రైల్వే మంత్రిత్వ శాఖ

భారతీయ రైల్వే సాధించిన అభివృద్ధిని ప్రదర్శిస్తున్న ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్‌లో ‘భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న మౌలిక సౌకర్యాలు’ పేరిట ఏర్పాటు చేసిన రైల్వే పెవిలియన్‌


రైల్వేస్ పెవిలియన్‌ను ప్రారంభించిన రైల్వే బోర్డు ఛైర్మన్ సీఈఓ
సందర్శన గుర్తుగా సందర్శకులు సెల్ఫీ తీసుకోవడానికి ప్రత్యేకంగా ఏర్పాటైన "నారీ శక్తి" ప్రత్యేక సెల్ఫీ బూత్‌

Posted On: 15 NOV 2023 4:41PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరుగుతున్న  42వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ (IITF) - 2023లో రైల్వే మంత్రిత్వ శాఖ పాల్గొంటోంది. 2023 నవంబర్ 14 నుంచి 27 వరకు ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ జరుగుతుంది.  రైల్వే, కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ మార్గదర్శకత్వంలో,ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్   హాల్ నెం. 5 లో రైల్వే శాఖ ‘భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న మౌలిక సౌకర్యాలు’ పేరిట పెవిలియన్‌ ఏర్పాటు చేసింది.  రైల్వే బోర్డ్‌ చైర్మన్‌, సీఈవో  శ్రీమతి జయవర్మ సిన్హా రైల్వే పెవిలియన్‌ను ప్రారంభించారు.

“వసుధైవ కుటుంబం - వాణిజ్యంతో ఐక్యత ” ఇతివృత్తంతో ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్‌ జరుగుతోంది. దీనిని స్ఫూర్తిగా తీసుకుని   భారతీయ రైల్వే తన ప్రయాణాన్ని, సాధించిన విజయాలు వివరిస్తూ  పెవిలియన్‌ ఏర్పాటు చేసింది.   ప్రపంచంలోని ఇతర దేశాలకు భారతీయ రైల్వే లోకోలు, కోచ్‌లు డెమో  రైళ్లను ఎగుమతి చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగాసాధించిన గుర్తింపును తెలియజేసే విధంగా రైల్వే పెవిలియన్‌ ఏర్పాటు అయ్యింది. పూర్తిగా  కర్బన  ఉద్గారాలు తగ్గించేందుకు అమలు చేస్తున్న చర్యలను కూడా రైల్వే పెవిలియన్‌లో ప్రదర్శిస్తున్నారు. 

భారతీయ రైల్వేకు చెందిన వివిధ అంశాలను వివరిస్తూ రైల్వే పెవిలియన్‌ ఏర్పాటు అయ్యింది.  ఫోటోలు, వ్యాసాలు, నమూనాల ద్వారా సాంకేతిక,నిర్మాణాత్మక పురోగతి వివరించారు. 

రైల్వే పెవిలియన్ వెలుపలి భాగాన్ని  వందే భారత్ రైలు , రఘునాథ్ ఆలయం స్ఫూర్తిగా నిర్మిస్తున్న  జమ్మూ తావి రైల్వే స్టేషన్ ఆకృతితో తీర్చి దిద్దారు.  దేశవ్యాప్తంగా 1309 స్టేషన్లలో అమృత్ భారత్ పథకం కింద అమలు చేయనున్న స్టేషన్ల   పునరాభివృద్ధి పథకం వివరాలు రైల్వే పెవిలియన్‌లో ప్రదర్శిస్తున్నారు.  పెవిలియన్‌లో ప్రదర్శిస్తున్న  నమూనాలలో USBRL ప్రాజెక్ట్ (కత్రా-బనిహాల్ సెక్షన్), నేషనల్ హై స్పీడ్ రైల్వే ప్రాజెక్ట్‌లో సూరత్ స్టేషన్, వందే భారత్ రైళ్లు, పాంబన్ వంతెన నిలువు గిర్డర్, బోగీబీల్ వంతెన, డార్జిలింగ్ హిమాలయ రైల్వే మొదలైనవి ఉన్నాయి.

పెవిలియన్‌లో  భారతదేశంలో మారుతున్న మౌలిక సదుపాయాల రంగం, వారసత్వం, అభివృద్ధి, మహిళా శక్తి విభాగాలలో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.ప్రతి విభాగం వద్ద  మోడల్‌లు, సంబంధిత సమాచారాన్ని అందుబాటులో ఉంచారు. . నారీ శక్తి సెగ్మెంట్‌లోని సెల్ఫీ పాయింట్ సందర్శకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

రైల్వే పెవిలియన్‌లో ప్రతి వయస్సు వారికి ఆసక్తి కలిగించే అంశాలు ఉన్నాయి. భారతీయ రైల్వే సాధించిన అభివృద్ధిని వివరిస్తూ  వీడియోలు, ఇంటరాక్టివ్ స్క్రీన్, భారతీయ రైల్వే  ఇంటరాక్టివ్ క్విజ్ , వినోదం కోసం ఏర్పాట్లు చేశారు. రైల్వేకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని  రైల్వేస్ పెవిలియన్‌ని సందర్శించి తెలుసుకోవచ్చు. 

***

 



(Release ID: 1977249) Visitor Counter : 54


Read this release in: English , Urdu , Hindi , Punjabi