రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

దుండిగల్‌ వైమానిక దళ అకాడమీలో 'కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌'కు హాజరైన రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌


25 మంది మహిళలు సహా 213 ఫ్లైట్ క్యాడెట్‌లకు పూర్తయిన శిక్షణ; భారత వైమానిక దళంలోని వివిధ విభాగాల్లో నియామకం

కొత్త ఉపాయాలు, వినూత్న ఆలోచనలు, భావజాలాన్ని ఎప్పటికీ వదిలిపెట్టొద్దని సూచించిన శ్రీ రాజ్‌నాథ్ సింగ్

“మారుతున్న కాలానికి అనుగుణంగా వేగాన్ని కొనసాగించడానికి సంప్రదాయం, ఆవిష్కరణల మధ్య సమతుల్యత సాధించండి"

Posted On: 17 DEC 2023 11:05AM by PIB Hyderabad

భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) ఫ్లయింగ్, గ్రౌండ్ విభాగాలకు చెందిన 213 ఫ్లైట్ క్యాడెట్‌ల శిక్షణ విజయవంతంగా పూర్తయింది. దీనికి గుర్తుగా, ఈ నెల 17న, తెలంగాణ దుండిగల్‌లోని వైమానిక దళ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ (సీజీపీ) జరిగింది. భారత రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఈ కవాతును సమీక్షించారు. శిక్షణ పూర్తి చేసుకుని, వివిధ విభాగాల్లో నియమితులైన వారిలో 25 మంది మహిళలు ఉన్నారు. భారత నౌకాదళానికి చెందిన ఎనిమిది మంది అధికారులు, భారత తీర రక్షక దళానికి చెందిన తొమ్మిది మంది అధికారులు, మిత్ర దేశాలకు చెందిన ఇద్దరికి కూడా వైమానిక శిక్షణ పూర్తయింది, వారికి 'వింగ్స్' లభించాయి.

కొత్తగా సేవలోకి వచ్చిన అధికారులకు శ్రీ రాజ్‌నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు, చక్కగా కవాతు చేశారంటూ అభినందించారు. కొత్త ఉపాయాలు, వినూత్న ఆలోచనలు, భావజాలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి పెట్టొద్దని వారికి సూచించారు.

సాయుధ దళాల్లో సంప్రదాయానికి తగిన ప్రాముఖ్యత ఇవ్వాలని రక్షణ మంత్రి అధికారులకు ఉద్బోధించారు. అయితే, అనాలోచితంగా దీర్ఘకాలం పాటు సంప్రదాయాన్నే అనుసరిస్తే వ్యవస్థలో జడత్వం ఏర్పడుతుందని హెచ్చరించారు. ఈ పరిస్థితిని నివారించడానికి, నిరంతరం మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త ఆవిష్కరణలు అవసరమని స్పష్టం చేశారు.

సంప్రదాయం, ఆవిష్కరణల మధ్య సమతుల్యతను సాధించాలని, ఇది చాలా కీలకమని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. “సంప్రదాయాన్ని మాత్రమే పాటిస్తే మనం ఎండిపోయిన సరస్సుతో సమానం. మనం ప్రవహించే నదిలా ఉండాలి. సంప్రదాయంతో పాటు కొత్తదనాన్ని స్వీకరించాలి. ఎగురుతూ ఉండండి, ఎక్కువ ఎత్తులను తాకండి. అదే సమయంలో నేలతోనూ మీ సంబంధాన్ని కొనసాగించండి” అని రక్షణ మంత్రి సూచించారు.

కవాతు పర్యవేక్షణ కోసం వచ్చిన రక్షణ మంత్రికి వైమానిక దళాధిపతి వి.ఆర్. చౌదరి స్వాగతం పలికారు. శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌, అధికార్ల కవాతు ద్వారా సైనిక వందనం అందుకున్నారు. కవాతులో కీలక అంశం 'కమీషనింగ్‌ సెరెమొని'. దీనిలో, శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లైట్ క్యాడెట్‌లకు శ్రీ రాజ్‌నాథ్ సింగ్ వారి 'స్ట్రైప్స్' ప్రదానం చేశారు. అనంతరం, అకాడమీ కమాండెంట్‌ వారితో ప్రతిజ్ఞ చేయించారు.

శిక్షణ సమయంలో వివిధ అంశాల్లో ప్రతిభ చూపినవారికి రక్షణ మంత్రి వివిధ పురస్కారాలు ప్రదానం చేశారు. పైలట్‌ శిక్షణలో మొదటి స్థానంలో నిలిచిన ఫ్లయింగ్ విభాగానికి చెందిన అతుల్ ప్రకాష్‌కు 'ప్రెసిడెంట్స్‌ ఫ్లేక్‌', చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ కరవాలం లభించాయి. గ్రౌండ్ విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన అమరీందర్ జీత్ సింగ్‌కు 'ప్రెసిడెంట్స్‌ ఫ్లేక్‌' లభించింది.

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన 'ఆనందలోకే' సంగీతానికి అనుగుణంగా కొత్త అధికార్లు నెమ్మదిగా కవాతు చేయడంతో పరేడ్ ముగిసింది. ఎస్‌యూ-30ఎంకేఐ యుద్ధ విమానం, సారంగ్‌, సూర్యకిరణ్‌ హెలికాప్టర్లు చేసిన విన్యాసాలు, ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. 

 

 ***



(Release ID: 1987434) Visitor Counter : 82


Read this release in: English , Urdu , Hindi , Marathi