నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

చిల్లర వర్తక రంగంలో నైపుణ్యం అభివృద్ధి చేసేందుకు కలిసి కార్యక్రమాలు అమలు చేయడానికి కోకా-కోలా ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్న స్కిల్ ఇండియా


చిల్లర వర్తకులకు నైపుణ్యం కల్పించి, నైపుణ్యం అభివృద్ధి చేయడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో ఒప్పందం కీలక పాత్ర పోషిస్తుంది... శ్రీ ధర్మేంద్ర ప్రధాన్

చిల్లర వర్తకుల నైపుణ్యం అభివృద్ధి చేసేందుకు కీలకమైన రాష్ట్రాల్లో మూడు సంవత్సరాల పాటు అమలు జరగనున్న కార్యక్రమం

Posted On: 15 OCT 2023 7:05PM by PIB Hyderabad

  చిల్లర వర్తక రంగంలో నైపుణ్యం అభివృద్ధి చేసేందుకు కలిసి కార్యక్రమాలు అమలు చేయడానికి కోకా-కోలా ఇండియాతో  స్కిల్ ఇండియా  ఒప్పందం కుదుర్చుకుంది. చిల్లర వర్తక రంగంలో నైపుణ్యం అభివృద్ధి చేసేందుకు కార్యక్రమాలు అమలు చేయడానికి  కోలా ఇండియాతో ఒప్పందం కుదిరినట్టు కేంద్ర నైపుణ్యాభివృద్ధి,వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎన్ ఎస్ డి సి) ఈరోజు వెల్లడించింది. సూపర్ పవర్ రిటైలర్ ప్రోగ్రాం పేరుతో స్కిల్ ఇండియా మిషన్ కింద ఒడిశా,ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో  అమలు చేస్తారు. ఒడిశాలో పథకం ప్రయోగాత్మకంగా అమలు జరుగుతుంది. 

కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో ఈ భాగస్వామ్యాన్ని అధికారికంగా ప్రకటించారు. కార్యక్రమంలో ఎన్ఎస్డిసి సీఈఓ శ్రీ  వేద్ మణి తివారీ,కోకా-కోలా ఇండియా నైరుతి ఆసియా అధ్యక్షుడు. సంకేత్ రే పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ దుర్గాపూజ ఉత్సవాలు ప్రారంభమైన సమయంలో    సూపర్ పవర్ రిటైలర్‌ కార్యక్రమం ప్రారంభమైందని అన్నారు. కార్యక్రమం కింద  చిల్లర వర్తకులక  సాధికారత పెంపొందించడానికి,వ్యాపార విస్తరణ, వినియోగదారులకు సేవలు అందించే అంశాలపై శిక్షణ కార్యక్రమాలు అమలు జరుగుతాయని మంత్రి వివరించారు. నైపుణ్యాభివృద్ధి,వ్యాపార విస్తరణ తో చిల్లర వర్తకులు  భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించడానికి ఈ కార్యక్రమం అవకాశం కల్పిస్తుందని  ఆయన తెలిపారు.

అభివృద్ధి చెందిన భారతదేశం వల్ల  శ్రామికశక్తికి ప్రయోజనం కలిగించాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా కార్యక్రమం రూపొందిందని శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. కార్యక్రమం కింద  దేశంలోని 1.40 కోట్ల మంది చిల్లర వర్తకులకు  స్కిల్ ఇండియా డిజిటల్ పోర్టల్ ద్వారా 14 గంటల నాణ్యమైన రిటైల్ శిక్షణ అందిస్తారని  శ్రీ ప్రధాన్ పేర్కొన్నారు. వ్యాపార వ్యూహాల రూపకల్పన, అమలు,  డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల వినియోగం ద్వారా  విస్తృతమైన అవకాశాలను ఉపయోగించుకోవడం అనే అంశాలపై శిక్షణా కార్యక్రమాలు జరుగుతాయని ఆయన అన్నారు.

దేశవ్యాప్తంగా ఉన్న చిన్న దుకాణదారులు,పెద్ద వ్యాపారవేత్తలు ఉపయోగించుకోవడానికి వీలుగా  ఈ శిక్షణ కార్యక్రమాలు  మాడ్యూల్స్ బహుళ భాషల్లో అందుబాటులో ఉంటాయని శ్రీ ప్రధాన్ తెలియజేశారు. వినియోగదారులకు అవసరమైన సంతృప్తికర  సేవలు అందించేందుకు అవసరమైన రిటైల్ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధికి కార్యక్రమం దోహద పడుతుంది అని  మంత్రి అన్నారు.  

ఈ సందర్భంగా కోకా-కోలా విజయవంతమైన రిటైలర్‌లకు అవార్డులు ప్రదానం చేసి  నైపుణ్యాలు, వ్యవస్థాపకత శక్తి  ఉపయోగించుకుని స్వావలంబన సాధించిన మహిళలను సత్కరించింది. తమ తెలివితేటలు, వ్యవస్థాపక ప్రతిభతో తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్న  ఒడిశా మహిళలను  శ్రీ ప్రధాన్ అభినందించారు. 

