నీతి ఆయోగ్
azadi ka amrit mahotsav

భారతదేశంలో మానసిక ఆరోగ్య సేవలు-సంరక్షణ బలోపేతం


నీతి ఆయోగ్ నేతృత్వంలో రాష్ట్రాలకు మద్దతు కార్యక్రమం కింద జాతీయ వర్క్‌షాప్‌

Posted On: 11 JAN 2024 7:17PM by PIB Hyderabad

   ‘‘భారత్‌లో మానసిక ఆరోగ్య సేవలు-సంరక్షణ బలోపేతం’’ అంశంపై బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (నిమ్హాన్స్)లో 2024 జనవరి 9న జాతీయ వర్క్‌షాప్‌ నిర్వహించబడింది. నీతి ఆయోగ్ నిర్వహించిన ఈ సదస్సుకు కేంద్ర/కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలు సహకరించాయి. జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమం (డిఎంహెచ్‌పి) అమలులో అంతరాలు-సమస్యలపై రాష్ట్రాలుసహా ఇతర భాగస్వాముల నుంచి అభిప్రాయ సేకరణ లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహించబడింది. దీంతోపాటు ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో అనుభవాలు, ఉత్తమాచరణల గురించి సమాచార సేకరణ కూడా చేపట్టారు. ఈ పద్ధతులను ఇతర రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా అనుసరించడంపైనా చర్చించారు.

   ఒకరోజు నిర్వహించిన ఈ జాతీయ వర్క్‌షాప్‌కు నీతి ఆయోగ్ గౌరవ సభ్యుడు (ఆరోగ్య విభాగం)  డాక్టర్ వి.కె.పాల్ అధ్యక్షత వహించారు. జాతీయ వైద్య కమిషన్ చైర్మన్-ప్రెసిడెంట్ డాక్టర్ బి.ఎన్.గంగాధర్; కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆర్థిక సలహాదారు శ్రీమతి ఇంద్రాణి కౌశల్; డైరెక్టర్, నిమ్హాన్స్ డైరెక్టర్ డాక్టర్ ప్రతిమా మూర్తి; కర్ణాటక ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ టి.కె.అనిల్ కుమార్ కూడా దీనికి హాజరయ్యారు. అలాగే రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ, ‘డిజిహెచ్ఎస్’, ‘ఐసిఎంఆర్’ల నుంచి సీనియర్ అధికారులు, భారతదేశంలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ), యునిసెఫ్ నుంచి రంగాలవారీ అధికారులు, సాంకేతిక నిపుణులు కూడా పాల్గొన్నారు. అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ-మానసిక ఆరోగ్య రంగాల్లో సహకరిస్తున్న అభివృద్ధి భాగస్వాములు కూడా హాజరయ్యారు. రాష్ట్రాలకు మద్దతు కార్యక్రమం కింద చేపడుతున్న ‘నీతి-రాష్ట్ర వర్క్‌షాప్’ల పరంపరలో భాగంగా ఈ సదస్సు నిర్వహించబడింది.

   ప్రారంభ కార్యక్రమంలో భాగంగా వర్క్‌షాప్ సందర్భాన్ని వివరించే దిశగా నీతి ఆయోగ్ ఒక సంక్షిప్త ప్రదర్శన ఏర్పాటు చేసింది. అనంతరం ఆరోగ్-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ వివరణాత్మక ప్రదర్శన ఇచ్చింది. జాతీయ-జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమం ప్రస్తుత స్థితిగతులు, దాని అమలు బలోపేతంపై అనుసరించే ప్రతిపాదిత వ్యూహాలను ఈ ప్రదర్శనలో వివరించింది. అటుపైన కర్ణాటక ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ముఖ్య కార్యదర్శి ‘‘బళ్లారి మోడల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్: కర్టాటక సక్సెస్ స్టోరీ’’ పేరిట సమగ్ర ప్రదర్శన ఇచ్చారు. రాష్ట్రంలో మానసిక ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను ఆయన కూలంకషంగా వివరించారు. ‘టెలి-మానస్‌’ కింద ఇటీవల ప్రవేశపెట్టిన అంశాల్లో భాగంగా అనుభవాలు-సమస్యలు-ముందడుగుకు మార్గాల గురించి ‘నిమ్హాన్స్’ డైరెక్టర్ వివరణాత్మక ప్రదర్శన ఇవ్వడంతో సాంకేతిక చర్చాగోష్ఠి ముగిసింది.

