ప్రధాన మంత్రి కార్యాలయం
తిరుచిరాపల్లి భారతీదాసన్ విశ్వవిద్యాలయం 38వ స్నాతకోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
Posted On:
02 JAN 2024 1:23PM by PIB Hyderabad
తమిళనాడు గవర్నర్ తిరు ఆర్ఎన్ రవీజీ, తమిళనాడు ముఖ్యమంత్రి తిరు ఎంకె స్టాలిన్ జీ, భారతీదాసన్ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ తిరు ఎం సెల్వంజీ, నా యువ మిత్రులు, ఉపాధ్యాయులు, విశ్వవిద్యాలయ బోధనేతర సిబ్బంది అందరికీ
వణక్కం!
ఏనదు మానవ కుటుంబమే, 38వ స్నాతకోత్సవం సందర్భంగా భారతీదాసన్ విశ్వవిద్యాలయంలో ఉండడం నేను ప్రత్యేక గౌరవంగా భావిస్తున్నాను. 2024 సంవత్సరంలో ఇది నా తొలి బహిరంగ సభా కార్యక్రమం. సుందరమైన తమిళనాడు రాష్ర్టంలో, నవయువకులందరి మధ్యన ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి వచ్చిన తొలి ప్రధానమంత్రి నేనే అని తెలిసి ఎంతో ఆనందపడ్డాను. పట్టభద్రులైన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అత్యంత ప్రధానమైన ఈ సందర్భంలో అభినందనలు తెలియచేస్తున్నాను.
ఏనదు మానవ కుటుంబమే, సాధారణంగా ఏ విశ్వవిద్యాలయం ఏర్పాటైనా దానికి చట్టపరమైన ప్రక్రియ ప్రధానం. ఒక చట్టాన్ని ఆమోదించిన తర్వాత విశ్వవిద్యాలయం మనుగడలోకి వస్తుంది. ఆ తర్వాత దాని పరిధిలో కళాశాలలు ఏర్పడతాయి. ఆ తర్వాత ఆ విశ్వవిద్యాలయం దినదినప్రవర్ధమానమై హబ్ ఆఫ్ ఎక్సలెన్స్ గా పరిణతి చెందుతుంది. కాని భారతీదాసన్ విశ్వవిద్యాలయం విషయంలో ఆ విధానం కాస్తంత భిన్నంగా ఉంది. 1982లో ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటైనప్పుడు అప్పటికే పని చేస్తున్న, ప్రతిష్ఠాత్మక కళాశాలలను దాని అధికార పరిధిలోకి తెచ్చారు. ఆ కళాశాలల్లో కొన్నింటికి పేరు ప్రఖ్యాతులు గడించిన ఎందరినో తీర్చిదిద్దిన ఘనత ఉంది. ఆ రకంగా భారతీదాసన్ విశ్వవిద్యాలయం ఒక బలమైన, పరిణతి చెందిన పునాదిపై ప్రారంభమయింది. ఆ పరిణతి కారణంగానే మీ విశ్వవిద్యాలయం ఎన్నో విభాగాల్లో ప్రభావవంతమైనదిగా మారింది. హ్యుమానిటీస్, భాష, సైన్స్, చివరికి ఉపగ్రహాలు వంటి అన్ని విభాగాల్లోనూ దానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది.
ఏనదు మానవ కుటుంబమే, మన జాతి, నాగరికత ఎల్లప్పుడూ మేథోసంపత్తి మూలంగానే మనుగడ కలిగి ఉంది. నలంద, విక్రమశిల వంటి పురాతన విశ్వవిద్యాలయాలు అందరికీ బాగా తెలిసినవే. అలాగే కాంచీపురం అనేక విశ్వవిద్యాలయాలున్న ప్రదేశమని కూడా ప్రాచుర్యంలో ఉంది. అలాగే మదురై కూడా పలు అధ్యయనకేంద్రాలున్న ప్రదేశంగా అందరికి తెలుసు. ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన విద్యార్థులు ఈ ప్రాంతాలకు వస్తూ ఉంటారు. ఏనదు మానవ కుటుంబమే, స్నాతకం అనే కార్యక్రమం నిర్వహణ కూడా అత్యంత పురాతనమైనదిగా మనందరికీ తెలుసు. ఉదాహరణకి కవులు, మేథావుల పురాతన తమిళ సంగమం తీసుకోవచ్చు. ఇలాంటి సంగమ్ లలో ఇతరుల విశ్లేషణ కోసం పద్య, గద్యాలను ప్రెజెంట్ చేసస్తూ ఉంటారు. ఈ విశ్లేషణ అనంతరం ఆ రచయిత, ఆయన రచనలను అధిక సంఖ్యాక సమాజం గుర్తిస్తుంది. నేటికి కూడా విద్యావేత్తలు, ఉన్నత విద్యాసంస్థలు ఇదే లాజిక్ ఉపయోగిస్తారు. నా యువ మిత్రులారా, ఆ విధంగా మీరు మేథస్సుకు చెందిన చారిత్రక సాంప్రదాయానికి చెందిన వారు. ఏనదు మానవ కుటుంబమే, ఏ జాతికైనా దిశను చూపడంలో విశ్వవిద్యాలయాలు కీలక పాత్ర పోషిస్తాయి. మన విశ్వవిద్యాలయాలు ఎంత శక్తివంతంగా ఉంటే మన జాతి, నాగరికత కూడా అంత పటిష్ఠంగా ఉంటాయి. మన జాతిపై దాడి జరిగిన సందర్భాల్లో తక్షణం మన మేథో వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించే వారు. 20వ శతాబ్ది ప్రారంభ కాలంలో మహాత్మాగాంధీ, పండిట్ మదన్ మోహన్ మాలవీయ, సర్ అణ్ణామలై చెట్టియారు వంటి ప్రముఖులు విశ్వవిద్యాలయాలు స్థాపించారు. స్వాతంత్ర్య పోరాట కాలంలో ఇవి మేథో, జాతీయతా కేంద్రాలుగా వర్థిల్లాయి.
