వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వ్యవసాయ-ఆహార వ్యవస్థల్లో మహిళా సాధికారత & నాయకత్వ బలోపేతం కోసం జీ20 దేశాలకు కొత్త దిశానిర్దేశం చేసిన ప్రపంచ నిపుణులు

Posted On: 13 OCT 2023 4:06PM by PIB Hyderabad

వ్యవసాయ ఉత్పాదకత, ఆహార భద్రత, పౌష్టికాహారం, వాతావరణ మార్పు ప్రభావాలను తట్టుకోవడం కోసం వ్యవసాయ-ఆహార వ్యవస్థల్లో మహిళా సాధికారత & నాయకత్వాన్ని బలోపేతం చేయడం చాలా కీలకం అని, "ఫ్రమ్ రీసెర్చ్ టు ఇంపాక్ట్: టువర్డ్స్ జస్ట్ అండ్ రెసిలెంట్ అగ్రి-ఫుడ్ సిస్టమ్స్" పేరిట జరిగిన 'ఇంటర్నేషనల్ జెండర్ కాన్ఫరెన్స్' ముగింపు కార్యక్రమంలో ప్రపంచ నిపుణులు, పరిశోధకులు తీర్మానించారు. న్యూదిల్లీలో, ఈ నెల 09-12 తేదీల్లో, సీజీఐఏఆర్‌ జెండర్‌ ఇంపాక్ట్ ప్లాట్‌ఫామ్‌, భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఇక్రా) ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది.

మహిళల నేతృత్వంలోని అభివృద్ధి, ఆహార భద్రత, పోషకాహారం, వాతావరణ చర్యల్లో మహిళల నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉండాలని జీ20 శిఖరాగ్ర సదస్సులో దేశాధినేతలు నిర్ణయించిన నేపథ్యంలో, ఈ సదస్సులో సమయానుకూల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

సదస్సులో సమర్పించిన పరిశోధన పత్రాలు ప్రకారం, మహిళా సాధికారత పెంచే వ్యవసాయ కార్యక్రమాలు, ప్రాజెక్టులు, విధానాల రూపకల్పన ద్వారా వ్యవసాయ ఉత్పాదకత, చిన్నపిల్లలకు మంచి పోషకాహారం, మెరుగైన ఆహార వైవిధ్యం, ఎక్కువ ఆహార భద్రత, వాతావరణ స్థితిస్థాపకత వంటి మెరుగైన ఫలితాలు ప్రతి ఒక్కరికి అందుతాయి.

మార్కెట్లు, వనరులు, సాధికారతను మహిళలకు అందుబాటులోకి తీసుకురాగల ఉత్తమ మాధ్యమాలుగా వ్యవసాయ ఉత్పత్తిదార్ల సంఘాలు లేదా సంస్థలు నిలుస్తాయని వక్తలు చెప్పారు. అన్ని స్థాయుల ఆవిష్కరణలు, నిర్ణయాలు తీసుకోవడం, విధానాల రూపకల్పన వంటి చర్యల్లో మహిళల నాయకత్వాన్ని పెంపొందించడమే న్యాయమైన & స్థితిస్థాపక వ్యవసాయ-ఆహార వ్యవస్థలను సాధించడానికి ఏకైక మార్గం అని పరిశోధనలు కూడా చూపుతున్నాయి.

ఆహార భద్రత & పోషణలో పెట్టుబడులు, వాతావరణాన్ని తట్టుకునే విధానాలు, సమగ్ర వ్యవసాయ విలువ గొలుసులు, వ్యవసాయ పరివర్తన కోసం డిజిటలీకరణ వంటి నాలుగు ప్రాధాన్యత రంగాలపై జీ20 నేతలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారని ఐసీఏఆర్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ (హెచ్‌ఆర్‌డీ) డా.సీమ జగ్గీ చెప్పారు. ఈ నాలుగు ప్రాధాన్య రంగాల్లో సీజీఐఏఆర్, ఐసీఏఆర్ కీలకపాత్ర పోషిస్తాయని అన్నారు.

ఈ వారం, ప్రపంచంలోని అతి పెద్ద జాతీయ వ్యవసాయ పరిశోధన వ్యవస్థల్లో ఒకదానితో కలిసి పని చేస్తున్నట్లు అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ (ఐఆర్‌ఆర్‌ఐ) భారతదేశ ప్రతినిధి డా.రంజిత పుస్కుర్‌ చెప్పారు. జాతీయ వ్యవసాయ పరిశోధన వ్యవస్థలతో కలిసి పని చేయకుండా విధాన రూపకల్పనలకు అవసరమైన సమాచారాన్ని రూపొందించలేము కాబట్టి, ఈ భాగస్వామ్యాలను బలోపేతం చేయాలని అన్నారు. పరిశోధకులు, విధాన రూపకర్తలు, ప్రైవేటు రంగాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయవలసిన అవసరాన్ని డా.పుస్కుర్ ప్రముఖంగా చెప్పారు.

గురువారం జరిగిన సదస్సు ముగింపు సమావేశంలో, డా.పుస్కుర్‌తో పాటు డా. సీమ జగ్గీ, కేర్‌ యూఎస్‌లో ప్రోగ్రామ్ క్వాలిటీ & పార్ట్‌నర్‌షిప్స్‌ సీనియర్ డైరెక్టర్ డా. మౌరీన్ మిరుకా సహా ప్రపంచ స్థాయి నిపుణులు ప్రసగించారు. పరిశోధనలు క్షేత్రస్థాయిలో అమలు కావడానికి అవసరమైన చర్యలపై అభిప్రాయాలు వ్యక్తం చేశారు. చిన్న కమతాల మహిళా రైతుల అవసరాలు, పరిమితులను తొలగించే కొత్త వ్యవసాయ పరిష్కారాలను రూపొందించడంపై మాట్లాడారు.

4 ప్లీనరీలు, 54 సమాంతర కార్యక్రమాలు, 6 పోస్టర్ రూపకల్పన కార్యక్రమాలతో నాలుగు రోజుల పాటు జరిగిన 'ఇంటర్నేషనల్‌ అగ్రికల్చరల్‌ జెండర్‌ రీసెర్చ్‌ కాన్ఫరెన్స్‌', 60కి పైగా దేశాల ప్రతినిధులను ఒకచోటకు చేర్చింది.స్థితిస్థాపకత, వ్యవసాయ-ఆహార వ్యవస్థలకు వ్యవసాయ లింగ పరిశోధన ఎలా తోడ్పడుతుందో చర్చించింది.

***



(Release ID: 1967665) Visitor Counter : 65


Read this release in: English , Urdu , Hindi