గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
చిత్రకారిణి కరుణ జైన్ గీసిన చిత్రాలతో ‘వోమనోవర్’ పేరుతో చిత్రకళ ప్రదర్శన ఏర్పాటు, “అందమైన చిత్రాలతో ప్రాచీనత నుంచి నవీనత వరకు” అని మెచ్చుకున్న శ్రీ హర్దీప్ సింగ్ పూరి
న్యూదిల్లీలోని ఐహెచ్‌సీలో ఏర్పాటు కరుణ జైన్ చిత్రకళ ప్రదర్శనను సందర్శించిన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి
Posted On:
16 NOV 2023 3:06PM by PIB Hyderabad
చిత్రకారిణి శ్రీ కరుణ జైన్ గీసిన చిత్రాలను కేంద్ర మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి మెచ్చుకున్నారు. "ఈ ప్రదర్శన చాలా ఆకట్టుకుంటుంది. ఈ అందమైన చిత్రాల్లో ప్రాచీనత నుంచి నవీనత వరకు అనేక రకాల అంశాలు, ఇతివృత్తాలు ఉన్నాయి" అని వ్యాఖ్యానించారు. కరుణ జైన్ రూపమిచ్చిన చిత్రాలతో ‘వోమనోవర్’ పేరుతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను శ్రీ హర్దీప్ సింగ్ పూరి సందర్శించారు. ప్రాచీనత నుంచి సమకాలీన, సాంప్రదాయ జానపద కళల వరకు విభిన్న ఇతివృత్తాలతో యాక్రిలిక్ పెయింటింగ్స్ వేసినందుకు కరుణ జైన్‌ను మంత్రి అభినందించారు.

కరుణ జైన్ చిత్రకళ ప్రదర్శనను సందర్శించిన కేంద్ర మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి
కేంద్ర గృహ నిర్మాణం & పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ మనోజ్ జోషి, ఐఐఎంసీ మాజీ డీజీ & ప్రస్తుతం ఇండియా హాబిటాట్ సెంటర్ (ఐహెచ్‌సీ) డైరెక్టర్ సునీత్ టాండన్ కూడా ఈ ప్రదర్శనను సందర్శించారు.

కరుణ జైన్ చిత్రకళ ప్రదర్శనను సందర్శించిన శ్రీ మనోజ్ జోషి
కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అమృత్ లాల్ మీనా ఈ నెల 14న సాయంత్రం ఈ కళా ప్రదర్శనను ప్రారంభించారు. ఈ నెల 17వ తేదీ వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుంది.

చిత్రకళ ప్రదర్శనను ప్రారంభిస్తున్న కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అమృత్ లాల్ మీనా
భారతదేశంలోని ప్రముఖ చిత్రకారుల్లో ఒకరైన రసీల్ గుజ్రాల్ అన్సాల్, చిత్రకళ ప్రదర్శన ప్రారంభ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ప్రముఖ చిత్రకారుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత సతీష్ గుజ్రాల్ కుమార్తె ఆమె. “కళను అంతగా ప్రేమించని కళ్ల ముందు మీ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఎంత అంకితభావం, ధైర్యం అవసరమో, కళాకారుల కుటుంబం నుంచి వచ్చిన నాకు తెలుసు. కళాకారులు అత్యంత ధైర్యవంతులని నేను భావిస్తున్నాను" అని రసీల్ గుజ్రాల్ అన్సల్ చెప్పారు. తన తండ్రి ఎప్పుడూ యువ కళాకారులను ప్రోత్సహించేవారని ఆమె వివరించారు. తన తండ్రి వారసత్వాన్ని తాను కొనసాగించగలనని ఆశిస్తున్నట్లు చెప్పారు.
కళాకారిణి గురించి
ప్రకృతి-స్త్రీ మధ్య ఉన్న లోతైన, అర్థవంతమైన సంబంధాలను కరుణ జైన్ చిత్రాలు వెల్లడిస్తాయి. విశ్వ సామరస్యంలో మహిళలు పోషించే ముఖ్యమైన పాత్రను ఆమె చిత్రాలు అందంగా చెబుతాయి. అదే సమయంలో, కరుణ గీసిన కళాత్మక చిత్రాలు అలాంటి ఇతివృత్తాలతోనే ఆగిపోకుండా, అంతకు మించి విస్తరించాయి. ఆకర్షణీయమైన, ఆలోచింపజేసే కళాఖండాలను రూపొందించడానికి తన సృజనాత్మకత సరిహద్దులను ఆమె నిరంతరం అధిగమిస్తుంటారు. ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్, నారీ గౌరవ్ సమ్మాన్ వంటి పురస్కారాలు కరుణ జైన్ ప్రతిభకు నిదర్శనాలు. అంతర్జాతీయ జైపూర్ ఆర్ట్ ఫెస్టివల్, ఎన్‌జీఎంఏ, ఐహెచ్‌సీ సహా చాలా చోట్ల కరుణ జైన్ చిత్రకళ ప్రదర్శనలు జరిగాయి.

ప్రముఖ ఎన్‌జీవోలతో కలిసి కరుణ జైన్ పని చేస్తున్నారు. చిన్నారుల విద్య, ముఖ్యంగా బాలికల విద్య కోసం జరిగే కార్యక్రమాలకు చురుగ్గా మద్దతు అందిస్తున్నారు. వినికిడి లోపం ఉన్న వ్యక్తులకు కూడా కరుణ సాయం చేస్తున్నారు. అడ్డంకులను అధిగమించి, అభివృద్ధి చెందేలా వారిని శక్తివంతం చేస్తున్నారు. ప్రాణాలను రక్షించే రక్తదాన అవగాహన కార్యక్రమాలకు కూడా కరుణ జైన్ తోడ్పాటు అందిస్తున్నారు.
మరిన్ని వివరాలకు:
ఇ-మెయిల్: karunajain71.gmail.com
ఇన్‌స్టాగ్రామ్: @ColorsByKaruna
***
(Release ID: 1977550)
Visitor Counter : 60