పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
చిత్తడి భూముల రామ్ సార్ కన్వెన్షన్ కింద ఇండోర్, భోపాల్, ఉదయ్ పూర్ నగరాలకు వెట్ లాండ్ సిటీ అక్రెడిటేషన్ కోసం ప్రతిపాదనలు దాఖలు చేసిన పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల శాఖ
Posted On:
04 JAN 2024 7:56PM by PIB Hyderabad
ప్రపంచంలో చిత్తడి భూముల ప్రోత్సాహానికి ఉద్దేశించిన రామ్ సార్ కన్వెన్షన్ కింద భారతదేశం నుంచి ఇండోర్ (మధ్యప్రదేశ్), భోపాల్ (మధ్యప్రదేశ్), ఉదయ్ పూర్ (రాజస్తాన్) నగరాలకు వెట్ లాండ్ సిటీ అక్రెడిటేషన్ (డబ్ల్యుసిఏ) కోసం ఎంఓఇఎఫ్ అండ్ సిసి నామినేషన్లు దాఖలు చేసింది. మునిసిపల్ కార్పొరేషన్ల సహకారంతో ఆయా రాష్ర్టాల వెట్ లాండ్ అధికారుల ద్వారా డబ్ల్యుసిఏ కోసం నామినేషన్లు దాఖలు చేసిన తొలి మూడు భారతీయ నగరాలు ఇవే. ఈ నగరాలు, చుట్టుపక్కల ఉన్న చిత్తడి భూములు ఆయా నగరాల పౌరులకు వరదల నియంత్రణ, జీవనోపాధి అవకాశాలు, క్రీడావకాశాలు, సాంస్కృతిక విలువలు అందిస్తున్నాయి. సిర్పూర్ వెట్ లాండ్ (ఇండోర్ లో రామ్ సార్ సైట్), యశ్వంత్ సాగర్ (ఇండోర్ సమీపంలోని రామ్ సార్ సైట్), భోజ్ వెట్ లాండ్ (భోపాల్ లోని రామ్ సార్ సైట్), ఉదయ్ పూర్ చుట్టుపక్కల ఉన్న ఇంకా ఎన్నో వెట్ లాండ్ లు (సరస్సులు) ఆయా నగరాలకు జీవగర్రగా ఉన్నాయి.
మూడు నామినేటెడ్ నగరాలు :
· ఇండోర్ : హోల్కర్లు నిర్మించిన ఇండోర్ నగరం భారతదేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరం. అత్యుత్తమ పారిశుధ్యం, నీరు, పట్టణ పర్యావరణానికిగాను భారత స్మార్ట్ సిటీ అవార్డు 2023ని అందుకుంది. నగరంలోని రామ్ సార్ సైట్ అయిన సిర్పూర్ సరస్సు జల పక్షుల కూడికకు ఇక కీలక స్థలంగా ఉంది. దీన్ని పక్షుల సంరక్షణా కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు. 200 పైగా వెట్ లాండ్ మిత్రలు పక్షుల సంరక్షణ కార్యకలాపాలు నిర్వహించడంతో పాటు సారస్ కొంగల సంరక్షణపై స్థానిక సమాజాన్ని చైతన్యవంతం చేస్తున్నారు.
ఇండోర్ లోని సిర్పూర్
· భోపాల్ : భారతదేశంలోని అత్యంత స్వచ్ఛమైన నగరాల్లో ఒకటైన భోపాల్ ముసాయిదా సిటీ డెవలప్ మెంట్ ప్రణాళిక 2031 కింద సంరక్షణా జోన్లను ప్రతిపాదించింది. నగరంలోని రామ్ సార్ సైట్ అయిన భోజ్ వెట్ లాండ్ లో ప్రపంచ శ్రేణి వెట్ లాండ్ ఇంటర్ ప్రెటేషన్ సెంటర్ జలతరంగ్ ఉంది. దీనికి తోడు భోపాల్ మునిసిపల్ కార్పొరేషన్ లో అంకిత భావం గల సరస్సుల సంరక్షణ విభాగం కూడా ఉంది. ఆ నగరంలో 300 పైగా వెట్ లాండ్ మిత్రలు వెట్ లాండ్ నిర్వహణ, సారస్ కొంగల సంరక్షణ కార్యకలాపాల్లో పని చేస్తున్నారు.
