శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ఐఐటీ రోపర్‌లో సాంకేతిక అంకుర సంస్థల ప్రోత్సాహక కార్యక్రమం 'సమృద్ధి కాంక్లేవ్' ప్రారంభం
Posted On:
04 DEC 2023 9:25AM by PIB Hyderabad
పంజాబ్ గవర్నర్ శ్రీ బన్వరీలాల్ పురోహిత్, 'సమృద్ధి కాంక్లేవ్' పేరిట ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఐఐటీ రోపర్‌లో ప్రారంభించారు. ఇది, సాంకేతిక అంకుర సంస్థల ప్రోత్సాహక కార్యక్రమం. ఇంటర్ డిసిప్లినరీ సైబర్-ఫిజికల్ సిస్టమ్స్ జాతీయ మిషన్ (ఎన్‌ఎం-ఐసీపీఎస్) కింద ఏర్పాటైన సాంకేతికత & ఆవిష్కరణల కేంద్రం ఐహబ్ అవధ్ కింద ఈ ప్రత్యేక కార్యక్రమం జరిగింది. వ్యవసాయం, జల సాంకేతికత రంగాల్లో సరికొత్త ఆవిష్కరణలు ప్రదర్శించడం దీని లక్ష్యం.
సమృద్ధి కాన్‌క్లేవ్‌లో ఐదు వ్యూహాత్మక సహకారాలు, ఐదు బలమైన సాంకేతిక ఆవిష్కరణలు ఉన్నాయి. 25 అంకుర సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించగా, కఠిన మూల్యాంకనం తర్వాత 13 అంకుర సంస్థలను ఎంపిక చేశారు. 30 మందికి పైగా నిపుణులు మార్కెట్ పరిశోధన, ఆవిష్కరణ, అభివృద్ధి అంశాల్లో వ్యూహాత్మక మార్గాలపై మాట్లాడారు.
శాస్త్ర, ఇంజినీరింగ్ పరిశోధన బోర్డు కార్యదర్శి & డీఎస్‌టీ సీనియర్ సలహాదారు డాక్టర్ అఖిలేష్ గుప్తా, ఆత్మనిర్భర్ భారత్‌ను ఆవిష్కరించడానికి ఎన్‌ఎంసీపీఎస్ తీసుకున్న ప్రయత్నాల గురించి వివరించారు. వ్యవసాయ మౌలిక సదుపాయాలు, రక్షణ, పర్యావరణం వంటి అన్ని రంగాల్లో సీపీఎస్ సాంకేతికత అవసరంపై ముఖ్యాంశాలను ఎన్‌ఎం మిషన్ డైరెక్టర్ డాక్టర్ ఏక్తా కపూర్ ప్రదర్శించారు.
ఐఐటీ రోపర్ డైరెక్టర్, ప్రొ. రాజీవ్ అహుజా; పంజాబ్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొ. రేణు విగ్, డా. పుష్పేంద్ర పాల్ సింగ్, అవధ్ ప్రాజెక్టు డైరెక్టర్, భాషిణి డిజిటల్ ఇండియా సీఈవో అమితాబ్ నాగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎన్‌ఎంఐసీపీఎస్ ద్వారా సాంకేతికత భవిష్యత్తును రూపొందించడంలో డీఎస్‌టీ కీలక పాత్రను ఈ కార్యక్రమం విస్పష్టం చేసింది. ఈ మిషన్ ద్వారా 311 సాంకేతికతలు, 549 సాంకేతిక ఉత్పత్తులు బయటకు వచ్చాయి. 1,613 సీపీఎస్ పరిశోధన పత్రాలను సృష్టించారు, 60,000కు పైగా సీపీఎస్ నైపుణ్యాలకు ఉపయోగపడింది.
ఐఐటీ రోపర్‌కు చెందిన అవధ్ నిర్వహించిన ఈ కాన్‌క్లేవ్‌కు 46 మంది పెట్టుబడి భాగస్వాములు హాజరయ్యారు. 50 మంది జ్యూరీ సభ్యులు అంకుర సంస్థలను మూల్యాంకనం చేశారు. నూతన ఆవిష్కరణలు & సాంకేతికతలో స్వయంసమృద్ధి కోసం దేశవ్యాప్తంగా 110 మంది భాగస్వాములు సహకరించారు. ఎన్‌ఎం-ఐసీపీఎస్ కింద, భారత ప్రభుత్వ శాస్త్ర, సాంకేతికత విభాగం (డీఎస్‌టీ) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సాంకేతికత, ఆవిష్కరణల అభివృద్ధిలో డీఎస్‌టీ నిబద్ధతను ఈ కార్యక్రమం గుర్తు చేసింది.

***
(Release ID: 1982295)