రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

పశ్చిమ నౌకాదళ ఫ్లాగ్ ఆఫీసర్‌ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన వైస్ అడ్మిరల్ సంజయ్ జె సింగ్

Posted On: 03 JAN 2024 6:02PM by PIB Hyderabad

ఏవీఎస్‌ఎం, ఎన్‌ఎం, వైస్ అడ్మిరల్ సంజయ్ జె సింగ్ పశ్చిమ నౌకాదళ కమాండ్ (డబ్ల్యూఎన్‌సీ) ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా  2023 జనవరి 03న బాధ్యతలు స్వీకరించారు. ఐఎన్‌ఎస్‌ షిక్రాలో జరిగిన గౌరవ వందనం నడుమ, వైస్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి నుంచి బాధ్యతలు అందుకున్నారు. ముంబైలోని నౌకాదళ డాక్‌యార్డ్‌లోని గౌరవ్ స్తంభ్ వద్ద అమరవీరులకు పుష్పగుచ్ఛంతో నివాళులు అర్పించారు. డబ్ల్యూఎన్‌సీ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు, వైస్ అడ్మిరల్ సంజయ్ జె సింగ్ న్యూదిల్లీలోని నౌకాదళ ప్రధాన కార్యాలయంలో వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

వైస్ అడ్మిరల్ సంజయ్ జె సింగ్ పుణెలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. 1986లో నౌకాదళ ఎగ్జిక్యూటివ్ విభాగంలో నియమితులయ్యారు. 37 సంవత్సరాల ఆయన ఉద్యోగ జీవితంలో, భారత నౌకాదళానికి చెందిన చాలా తరగతుల ఓడల్లో పని చేశారు. అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ (కమ్యూనికేషన్స్, స్పేస్, నెట్‌వర్క్-సెంట్రిక్ ఆపరేషన్స్) సహా అనేక రకాల కమాండ్, శిక్షణ, సిబ్బంది నియామకాల విభాగాలను పర్యవేక్షించారు. ఫ్లాగ్ ఆఫీసర్ సీ ట్రైనింగ్, ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ వెస్ట్రన్ ఫ్లీట్, కమాండెంట్ నేవల్ వార్ కాలేజ్, కంట్రోలర్ పర్సనల్ సర్వీసెస్, డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ (ఆపరేషన్స్)గాను సేవలు అందించారు.

1992లో నావిగేషన్, డైరెక్షన్‌లో నైపుణ్యం సాధించారు. 2000లో యూకేలో అడ్వాన్స్‌డ్ కమాండ్ అండ్ స్టాఫ్ కోర్సు అభ్యసించారు. 2009లో ముంబైలోని నావల్ వార్ కాలేజీలో నావల్ హయ్యర్ కమాండ్ కోర్సును, 2012లో దిల్లీ నేషనల్ డిఫెన్స్ కాలేజీలో నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ కోర్సును నేర్చుకున్నారు.

మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి డిఫెన్స్ అండ్‌ స్ట్రాటజిక్ స్టడీస్‌లో ఎంఎస్‌సీ, ఎంఫిల్ పూర్తి చేశారు. లండన్‌లోని కింగ్స్ కాలేజీ నుంచి డిఫెన్స్ స్టడీస్‌లో ఎంఏ, ముంబై విశ్వవిద్యాలయంలో ఎంఏ (చరిత్ర), ఎంఫిల్ (పాలిటిక్స్‌), పీహెచ్‌డీ (ఆర్ట్స్‌) పూర్తి చేశారు. వైస్ అడ్మిరల్ సంజయ్ జె సింగ్ అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా 2009లో నవ సేన పతకం, 2020లో అతి విశిష్ట సేవ పతకం లభించాయి.

వైస్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి న్యూదిల్లీలోని నౌకాదళ ప్రధాన కార్యాలయంలో వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. 

____



(Release ID: 1993078) Visitor Counter : 58


Read this release in: English , Urdu , Hindi