భోపాల్ లోని భోజ్ వెట్ లాండ్
· ఉదయ్ పూర్ : రాజస్తాన్ లోని ఈ నగరం చుట్టుపక్కల ఐదు ప్రధాన చిత్తడి ప్రదేశాలున్నాయి. అవి పిచోలా, ఫతే సాగర్, రామ్ సాగర్, స్వరూప్ సాగర్, దూధ్ తలాయ్. ఈ చిత్తడి ప్రాంతాలు నగర సంస్కృతి, గుర్తింపులో అంతర్గత భాగంగా ఉన్నాయి. ఇవి నగర వాతావరణాన్ని సంరక్షించడంతో పాటు అసాధారణ పరిస్థితుల నుంచి రక్షణ కల్పిస్తున్నాయి.
ఉదయ్ పూర్ లోని ఫతేసాగర్ వెట్ లాండ్
వెట్ లాండ్ సిటీ అక్రెడిటేషన్ (డబ్ల్యుసిఏ) : అర్బన్, పెరీ అర్బన్ వాతావరణంలో చిత్తడి నేలల ప్రాధాన్యతను గుర్తించి , వాటి సంరక్షణకు చర్యలు తీసుకునేందుకు, ఈ చిత్తడి భూములను కాపాడేందుకు 2015 సంవత్సరంలో రామ్ సార్ లో జరిగిన కాప్ 12 సదస్సులో ఆమోదించిన తీర్మానం XII.10 కింద స్వచ్ఛంద వెట్ లాండ్ సిటీ అక్రెడిటేషన్ విధానాన్ని ఆమోదించింది. దీని కింద పట్టణాల్లోని చిత్తడి నేలలను కాపాడడానికి అసాధారణ చర్యలను గుర్తించారు. చిత్తడి నేలల సంరక్షణ, ప్రోత్సాహం; అర్బన్, పెరీ అర్బన్ చిత్తడినేలలను తెలివిగా ఉపయోగించుకోవడం, స్థానిక జనాభాకు స్థిరమైన సామాజిక-ఆర్థిక ప్రయోజనాలు కలిగించడం ఈ వెట్ లాండ్ సిటీ అక్రెడిటేషన్ పథకం ప్రధాన లక్ష్యాలు. దీనికి తోడు ఈ అక్రెడిటేషన్ కింద ఈ చిత్తడి భూముల సమీపంలోని, వాటిపై ఆధారపడిన నగరాలను ప్రోత్సహించడం, ప్రధానంగా చిత్తడినేలల అంతర్జాతీయ ప్రాధాన్యం గల ప్రాంతాలను పరిరక్షించడాన్ని కూడా ప్రోత్సహిస్తారు. ఈ అక్రెడిటేషన్ కు లాంఛనంగా అర్హత సాధించాలంటే అందుకు పోటీ పడుతున్న నగరాలు చిత్తడి నేలల రామ్ సార్ కన్వెన్షన్ పరిధిలోని డబ్ల్యుసిఏ నిర్వహణా మార్గదర్శకాల్లో పొందుపరిచిన ఆరు అంతర్జాతీయ అర్హతల్లో ఏదో ఒక ప్రమాణాన్ని సంతృప్తి పరిచి ఉండాలి. సహజసిద్ధమైన లేదా మానవ నిర్మితమైన సరస్సులు ఆయా నగరాలు అంతర్జాతీయ గుర్తింపు సాధించేందుకు, పాజిటివ్ బ్రాండింగ్ అవకాశాలకు వీలు కల్పిస్తాయి.
ఈ ఏడాది బడ్జెట్లో ప్రతిపాదించిన, ప్రస్తుతం అమలు జరుగుతున్న ఎంఓఇఎఫ్ అండ్ సిసికి చెందిన అమృత్ దరోహార్ కార్యక్రమం కూడా రామ్ సార్ ప్రదేశాల ప్రోత్సాహం కోసం నిర్దేశించిన లక్ష్యాల సాధనకు ఉద్దేశించినదే. డబ్ల్యుసిఏ అర్బన్, పెరీ అర్బన్ ప్రాంతాల్లో చిత్తడి భూముల సంరక్షణ పట్ల ప్రజల్లో చైతన్యం కల్పించడమే కాదు, దేశవ్యాప్తంగా అమృత్ దరోహార్ అమలుకు సహాయకారి అవుతుంది.
***
(Release ID: 1993365)
Visitor Counter : 363