రక్షణ మంత్రిత్వ శాఖ
భారత నౌకాదళంలో తొలి '360 డిగ్రీ అప్రైజల్ మెకానిజం'
Posted On:
07 OCT 2023 12:25PM by PIB Hyderabad
సిబ్బందిలో వృత్తిపరమైన, వ్యక్తిగత అభివృద్ధిని ప్రోత్సహించడానికి చురుకైన, అనుకూలమైన, అధునాతన మానవ వనరుల నిర్వహణ వ్యవస్థ తప్పనిసరి అని భారత నౌకాదళం గుర్తించింది. ఇందుకోసం, వివిధ పదోన్నతి బోర్డుల కోసం '360 డిగ్రీ అప్రైజల్ మెకానిజం'ను ప్రారంభించింది.
సీనియర్ అధికారులు ఇచ్చే రహస్య నివేదికల ప్రస్తుత మదింపు వ్యవస్థ 'టాప్-డౌన్' విధానంలో ఉంటుంది. కింది స్థాయి సిబ్బందిపై నాయకుడి ప్రభావాన్ని ఈ వ్యవస్థ లెక్కించదు. భారత నౌకాదళం ప్రవేశపెట్టిన ‘360 డిగ్రీ అప్రైజల్ మెకానిజం’ ఈ లోటును భర్తీ చేస్తుంది. పదోన్నతి పరిశీలనలో ఉన్న ప్రతి అధికారి గురించి సహచరులు, కింది స్థాయి సిబ్బంది ద్వారా సర్వేలు చేసి, ఆ వివరాలు పొందుపరుస్తారు. వృత్తిపరమైన జ్ఞానం, నాయకత్వ లక్షణాలు, యుద్ధం/సంక్షోభంలో సన్నద్ధత, ఉన్నత ర్యాంక్ తీసుకునే అర్హత వంటి అంశాలపై వివిధ ప్రశ్నలు ఈ సర్వేలో ఉంటాయి. ఈ విధంగా పొందిన సమాచారాన్ని ఉన్నతాధికారి నేతృత్వంలోని అధికారుల బోర్డు విశ్లేషిస్తుంది. ఒక అధికారి ప్రవర్తనలో మార్పు, మెరుగుదల కోసం సలహాల రూపంలోనూ ఈ సమాచారాన్ని అందిస్తారు.
వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో ఇలాంటి పనితీరు మదింపు వ్యవస్థలు వాడుకలో ఉన్నాయి. అలాంటి 'ఉత్తమ అభ్యాసాలను' అమలు చేస్తున్నందుకు భారత నౌకాదళం గర్విస్తోంది.
***
(Release ID: 1965398)
Visitor Counter : 126