ఆయుష్

ఐసిడి-11, ట్రెడిషనల్ మెడిసిన్ మాడ్యూల్ 2 ను విడుదల చేసిన డబ్ల్యూహెచ్ఓ


మాడ్యూల్ ను ప్రారంభించిన కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ముంజ్పర మహేంద్రభాయ్

ఆయుర్వేదం, యునాని, సిద్ధ వైద్యానికి సంబంధించిన మోర్బిడిటీ కోడ్ లను చేర్చడం వల్ల సంప్రదాయ వైద్యానికి పెద్ద ఎత్తున ఊతం లభిస్తుంది.

Posted On: 10 JAN 2024 6:21PM by PIB Hyderabad

ఐసిడి-11, ట్రెడిషనల్ మెడిసిన్ మాడ్యూల్ 2 ను ఈరోజు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా మాడ్యూల్  అమలుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఆయుర్వేదం, సిద్ధ, యునాని మెడిసిన్ ఆధారిత వ్యాధులకు సంబంధించిన డేటా, పరిభాషను డబ్ల్యూహెచ్ వో ఐసీడీ-11 వర్గీకరణలో చేర్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తీసుకున్న నిర్ణయంతో  ఆయుర్వేదం, యునాని, సిద్ధ వైద్యంలో వ్యాధులను నిర్వచించే పరిభాషను ఒక కోడ్ గా ఇండెక్స్ చేసి డబ్ల్యూహెచ్ వో డిసీజ్ క్లాసిఫికేషన్ సిరీస్ ఐసీడీ-11లో చేర్చారు.

ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో ఐసిడి -11 సిరీస్  టిఎం -2 మాడ్యూల్ కింద ఆయుర్వేదం, సిద్ధ మరియు యునాని వ్యవస్థలలో ఉపయోగించే వ్యాధుల వర్గీకరణను సిద్ధం చేసింది. ఈ వర్గీకరణ కోసం గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆయుష్ మంత్రిత్వ శాఖ మధ్య డోనర్ అగ్రిమెంట్ కూడా కుదిరింది. ఈ ప్రయత్నం భారతదేశ ఆరోగ్య సంరక్షణ పంపిణీ వ్యవస్థ, పరిశోధన, ఆయుష్ భీమా కవరేజీ, పరిశోధన  అభివృద్ధి, విధాన రూపకల్పన వ్యవస్థను మరింత బలోపేతం చేసి  విస్తరిస్తుంది.ఇది కాకుండా వివిధ వ్యాధులను నియంత్రించడానికి భవిష్యత్తు వ్యూహాలను రూపొందించడానికి కూడా ఈ కోడ్లు  ఉపయోగపడతాయి.

ఇండియా హాబిటాట్ సెంటర్ లో ఐసీడీ-11, టీఎం మాడ్యూల్-2ను  కేంద్ర ఆయుష్, మహిళా శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ముంజపర మహేంద్రభాయ్ ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడిన మంత్రి   ఆయుష్ వైద్యాన్ని భారత్ తోపాటు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ ప్రమాణాలతో అనుసంధానం చేయడం ద్వారా ఆధునీకరించాల్సిన అవసరం ఉందన్నారు.

ఆయుష్ మంత్రిత్వ శాఖ ఐసిడి -11, మాడ్యూల్ 2 ఆధారంగా భవిష్యత్తులో ప్రజారోగ్య వ్యూహాన్ని రూపొందిస్తుందని, దీనిని జాతీయంగా మరియు అంతర్జాతీయంగా అమలు చేస్తుందని కేంద్ర  ఆరోగ్య శాఖ  కార్యదర్శి (ఆయుష్)శ్రీ  వైద్య రాజేష్ కొటేచా తెలిపారు. టీఎం మాడ్యూల్ 2 తయారీ విధానాన్ని ఆయన వివరించారు. 

ఐసీడీ-11లో సంప్రదాయ వైద్య పరిభాషను చేర్చడం వల్ల సంప్రదాయ వైద్యానికి, ప్రపంచ ప్రమాణాలకు మధ్య సంబంధం ఏర్పడుతుందని భారత్ లో డబ్ల్యూహెచ్ వో ప్రతినిధి డాక్టర్ రాడారికో హెచ్ ఆఫ్రిన్ తెలిపారు. ఐసిడి -11 లో సాంప్రదాయ వైద్యానికి సంబంధించిన వ్యాధి పరిభాషను ఇండెక్సింగ్ చేయడం ఏకీకృత ప్రపంచ సంప్రదాయాన్ని నిర్మించడంలో ఒక మైలురాయి అని డబ్ల్యూహెచ్ఓ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డిడిఐ డాక్టర్ సమీరా అస్మా అన్నారు. డబ్ల్యూహెచ్ఓ సీనియర్ స్ట్రాటజిక్ అడ్వైజర్ డాక్టర్ శ్యామా కురువిల్లా మాట్లాడుతూ ఐసిడి -11 లో సాంప్రదాయ వైద్య పరిభాషను చేర్చడం వల్ల  భారతదేశం  సాధారణ ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం అవుతుందని  అన్నారు.

ఐసిడి-11లో పొందుపరిచిన డేటా ప్రపంచ ఉపయోగం కోసం అందుబాటులో ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ క్లాసిఫికేషన్ అండ్ టెర్మినాలజీ యూనిట్ హెడ్ డాక్టర్ రాబర్ట్ జాకబ్ తెలిపారు.

ఐసిడి -11 లో టిఎమ్ మాడ్యూల్ 2 ను చేర్చడం సాంప్రదాయ వైద్యానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుతో పాటు ఒక ఉద్యమంగా చూడవచ్చని డబ్ల్యూహెచ్ఓ ఇంటిగ్రేటెడ్ హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ రూడీ ఎగ్గర్స్ చెప్పారు. ఇందుకోసం 2014 నుంచి 2023 వరకు వ్యూహాన్ని రూపొందించగా, 2025 నుంచి 2034 వరకు డబ్ల్యూహెచ్ వో స్ట్రాటజీ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ మొదటి ముసాయిదాను సిద్ధం చేశారు.

డబ్ల్యూహెచ్ఓ సభ్య దేశాలైన బ్రెజిల్, బంగ్లాదేశ్, మలేషియా, మారిషస్, శ్రీలంక, నేపాల్, ఇరాన్, బ్రిటన్ ప్రతినిధులు తమ తమ దేశాల్లో సంప్రదాయ వైద్యం ప్రస్తుత స్థితిగతులపై తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో డబ్ల్యూహెచ్ వో, ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు, దాని పరిశోధనా మండళ్లు, జాతీయ విద్యా సంస్థలు, చైర్మన్లు, సంబంధిత అధ్యక్షులు, నేషనల్ కమిషన్ ఫర్ ఇండియా సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి పాల్గొన్నారు. కార్యక్రమంలో  డబ్ల్యూహెచ్ఓ సభ్య దేశాల ప్రతినిధులు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి కవితా గార్గ్ స్వాగతోపన్యాసం చేశారు.

***

 



(Release ID: 1995131) Visitor Counter : 133


Read this release in: English , Urdu , Marathi , Hindi