ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

కేరళలో “సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఇంటెలిజెంట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సెన్సార్స్”, “ఇండియా ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ గ్రాఫేన్” ప్రారంభం

Posted On: 17 JAN 2024 8:46PM by PIB Hyderabad

కేరళ పర్యటనలో ఉన్న కేంద్ర ఎలక్ట్రానిక్స్ & సమాచార సాంకేతికత శాఖ (మైటీ) కార్యదర్శి శ్రీ ఎస్ కృష్ణన్, ఈ రోజు, కొచ్చిలోని 'మేకర్ విలేజ్‌'లో రెండు ప్రధాన కార్యక్రమాలు - “సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోయీ) ఇన్ ఇంటెలిజెంట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఐవోటీ) సెన్సార్స్‌”, దేశంలోని మొదటి గ్రాఫేన్ కేంద్రం “ఇండియా ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ గ్రాఫేన్ (ఐఐసీజీ)ను ప్రారంభించారు.

ఇంటెలిజెంట్ ఐవోటీ వ్యవస్థల కోసం సెన్సార్ల అభివృద్ధిని ప్రోత్సహించడానికి, కొచ్చిలోని 'మేకర్స్ విలేజ్‌'లో మైటీ & కేరళ ప్రభుత్వం కలిసి ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక ఉత్పత్తి కేంద్రం "సీవోయీ ఇన్‌ ఐఐవోటీ". నెట్‌వర్క్‌లు, పరికరాలు, సెన్సార్ వ్యవస్థల్లో ఇంటెలిజెంట్ సెన్సార్ల విస్తృత వినియోగాన్ని పెంచడం దీని లక్ష్యం.  

దేశంలో మొట్టమొదటి గ్రాఫేన్ కేంద్ర ఐఐసీజీ ఏర్పాటులో మైటీ, కేరళ ప్రభుత్వంతో టాటా స్టీల్ లిమిటెడ్‌ కూడా చేతులు కలిపింంది. గ్రాఫేన్, 2డి మెటీరియల్ వ్యవస్థల్లో ఆర్‌&డీ, ఉత్పత్తుల ఆవిష్కరణ, సామర్థ్య నిర్మాణాన్ని ఇక్కడ ప్రోత్సహిస్తారు.

'డిజిటల్ యూనివర్శిటీ కేరళ' (గతంలో ట్రిపుల్‌ఐటీఎంకే), త్రిస్సూర్‌లోని 'సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ' (సీఎంఈటీ) సాంకేతిక భాగస్వామ్యం అందించాయి. ఆర్‌&డీ, ఇంక్యుబేషన్, ఆవిష్కరణ, నైపుణ్యం, సామర్థ్యం పెంపు, పరీక్ష & ధృవీకరణను ఈ రెండు ఏజెన్సీల నిపుణులు ఈ కేంద్రాల్లో నిర్వర్తిస్తారు.

డిజిటల్ పరివర్తన, ఆర్థిక వృద్ధిని ముందుకు నడిపించడంలో ఐఐవోటీ సెన్సార్లు, గ్రాఫేన్ సాంకేతికతలు కీలక పాత్ర పోషిస్తాయని శ్రీ ఎస్ కృష్ణన్ చెప్పారు. మన దేశంలో ఐవోటీ సెన్సార్లు, గ్రాఫేన్ & 2డి మెటీరియల్స్ విభాగాల్లో అంకుర సంస్థల కోసం పూర్తి ప్రోత్సాహక వాతావరణాన్ని సృష్టించడమే ఈ రెండు కేంద్రాలను ఏర్పాటు ప్రధాన లక్ష్యమని వివరించారు.

'మేకర్ విలేజ్' వార్షిక కార్యక్రమం 'హార్డ్‌టెక్ 2024'ని కూడా శ్రీ ఎస్ కృష్ణన్ ప్రారంభించారు. ఎలక్ట్రానిక్స్ హార్డ్‌వేర్ అభివృద్ధి, తయారీ రంగంలో పరిశ్రమలు, అంకుర సంస్థలు, పెట్టుబడిదార్లు, విద్యాసంస్థలు, ఆర్‌&డీ సంస్థల ప్రతినిధులను ఒకే వేదికపైకి చేర్చే కార్యక్రమం ఇది.

మైటీ అదనపు కార్యదర్శి శ్రీ భువనేష్ కుమార్, మైటీ సంయుక్త కార్యదర్శి & ఆర్థిక సలహాదారు శ్రీ రాజేష్ సింగ్, కేరళ ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ & సమాచార సాంకేతికత శాఖ కార్యదర్శి డా.రథన్ యు కేల్కర్, డిజిటల్ యూనివర్శిటీ కేరళ ఉప కులపతి ప్రొ. సాజీ గోపీనాథ్‌, టాటా స్టీల్‌లో న్యూ మెటీరియల్స్ వ్యాపార విభాగాధిపతి శ్రీ ఎన్ సాయినాథన్, భారత ప్రభుత్వం & కేరళ ప్రభుత్వ అధికార్లు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.



(Release ID: 1997159) Visitor Counter : 95


Read this release in: English , Urdu , Hindi