కార్యక్రమంలో హర్యానా ప్రభుత్వ ఉన్నత విద్య, రవాణా, గనులు మరియు భూగర్భ శాఖ మంత్రి శ్రీ మూల్ చంద్ శర్మ . కేంద్ర  పీఎస్ఏ ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్  డీఎస్టీ  కార్యదర్శి ప్రొఫెసర్ అభయ్ కరండికర్, ఎంవోఈఎస్, కార్యదర్శిడాక్టర్ ఎం.రవిచంద్రన్,  డీఎస్ఐఆర్ కార్యదర్శి డాక్టర్ ఎన్ కలైసెల్వి, సీఎస్ఐఆర్ డీజీ డాక్టర్ రాజేశ్ ఎస్ గోఖలే, డీఎస్టీ సంయుక్త కార్యదర్శి   ఎ.ధనలక్ష్మి,  విజ్ఞాన భారతి (విభా) జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ,   శ్రీ శివ కుమార్ శర్మ తదితరులు పాల్గొన్నారు. 

ఐఎస్ఎఫ్ 2023లో 23 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటున్నారని డీఎస్టీ  కార్యదర్శి ప్రొఫెసర్ అభయ్ కరండికర్ తెలిపారు. సైన్స్ రంగంలో దేశం సాధించిన అభివృద్ధి, విజయాలకు ఐఐఎస్ఎఫ్ అద్దం పడుతుందన్నారు. నాలుగు రోజుల పాటు ఐఐఎస్ఎఫ్ జరుగుతుందని ఆయన తెలిపారు. 2024 జనవరి 20 వరకు జరిగే ఐఐఎస్ఎఫ్ లో ప్రజలు పాల్గోవాలని ఆయన కోరారు. దేశాభివృద్ధిలో సైన్స్ ప్రాధాన్యత గుర్తించి యువత, పరిశోధకులు తమ వంతు పాత్ర నిర్వర్తించడానికి ఐఐఎస్ఎఫ్ ద్వారా స్ఫూర్తి పొందాలని ఆయన సూచించారు. 

ప్రారంభ సమావేశంలో ఐఐఎస్ఎఫ్ ప్రోగ్రామ్ గైడ్, ఐఐఎస్ఎఫ్ న్యూస్ బులెటిన్ ప్రాంతీయ భాషల ప్రత్యేక సంచికలను  ప్రముఖులు విడుదల చేశారు. ఈ భాషా సంచికలు ఏడు భారతీయ భాషలలో (మలయాళం, బంగ్లా, హర్యాన్వీ, భోజ్పురి, హిందీ, మరాఠీ మరియు ఉర్దూ) వెలువడ్డాయి. సీఎస్ఐఆర్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ (ఎన్ఐఎస్సీపీఆర్)కు చెందిన సైన్స్ మీడియా కమ్యూనికేషన్ సెల్ (ఎస్ఎంసీసీ) ఐఐఎస్ఎఫ్ న్యూస్ బులెటిన్  ఈ భాషా సంచికలను రూపొందించి ప్రచురించింది.

హరియాణా రాష్ట్ర  మంత్రి శ్రీ మూల్ చంద్ శర్మ మాట్లాడుతూ విజ్ఞానం, సృజనాత్మక ఆలోచనలు మార్పిడి ద్వారా దేశం పురోగతి సాధిస్తుందన్నారు. శాస్త్ర సాంకేతిక ఆధారిత అంశాల  మార్పిడికి  ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ సరైన వేదిక అని ఆయన అన్నారు. .
 ఆసక్తికరమైన, మేధో మార్గాల్లో ప్రజలకు విలువైన శాస్త్ర సాంకేతిక సమాచారం అందుబాటులోకి తేవడం లక్ష్యంగా ఐఐఎస్ఎఫ్ 2023 జరుగుతుందని కేంద్ర  ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ (పిఎస్ఎ) ప్రొఫెసర్ అజయ్ సూద్ తెలిపారు. . ఐఐఎస్ఎఫ్ తన కార్యక్రమాలు, కార్యక్రమాల ద్వారా శాస్త్రీయ అంశాలపై లోతైన అవగాహన పొందడానికి విస్తృతమైన అవకాశాలను కల్పిస్తుందని ఆయన అన్నారు.

