రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

తమిళనాడులోని వరద ప్రభావిత ప్రాంతాల్లో భారతీయ తీర రక్షణ దళం సహాయక కార్యక్రమాలు; విపత్తు సహాయ బృందాలతో పాటు హెలికాప్టర్‌తో కూడిన తీర ప్రాంత నిఘా నౌక మోహరింపు

Posted On: 19 DEC 2023 2:07PM by PIB Hyderabad

తమిళనాడులోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించడం, స్థానికులకు సహాయ సామగ్రి సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వాన్ని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సాయం కోరడంతో, తమిళనాడులో సహాయక కార్యక్రమాల కోసం భారతీయ తీర రక్షణ దళం ఆరు విపత్తు సహాయక బృందాలను (డీఆర్‌టీ) మోహరించింది.

ట్యుటికోరిన్ తీర ప్రాంతాల్లో పరిస్థితిని పర్యవేక్షించడానికి, సముద్రంలో, తీర ప్రాంతాల్లో ఏదైనా అనుకోని సంఘటనలు జరిగితే వెంటనే ప్రతిస్పందించడానికి హెలికాప్టర్‌తో కూడిన తీర ప్రాంత నిఘా నౌకను కూడా ఐసీజీ మోహరించింది.

శ్రీలంక & తమిళనాడు దక్షిణ జిల్లాల్లో తుపాను ఫలితంగా ఈ నెల 17, 18 తేదీల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. దీనివల్ల తిరునెల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో వరదలు పోటెత్తాయి. ప్రస్తుతం, ట్యుటికోరిన్‌లో మొబైల్ ఫోన్‌ సంకేతాలు అందుబాటులో లేవు.

ట్యుటికోరిన్‌లోని భారతీయ తీర రక్షణ దళం జిల్లా ప్రధాన కార్యాలయం తిరునెల్వేలి, తూత్తుకుడి జిల్లా యంత్రాంగాలతో సమన్వయం చేసుకుంటోంది. ట్యుటికోరిన్ విమానాశ్రయాన్ని మూసివేయడంతో, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాల కోసం, అవసరమైతే చెన్నై నుంచి ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని తీసుకురావడానికి మదురైలో డోర్నియర్‌ విమానం, ఏఎల్‌హెచ్‌ హెలికాప్టర్‌ను సిద్ధంగా ఉంచింది. ఈలోగా, చిన్నపాటి పడవలతో కూడిన ఈతగాళ్ల బృందాన్ని, ఒక విపత్తు సహాయక బృందాన్ని ట్యుటికోరిన్‌కు పంపింది. 

 

***


(Release ID: 1988513)
Read this release in: English , Urdu , Hindi , Tamil