విద్యుత్తు మంత్రిత్వ శాఖ

సిక్కింలోని తీస్తా నది ఆకస్మిక వరదల వల్ల కేంద్ర జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలపై పడిన ప్రభావాన్ని అంచనా వేస్తున్న కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ


వరద నీరు తగ్గిన తర్వాత జల విద్యుత్ ప్రాజెక్టులకు జరిగిన నష్టాన్ని అంచనా వేయనున్న కేంద్ర ప్రభుత్వం
వీలైనంత త్వరగా జల విద్యుత్ ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేందుకు చర్యలు

Posted On: 05 OCT 2023 8:59PM by PIB Hyderabad

సిక్కింలోని తీస్తా నదికి వచ్చిన  వరదల కారణంగా ఏర్పడిన  పరిస్థితిని కేంద్ర  విద్యుత్ మంత్రిత్వ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది. మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ పంకజ్ అగర్వాల్  అత్యవసర సమావేశాన్ని నిర్వహించి  పరిస్థితిని సమీక్షించారు. సమీక్షా సమావేశంలో మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు,  ఇందులో విద్యుత్ మంత్రిత్వ శాఖ,  కేంద్ర జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
2023 అక్టోబర్ 3- 4 మధ్య రాత్రి తీస్తా నదికి  ఆకస్మిక వరద రావడంతో  తీస్తా-V జల విద్యుత్ కేంద్రం నుంచి తార్‌ఖోలా/పాంఫోక్ వరకు దిగువన ఉన్న అన్ని వంతెనలు మునిగిపోయాయి/ కొట్టుకుపోయాయి, దీనివల్ల ఈ ప్రాంతాల్లో రాకపోకలు, కమ్యూనికేషన్‌ సౌకర్యాలు నిలిచి పోయాయి. తీస్తా V పవర్ స్టేషన్ (510 మెగావాట్లు) డ్యామ్‌పై వరద నీరు చేరింది. ప్రాజెక్టు ప్రాంతాలకు అనుసంధానించే అన్ని రహదారులు, కొన్ని నివాస ప్రాంతాలు  తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం పవర్ స్టేషన్ ను మూసివేసి  ఉత్పత్తి నిలిపి వేశారు. అన్ని ప్రాజెక్ట్‌లలో పనిచేస్తున్న  సిబ్బందిని సకాలంలో ఖాళీ చేసి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదల వల్ల  V పవర్ స్టేషన్ లో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్టు గుర్తించారు. 
నిర్మాణంలో ఉన్న జల విద్యుత్ కేంద్రం  తీస్తా VI (500 MW)  పనులకు అంతరాయం ఏర్పడింది. పవర్‌హౌస్‌, ట్రాన్స్‌ఫార్మర్‌ గుహలోకి వరద నీరు చేరింది. బ్యారేజీ తో పాటు పవర్ హౌస్ వద్ద కుడి, ఎడమ గట్లను అనుసంధానించే వంతెనలు కొట్టుకుపోయాయి. ప్రాజెక్టు స్థలంలో పనిచేస్తున్న ఇద్దరు క్రేన్ ఆపరేటర్ల ఆచూకీ లభించలేదు గల్లంతయిన సిబ్బంది  ఆచూకీ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
దిగువ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్న టీఎల్  డీపీ -III (160 మెగావాట్లు) (తీస్టా లో డ్యామ్ - III హైడ్రోపవర్ ప్లాంట్), టీఎల్  డీపీ -IV (132 మెగావాట్లు)విద్యుత్ కేంద్రాలకు  పెద్దగా నష్టం వాటిల్లలేదని గుర్తించారు. ఈ రెండు కేంద్రాలు  సురక్షితంగా ఉన్నాయి, అయితే వరద నీటితో పాటు భారీగా పూడిక పేరుకుపోవడంతో ఉత్పత్తి నిలిపి వేశారు.సాధ్యమైనంత త్వరగా ఈ రెండు కేంద్రాలలో ఉత్పత్తి ప్రారంభించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రంగిత్ లోయలో నిర్మాణంలో ఉన్న రంగిత్ IV విద్యుత్ కేంద్రం  (120  మెగావాట్లు ),పని చేస్తున్న రంగిత్ పవర్ స్టేషన్ (60 మెగావాట్లు) ఎటువంటి నష్టం జరగలేదు.

నీటి మట్టం తగ్గిన తర్వాత అన్ని ప్రాజెక్టులకు కలిగిన నష్టాన్ని వివరంగా అంచనా వేస్తారు. ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం, మందులు, విద్యుత్ మొదలైన నిత్యావసర వస్తువులు  సరఫరా చేయడానికి   రాష్ట్ర ప్రభుత్వం, విపత్తు నిర్వహణ అధికారులు, జిల్లా యంత్రాంగం సహాయంతో సాధ్యమైన అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

 

***



(Release ID: 1964892) Visitor Counter : 113


Read this release in: English , Urdu , Hindi