విజ్ఞాన భారతి (విభా) ఇండియా జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ శివకుమార్ మాట్లాడుతూ భారతీయ   సంప్రదాయం, విలువల్లో సైన్స్ ఇమిడి ఉందన్నారు.  ఆలోచించడమే లక్ష్యంగా సైన్స్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఐఐఎస్ఎఫ్ 2023 ప్రోగ్రాం కమిటీ చైర్మన్ డాక్టర్ పీఎస్ గోయల్ సైన్స్ కింది స్థాయి ఆవిష్కరణలను సమాజంలోకి తీసుకు వెళ్లేందుకు జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా  ఒక అట్టడుగు ఆవిష్కర్త కనుగొన్న ఆవు పేడ కుండ, మిట్టి కూల్ వాటర్ బాటిల్ ను అతిధులకు  అందజేశారు.


నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్ఐఎఫ్) ఇండియా డైరెక్టర్, ఐఐఎస్ఎఫ్ 2023 చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ అరవింద్ సి రనడే కృతజ్ఞతలతో  ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసింది.ఐఐఎస్ఎఫ్ 2023 ని  భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ (డి ఎస్ టి) పరిధిలో  స్వయంప్రతిపత్తి సంస్థగా పనిచేస్తున్న  ఎన్ఐఎఫ్-ఇండియా  నిర్వహిస్తోంది. 

ఐఐఎస్ఎఫ్ 2023 మొదటి రోజున 

స్టూడెంట్ సైన్స్ విలేజ్, ఫేస్ టు ఫేస్ విత్ న్యూ ఫ్రాంటియర్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ త్రూ గేమ్స్ అండ్ టాయ్స్, స్టూడెంట్స్ ఇన్నోవేషన్ ఫెస్టివల్ - స్పేస్ హ్యాకథాన్ 2023, రాష్ట్ర ఎస్ అండ్ టీ మంత్రులు, కేంద్ర, రాష్ట్ర ఎస్ అండ్ టీ కార్యదర్శులు, అధికారుల సదస్సు ,  నేషనల్ సైన్స్ టీచర్స్ వర్క్ షాప్, యంగ్ సైంటిస్ట్స్ కాన్ఫరెన్స్,  న్యూ ఏజ్ టెక్నాలజీ షో, నేషనల్ సోషల్ ఆర్గనైజేషన్స్ అండ్ ఇన్ స్టిట్యూషన్స్ మీట్ (ఎన్ ఎస్ ఓఐఎం), సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఎగ్జిబిషన్, ఇండియా ఇంటర్నేషనల్ కొలాబరేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. 
డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ)-రీజినల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ (ఆర్సీబీ), ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ (టీహెచ్ఎస్టీఐ), ఫరీదాబాద్ (హర్యానా) లో  2024 జనవరి 17 నుంచి 20 వరకు ఈ మెగా సైన్స్ ఫెస్టివల్ జరుగుతుంది. 
 సీఎస్ఐఆర్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ (ఎన్ఐఎస్సీపీఆర్)లోని సైన్స్ మీడియా కమ్యూనికేషన్ సెల్ (ఎస్ఎంసీసీ) ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (ఐఐఎస్ఎఫ్) 2023 మీడియా ప్రచారాన్ని సమన్వయం చేస్తోంది. భారతదేశం యొక్క పరిశోధన మరియు అభివృద్ధి పురోగతులు మరియు శాస్త్రీయ విజయాలను వివిధ మీడియా వేదికలపై వ్యాప్తి చేయడం మరియు ప్రదర్శించడం  ఎస్ఎంసీసీ  ముఖ్య ఉద్దేశ్యం. మరింత సమాచారం కోసం   https://niscpr.res.in/    లేదా @CSIR-NISCPR లను సంప్రదించవచ్చు. 

***


(Release ID: 1997161) Visitor Counter : 171


Read this release in: English , Urdu , Hindi , Tamil