అదే విధంగా నేటి భారతదేశం ఎదుగుదల వెనుక మన విశ్వవిద్యాలయాల ఎదుగుదల ఉంది. భారత్ నేడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఉంది. అలాగే మన విశ్వవిద్యాలయాలు కూడా రికార్డు సంఖ్యలో ప్రపంచ ర్యాంకింగ్ లలోకి ప్రవేశిస్తున్నాయి. ఏనదు మానవ కుటుంబమే, మీ విశ్వవిద్యాలయం నేడు ఎందరికో డిగ్రీలు ప్రదానం చేస్తోంది. మీ ఉపాధ్యాయులు, కుటుంబం, మిత్రులు ప్రతీ ఒక్కరూ ఇందుకు ఆనందిస్తున్నారు. వాస్తవానికి మీరు బయట ఎక్కడైనా గ్రాడ్యుయేషన్ గౌన్ ధరించి కనిపిస్తే మీరు తెలియకపోయినా ప్రజలు మిమ్మల్ని అభినందిస్తారు. దీని వల్ల విద్య ప్రయోజనం ఏమిటి, సమాజం ఏ విధంగా మీ పట్ల ఆశావహంగా చూస్తోంది అన్నది మీరు అర్ధం చేసుకోగలుగుతారు.
అత్యున్నత స్థాయి విద్య మనకి సమాచారం అందించబోదని గురుదేవ్ రబీంద్రనాథ్ ఠాగూర్ చెప్పే వారు. కాని అది సమస్త ప్రాణులతో సామరస్యపూర్వకంగా జీవించేందుకు మనకి సహాయకారి అవుతుంది. మీరందరూ నేడు ఈ స్థాయికి రావడంలో సమాజం యావత్తు, సమాజంలోని నిరుపేదలు కూడా కీలక పాత్ర పోషించారు. అందుకే వారికి తిరిగి అందించడంతోనే మెరుగైన సమాజం ఏర్పడుతుంది. మెరుగైన సమాజం, దేశాన్ని ఆవిష్కరించడమే విద్య ప్రధాన లక్ష్యం. మీరు నేర్చుకున్న సైన్స్ మీ గ్రామంలోని ఒక రైతుకు ఉపయోగపడవచ్చు. మీరు నేర్చుకున్న ఒక టెక్నాలజీ సంక్లిష్ట సమస్య తీర్చేందుకు సహాయకారి కావచ్చు. మీరు నేర్చుకునే బిజినెస్ మేనేజ్ మెంట్ ఇతరుల వ్యాపారాల నిర్వహణకు, తద్వారా ఆదాయం పెంచుకునేందుకు దోహదపడవచ్చు. మీరు నేర్చుకునే ఆర్థిక శాస్ర్తం పేదరికం తగ్గించడానికి కారణం కావచ్చు. మీరు నేర్చుకునే సాహిత్యం, చరిత్ర మన సంస్కృతి పటిష్ఠతకు దోహదపడవచ్చు. ఆ రకంగా ప్రతీ గ్రాడ్యుయేట్ 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశంగా ఎదగడానికి సహాయకారి అవుతాడు.