   ఈ వర్క్‌షాప్ సంబంధిత మిగిలిన అంశాలపై- ప్రత్యేక బృంద చర్చలతోపాటు 3 అభిప్రాయ ఆదానప్రదాన గోష్ఠుల కింద నాలుగు విభాగాలుగా సదస్సు నిర్వహించారు. సమస్యల పరిష్కారం, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుత కార్యక్రమాలు-ఉత్తమ పద్ధతుల ఆదానప్రదానం, దేశవ్యాప్తంగా సమగ్ర మానసిక ఆరోగ్య సంరక్షణ పర్యావరణ వ్యవస్థకు మార్గం సుగమం చేయడం తదితర అంశాలపై ఈ నాలుగు విభాగాల సదస్సులలో దృష్టి సారించారు. ఈ గోష్ఠులలో ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలు, జాతీయ వైద్య కమిషన్, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, నిమ్హాన్స్, ‘టిస్’ ‘ఐబిహెచ్ఎస్’ల నుంచి రంగాలవారీ నిపుణులు, భారతదేశంలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ), ‘యునిసెఫ్’ల నుంచి ప్రతినిధులు, కీలక అభివృద్ధి భాగస్వామ్య సంస్థల సీనియర్ అధికారులు వీటిలో పాల్గొన్నారు.

   ఈ సందర్భంగా జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమ బలోపేతంపై ప్రతినిధులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, మానవ వనరుల శిక్షణ, చికిత్స-ఐఇసి; ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ద్వారా మానసిక అనారోగ్య పీడితుల వ్యక్తుల హక్కులు, పునరేకీకరణ, పునరావాసం, సాధికారత సహా ప్రాథమిక మానసిక ఆరోగ్య సంరక్షణ విధానాల రూపకల్పన-సదుపాయాల పెంపు అంశాలపై లోతుగా చర్చించారు. క్షేత్రస్థాయిలో తక్షణ పరిష్కారం అన్వేషించాల్సిన సమస్యలపై దేశంలోని 31 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహించిన వారు తమ అభిప్రాయాలను పంచుకోవడంలో కీలక పాత్ర పోషించారు.

   ముగింపు కార్యక్రమంలో నీతి ఆయోగ్ గౌరవనీయ సభ్యుడు (ఆరోగ్యం) ప్రసంగిస్తూ- మానసిక అనారోగ్యాలు-రుగ్మతల చికిత్స దిశగా అపరిష్కృత అవసరాల పరిష్కారం కోసం ఓ కొత్త జాతీయ మానసిక ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాన్ని వినూత్న రీతిలో రూపొందించేందుకు కృషి చేయాలని సూచించారు. అలాగే సమగ్ర, సమర్థ సేవాప్రదానం దిశగా విస్తృత, సార్వజనీన దృక్కోణాన్ని ప్రోత్సహించాలన్నారు. సంప్రదాయ వైద్యవిధానంలోని ఉత్తమాంశాల ఏకీకరణ ద్వారా సమగ్ర విధానం రూపొందించడం అవసరమని చెప్పారు. మానసిక అనారోగ్య చికిత్స, సామాజిక మానసిక కార్యాచరణ, స్నాతకోత్తర స్థాయి మానసిక చికిత్స అధ్యయనశాస్త్ర విద్యలో సీట్ల సంఖ్య పెంపు వంటి చర్యల ద్వారా మానసిక ఆరోగ్య సంరక్షణ సిబ్బంది స్థాయిని, సంఖ్యను పెంచాల్సి ఉందని స్పష్టం చేశారు.

***


(Release ID: 1995560) Visitor Counter : 258


Read this release in: English , Urdu , Hindi