చిల్లర వర్తకులకు సాధికారత కల్పించి, సులువుగా  పురోగతి సాధించడానికి సూపర్ పవర్ రిటైలర్ ప్రోగ్రామ్ అవకాశం కల్పిస్తుంది. శ్రామిక శక్తికి అండగా ఉండి సహాయ సహకారాలు అందించడానికి జరుగుతున్నప్రయత్నాలలో భాగంగా   స్కిల్ ఇండియా శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించింది.   ఆధునిక రిటైలింగ్ రంగంలో చిల్లర వర్తకుల సామర్థ్యాన్ని  పెంపొందించే అంశంపై కార్యక్రమం  దృష్టి సారిస్తుంది.  చిన్న, సూక్ష్మ చిల్లర వ్యాపారులకు అవసరమైన  శిక్షణ అందించడం, వినియోగదారుల అవసరాలు, మనోభావాలు, ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడానికి అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలు  అందించడం లక్ష్యంగా కార్యక్రమం అమలు జరుగుతుంది. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా  చిల్లర వ్యాపారులు నిర్ణయాలు తీసుకుని   వ్యాపారాన్ని మరింత లాభదాయకంగా నిర్వహించడానికి,  వ్యాపారాన్ని విస్తరించడానికి  అవసరమైన నైపుణ్యాలు శిక్షణ ద్వారా అందిస్తారు. సంప్రదాయ విధానంలో వ్యాపారం చేస్తున్న వారిని మారుతున్న వినియోగదారుల రంగం అవసరాలకు అనుగుణంగా సిద్ధం చేసేందుకు అవసరమైన  నైపుణ్యాలు, సాధనాలు,సాంకేతికతలు శిక్షణలో అందిస్తారు. 

ఈ కార్యక్రమం కింద  రిటైలర్ల వృత్తిపరమైన అవసరాలకు అనుగుణంగా వినియోగదారుల అవసరాలు తీర్చడం, సరుకుల నిల్వలు, ఆర్థిక అంశాల నిర్వహణ లాంటి అంశాలపై పరిశ్రమ అవసరాలను దృష్టిలో ఉంచుకుని శిక్షణ అందిస్తారు. 14 గంటల శిక్షణ కాలంలో  రెండు గంటల తరగతి గది సెషన్, 12 గంటల డిజిటల్ శిక్షణ ఉంటుంది. ఆన్‌లైన్ విధానంలో  మొబైల్, హ్యాండ్‌హెల్డ్ పరికరాల సాయంతో యాప్-ఆధారిత లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (LMS)తో పాటు భౌతిక తరగతి గది సెషన్‌ల ద్వారా కార్యక్రమం అమలు జరుగుతుంది.  స్కిల్ ఇండియా డిజిటల్ ప్లాట్‌ఫారమ్ (SID)లో శిక్షణ కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయి.  వీడియోలు, ముద్రించిన పాఠాల రూపంలో అనుభవజ్ఞులైన శిక్షకులు ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు అమలు జరుగుతాయి. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి  సర్టిఫికెట్ అందిస్తారు. 

ఒప్పందంలో భాగంగా స్కిల్ ఇండియా కార్యక్రమాన్ని విస్తరించడానికి జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థకు  కోకా-కోలా ఇండియా సహకారం అందిస్తుంది.  పరిశ్రమ-నిర్దిష్ట నైపుణ్య అవసరాలకు అనుగుణంగా శిక్షణ కార్యక్రమాలు అమలు చేయడం, మెరుగుపరచడానికి కృషి జరుగుతుంది.నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడానికి అవసరమైన నిపుణులు  జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థకు అందుబాటులోకి రావడంతో పాటు అవసరమైన శిక్షణ మౌలిక సదుపాయాలను అందించడం ద్వారా ఎలాంటి అవాంతరాలు లేకుండా శిక్షణ కార్యక్రమాలు అమలు చేయడానికి వీలవుతుంది. 

 దేశ యువత,శ్రామికశక్తికి సాధికారత కల్పించడానికి జరుగుతున్న ప్రయత్నాలకు ఒప్పందం సహకరిస్తుందని జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ సీఈఓ   శ్రీ వేద్ మణి తివారీ, తెలిపారు.  శ్రీ ధర్మేంద్ర ప్రధాన్  నాయకత్వంలో అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ సహకారంతో శిక్షణ కార్యక్రమాలు అమలు జరుగుతాయని ఆయన వివరించారు.

కోకా-కోలా ఇండియా,నైరుతి ఆసియా ప్రెసిడెంట్ సంకేత్ రే మాట్లాడుతూ  వ్యాపార విలువ గొలుసు లో చిల్లర వ్యాపారుల పాత్ర కీలకంగా ఉంటుందన్నారు. చిల్లర వ్యాపార రంగానికి  కోకా-కోలా ప్రాధాన్యత  అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల  అవసరాల నేపథ్యంలో చిల్లర వర్తకులకు   కీలకమైన వ్యవస్థాపక, డిజిటల్ నైపుణ్యాలతో సన్నద్ధం చేయాల్సి ఉంటుందన్నారు. ఆవిష్కరణలను పెంపొందించి  పరిశ్రమ-నిర్దిష్ట నైపుణ్యాలను అందరికీ అందుబాటులోకి తీసుకరావడానికి  స్కిల్ ఇండియా మిషన్ చేస్తున్న కృషిని  ఆయన ప్రశంసించారు.

 

***


(Release ID: 1968000) Visitor Counter : 78