సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అటల్ బిహారీ దివ్యాంగ క్రీడా శిక్షణ కేంద్రం ప్రారంభించనున్న ప్రధాని


దివ్యాంగులకు క్రీడలలో సమాన అవకాశాల కల్పనకు మార్గం సుగమం

Posted On: 01 OCT 2023 4:20PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబరు 2వ తేదీన ప్రతిష్టాత్మక అటల్‌ బిహారీ దివ్యాంగ క్రీడా శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడంతోపాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడం సహా శంకుస్థాపన చేస్తారు.

   గౌరవనీయ ప్రధానమంత్రి అక్టోబర్ 2న అటల్ బిహారీ దివ్యాంగ క్రీడా శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడం చరిత్రలో ఒక చిరస్మరణీయ ఘట్టంగా మిగిలిపోతుంది. కేంద్ర సామాజిక న్యాయం-సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అందరికీ క్రీడా సౌలభ్యం, క్రీడలలో సార్వజనీనతకు ప్రోత్సాహం దిశగా ప్రభుత్వ నిబద్ధతను ఈ వినూత్న కార్యక్రమం నొక్కి చెబుతుంది. క్రీడారంగంలో దివ్యాంగులకూ సమాన అవకాశాల కల్పన, వివిధ క్రీడా పోటీలలో పాల్గొనేలా వారి ప్రతిభకు మెరుగులు దిద్దడంలో అటల్ బిహారీ దివ్యాంగ క్రీడా శిక్షణ కేంద్రం ప్రారంభాన్ని ఒక కీలక చర్యగా పరిగణించాలి.

   దేశంలో సార్వజనీన, సౌలభ్య క్రీడా సదుపాయాల పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించడంలో ఈ కేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమం ఒక వేదికగా ఉపయోగపడుతుంది. పలు రకాల అవరోధాలను తొలగించడంతోపాటు శారీరక సామర్థ్యాలతో నిమిత్తం లేకుండా వ్యక్తులను ఉత్తేజితం చేయగల శక్తి క్రీడలకు ఉందన్నది నిర్వివాదాంశం. ఈ నేపథ్యంలో దివ్యాంగ క్రీడాకారుల నైపుణ్యాన్ని, ప్రతిభను అన్నివిధాలా తీర్చిదిద్దడం కోసం అటల్‌ బిహారీ దివ్యాంగ క్రీడా శిక్షణ కేంద్రం అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేయబడింది. ఇక్కడ అంతర్జాతీయ స్థాయి శిక్షణ మౌలిక సదుపాయాలు, శిక్షణ సిబ్బంది ఉన్నందున దివ్యాంగ క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ వాతావరణం లభిస్తుంది.

   కేంద్ర సామాజిక న్యాయం-సాధికారత మంత్రిత్వశాఖ పరిధిలోని దివ్యాంగ సాధికారత కల్పన విభాగం కింద ఈ శిక్షణ కేంద్రం స్వయంప్రతిపత్తిగల సంస్థగా ఏర్పాటు చేయబడింది. ఇది ఎం.పి. సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్-1973 కింద 22.09.2021న ఒక సొసైటీగా నమోదు చేయబడింది. దీని ప్రకారం… ప్రభుత్వాధికారులు సభ్యులుగాగల పరిపాలన-నిర్వహణ కమిటీ ఈ కేంద్రం కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది.

ఈ కేంద్రం కింది లక్ష్యాలు-నిర్దేశాల మేరకు పనిచేస్తుంది:

  1. నిబంధనల మేరకు దివ్యాంగ క్రీడాకారుల సౌలభ్యం కో్సం అత్యాధునిక అంతర్జాతీయ స్థాయి క్రీడానైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం;
  2. దివ్యాంగ క్రీడాకారులు ముమ్మర శిక్షణ పొందడానికి, కఠోర సాధన చేయడానికి అనువైన ప్రత్యేక క్రీడా మౌలిక సదుపాయాలు కల్పించడం;
  3. ప్రపంచవ్యాప్తంగా లభించే అత్యాధునిక క్రీడా శిక్షణ సౌకర్యాలతో సమానంగా మన దేశంలోనూ దివ్యాంగ క్రీడాకారులకూ సౌకర్యాల కల్పన.
  4. దివ్యాంగ క్రీడాకారులు అధిక సంఖ్యలో క్రీడల్లో పాల్గొనేలా చూడటం, అంతర్జాతీయ స్థాయిలో పోటీపడగలిగేలా వారిని తీర్చిదిద్దడం.
  5. సమాజంతో సాధారణ స్థాయిలో మమేకమయ్యేలా వారిలో ఆత్మవిశ్వాసం నింపడం.

   కాగా, అటల్‌ బిహారీ దివ్యాంగ క్రీడా శిక్షణ కేంద్రాన్ని రూ.151.16 కోట్లతో, 34 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

 

***


(Release ID: 1963053) Visitor Counter : 157


Read this release in: English , Urdu , Hindi , Tamil