రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

మందుగుండు సామగ్రి తయారీలో స్వయం సమృద్ధి: భారత సైన్యానికి 10 సంవత్సరాల పాటు ఎలక్ట్రానిక్ ఫ్యూజ్‌ల సరఫరా కోసం బీఈఎల్‌తో రూ.5,336.25 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకున్న రక్షణ మంత్రిత్వ శాఖ

Posted On: 15 DEC 2023 12:42PM by PIB Hyderabad

భారత సైన్యానికి 10 సంవత్సరాల పాటు ఎలక్ట్రానిక్ ఫ్యూజ్‌ల సరఫరా కోసం, పుణెలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌తో (బీఈఎల్‌) రక్షణ మంత్రిత్వ శాఖ ఒక కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ రూ.5,336.25 కోట్లు.  డిసెంబర్ 15న ఒప్పందం జరిగింది. ‘ఆత్మనిర్భర్ భారత్’లో భాగంగా, 'భారత పరిశ్రమ ద్వారా భారత సైన్యం కోసం మందుగుండు సామగ్రి తయారీ' కింద 10 సంవత్సరాల దీర్ఘకాలిక అవసరాల కోసం ఈ ఒప్పందం కుదిరింది. దిగుమతులపై ఆధార పడడాన్ని తగ్గించడం, మందుగుండు సామగ్రి తయారీలో స్వయం సమృద్ధిని సాధించడం, కీలక సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందడం, సరఫరా గొలుసు అంతరాయం వల్ల ప్రభావితమైన నిల్వలను తిరిగి సేకరించి మందుగుండు నిల్వలను పెంచుకోవడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.

ఎలక్ట్రానిక్ ఫ్యూజ్‌లు మధ్యస్థాయి-భారీ ఫిరంగుల్లో అంతర్భాగంగా ఉంటాయి. ఉత్తర ప్రాంత సరిహద్దుల వెంబడి ఉన్న ఎత్తైన ప్రాంతాలు సహా ఉద్రిక్త పరిస్థితులు ఉన్న వివిధ రకాల భూభాగాల్లో ఫిరంగుల్లో ఉపయోగించడానికి ఈ ఫ్యూజ్‌లను సేకరిస్తున్నారు.

ఎలక్ట్రానిక్ ఫ్యూజ్‌లను పుణె కేంద్రంలో, రాబోయే నాగ్‌పుర్ కేంద్రంలో బీఈఎల్‌ తయారు చేస్తుంది. ఈ ప్రాజెక్టు ఒకటిన్నర లక్షల పని దినాలకు సమానమైన ఉపాధిని కల్పిస్తుంది. మందుగుండు సామగ్రి తయారీలో ఉన్న ఎంఎస్‌ఎంఈలు సహా భారత పరిశ్రమల్లో క్రియాశీల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. దేశంలో మందుగుండు సామగ్రి తయారీ వ్యవస్థను విస్తృతపరుస్తుంది.

 

***


(Release ID: 1986985) Visitor Counter : 70