సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విదేశాల్లో చదువుకోవడానికి ఆర్థిక సాయం

Posted On: 20 DEC 2023 7:53PM by PIB Hyderabad

భారతదేశ అభివృద్ధి ఆకాంక్షలు, జాతీయ ప్రాధాన్యతలను నెరవేర్చడంలో సివిల్ సర్వీసులది కీలక పాత్ర. దీనిని గుర్తించిన భారత ప్రభుత్వం, మిషన్‌ కర్మయోగి పేరిట 'నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్' (ఎన్‌పీసీఎస్‌సీబీ) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ చొరవ కింద, కేంద్రం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సివిల్ సర్వెంట్ల కోసం సామర్థ్య పెంపు ప్రణాళికలు రూపొందించి, అమలు చేస్తున్నాయి. లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల్లో నైపుణ్యాలు పెంచడానికి, ప్రజా కేంద్రీకృత విధానాన్ని ఆచరించేలా చూడడానికి ఐగాట్‌ కర్మయోగి పేరుతో సమీకృత ఆన్‌లైన్ శిక్షణ వేదికను కూడా భారత ప్రభుత్వం ప్రారంభించింది. అభ్యాసం, బోధన, పరిశోధన, శిక్షణలో అత్యుత్తమ విధానాలను అవలంబించేలా ఇతర సంస్థలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలతో, ముఖ్యంగా ప్రముఖ దేశీ & అంతర్జాతీయ సంస్థలతో సహకారం పెంచుకోవాలని సివిల్ సర్వీసుల శిక్షణ సంస్థలను కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

దీంతోపాటు, విద్యాసంస్థలు, ముఖ్యంగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎంలు) ప్రభుత్వ విధానాలు & నిర్వహణపై సివిల్ సర్వెంట్ల కోసం దీర్ఘ &స్వల్ప కాలిక కోర్సులను అందిస్తున్నాయి. అత్యుత్తమ ప్రపంచ స్థాయి అభ్యాసాలు ప్రజా విధాన కార్యక్రమాల్లోకి తీసుకువచ్చేలా చూసేందుకు, ఫ్యాకల్టీ అభివృద్ధి సహా అంతర్జాతీయ సంస్థలతో సహకార కార్యక్రమాలను కూడా ఐఐఎంలు నిర్వహిస్తున్నాయి.

విదేశాల్లో ప్రభుత్వ విధానాలు & నిర్వహణలో అధ్యయనం చేయడానికి లేదా శిక్షణ పొందడానికి, గత రెండు సంవత్సరాల్లో ఏ సివిల్ సర్వెంట్‌ను మంత్రిత్వ శాఖ స్పాన్సర్ చేయలేదు.

కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డా.జితేంద్ర సింగ్ ఈ రోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారాన్ని అందించారు.

                                                                                  

****


(Release ID: 1989015) Visitor Counter : 77


Read this release in: English , Urdu