ఏనదు మానవ కుటుంబమే, 2047 వరకు వచ్చే సంవత్సరాలన్నీ చరిత్రలో స్థానం సంపాదించుకునేలా చేయగల సామర్థ్యం యువకులకున్నదని నేను నమ్ముతున్నాను. గొప్ప కవి భారతీదాసన్ పుదియదేర్ ఉలగం సేవ్యేమ అని చెప్పే వారు. ఇదే మీ విశ్వవిద్యాలయం నీతి. మనందరం కలిసి ఒక సాహసవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం అన్నది దీని అర్ధం. కోవిడ్-19 సమయంలో ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్లు సరఫరా చేయడానికి యువశాస్ర్తవేత్తలే సహాయకారి అయ్యారు. చంద్రయాన్ వంటి మిషన్ల ద్వారా భారత శాస్ర్తీయ ఆవిష్కరణలు ప్రపంచ చిత్రపటంలో స్థానం సంపాదించుకున్నాయి. మన ఇన్నోవేటర్లు తీసుకున్న పేటెంట్ల సంఖ్య 2014లో 4,000 కాగా ఇప్పుడది 50,000కి చేరింది. మన సామాజిక శాస్ర్త పండితులు ప్రపంచం ముందు గతంలో ఎన్నడూ లేని రూపంలో భారతదేశాన్ని చూపుతున్నారు. మన స్వరకర్తలు, కళాకారులు నిరంతరం అంతర్జాతీయ అవార్డులు భారతదేశానికి తెస్తున్నారు. మన అథ్లెట్లు ఆసియా క్రీడలు, ఆసియా పారా క్రీడలు, ఇతర టోర్నమెంట్లలో రికార్డు సంఖ్యలో పతకాలు గెలుచుకున్నారు. ప్రతీ ఒక్క రంగంలోను, ప్రతీ ఒక్కరూ మీ వంక ఆశగా చూస్తున్న వాతావరణంలో మీరు ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. ఏనదు మానవ కుటుంబమే, యువత అంటే శక్తి. అంటే వేగంగా, నైపుణ్యంగా, విస్తారంగా పని చేయగల సామర్థ్యం అన్న మాట. గత కొద్ది సంవత్సరాల కాలంలో మీరు వేగంగా, విస్తారమైన పరిధిలో పని చేయగల వాతావరణం కల్పించేందుకు మేం ప్రయత్నించాం, ఆ రకంగా మేం మీకు లబ్ధిచేకూర్చగలిగాం.
గత 10 సంవత్సరాల కాలంలో విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి సుమారు 150కి పెరిగింది. తమిళనాడుకు బలమైన కోస్తా తీరం ఉంది. అందుకే 2014 నుంచి దేశంలోని ప్రధాన ఓడరేవుల్లో సరకు రవాణా సామర్థ్యం రెట్టింపయిందని తెలిసి మీరు ఆనందపడతారు. అలాగే రోడ్డు, జాతీయ రహదారుల నిర్మాణం కూడా గత 10 సంవత్సరాల కాలంలో సుమారుగా రెండింతలయింది. దేశంలో రిజిస్టర్ అయిన స్టార్టప్ ల సంఖ్య సుమారు 1 లక్షకు పెరిగింది. 2014 సంవత్సరంలో ఇలా రిజిస్టర్ అయిన స్టార్టప్ ల సంఖ్య 100 కన్నా తక్కువ ఉండేది. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలన్నింటితోనూ భారతదేశం వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. మన వస్తు, సేవలకు ఈ ఒప్పందాల ద్వారా కొత్త మార్కెట్లు తెరుచుకుంటాయి. అవి యువతకు లెక్క లేనన్ని కొత్త అవకాశాలు అందుబాటులోకి తెస్తాయి. జి-20 వంటి వ్యవస్థలను పటిష్ఠం చేయడం కావచ్చు, వాతావరణ మార్పుల పోరాటం, ప్రపంచ సరఫరా వ్యవస్థలో పెద్ద పాత్ర పోషించడం సహా అన్ని ప్రపంచ పరిష్కారాల సాధనలోనూ భారతదేశాన్ని ఆహ్వానిస్తున్నారు. అనేక స్థానిక, ప్రపంచ కారణాల దృష్ట్యా ప్రస్తుత సమయం యువకులుగా ఉండడానికి అత్యుత్తమ సమయం. ఈ కాలాన్ని అత్యధికంగా వినియోగించుకుని మన దేశాన్ని సరికొత్త శిఖరాలకు చేర్చండి.
ఏనదు మానవ కుటుంబమే, మీలో కొందరు నేటితో మీ విశ్వవిద్యాలయ జీవితం ముగిసిపోయిందనుకుంటూ ఉండవచ్చు. అది వాస్తవమే కావచ్చు కాని నేర్చుకోవడానికి అంతం అంటూ ఏదీ ఉండదు. మీ ప్రొఫెసర్లు మీకు బోధించకపోవచ్చు గాని మీ జీవితం మీకు గురువు అవుతుంది. నిరంతర అధ్యయన స్ఫూర్తితో కొత్త విషయాలు నేర్చుకోవడం, నైపుణ్యాలకు మెరుగులు పెట్టుకోవడం, కొత్త నైపుణ్యాలు సాధించడం అత్యంత కీలకం. అమితవేగంతో పరివర్తన చెందుతున్న ఈ ప్రపంచంలో మీరు మార్పునకు చోదకులు కావచ్చు లేదంటే మార్పే మిమ్మల్ని నడిపిస్తుంది. ఇక్కడ పట్టాలు అందుకుంటున్న వారందరికీ మరోసారి అభినందనలు.
మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షిస్తూ అభినందనలు. మిక్కా ననారీ.
(Release ID: 1992649)
|