హోం మంత్రిత్వ శాఖ

గుజరాత్ లోని గాంధీనగర్ లో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్) శాశ్వత భవన సముదాయాన్ని ప్రారంభించిన కేంద్ర హోం , సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా


ప్రధాన మంత్రి శ్రీనరేంద్ర మోదీ దార్శనికత ప్రకారము, విజ్ఞానం, విద్య, పరిశోధన , వ్యాపారాన్ని కలిపే వారధిగా మారడం ద్వారా ఔషధ రంగంలో స్వావలంబన భారతదేశాన్ని తయారు చేయడానికి ఎన్.ఐ.పి.ఇ.ఆర్ లు పునాది వేస్తున్నాయి.

నైపర్ విద్యారంగంలోనే కాకుండా పరిశోధనా రంగంలోనూ ప్రపంచంలోనే అగ్రగామి సంస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకోవాలి; పరిశోధనా రంగంలో భారత్ ప్రావీణ్యం సాధిస్తే తప్ప ప్రపంచంలో ఔషధ తయారీ రంగంలో ఆధిపత్యం చెలాయించ లేము

నైపర్ నేడు దేశవ్యాప్తంగా సాంకేతిక ఉన్నత విద్యా రంగంలో ఒక పెద్ద పేరుగా మారింది; సుమారు 8,000 మంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ చేసి ప్రొఫెషనల్ రంగంలో విజయం సాధించారు; నైపర్ తన పేరు మీద 380 కి పైగా పేటెంట్లను నమోదు చేసింది; 7,000 కంటే ఎక్కువ పరిశోధనా పత్రాలను ప్రచురించింది

ఔషధ పరిశ్రమలలో నైపర్ తనకంటూ ఒక మంచి స్థానాన్ని ఏర్పరుచుకుంది: పరిశ్రమలు నైపర్ మధ్య 270 కి పైగా అవగాహన ఒప్పందాలు కుదిరాయి; ఇది విజ్ఞానాన్ని వ్యాపారంతో అనుసంధానించే నైపుణ్యం నైపర్ కు ఉందని రుజువు చేస్తుంది

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం గత 9 సంవత్సరాల్లో ఆరోగ్య రంగంలో గణనీయమైన పని

Posted On: 30 SEP 2023 7:04PM by PIB Hyderabad

కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా గుజరాత్ లో అహ్మదాబాద్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్) శాశ్వత భవన సముదాయాన్ని శనివారం (30-09-2023)  ప్రారంభించారు. గుజ రాత్ ముఖ్య మంత్రి శ్రీ భూపేంద్ర  టేల్ , కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవీయ తో పాటు పలువురు ప్రముఖులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు. 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0011EKH.jpg

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత కు అనుగుణంగా, విజ్ఞానం, విద్య, పరిశోధన, వ్యాపారాన్ని కలిపే వారధిగా మారడం ద్వారా ఔషధ రంగంలో స్వయం సమృద్ధ భారత్ ను నిర్మించేందుకు ఎన్ ఐ పి ఇ ఆర్ లు పునాది వేస్తున్నాయని శ్రీ అమిత్ షా తన ప్రసంగంలో పేర్కొన్నారు. సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో 8 భవనాల్లో విస్తరించిన నైపర్, గాంధీనగర్ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వైద్యరంగంలో మానవ జీవితాన్ని ఆరోగ్యంగా, సంపూర్ణంగా తీర్చిదిద్దేందుకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. గాంధీనగర్ లోని నైపర్ గత మూడేళ్లుగా దేశంలోని టాప్ 10 ఫార్మసీ ఇన్ స్టిట్యూట్ లలో ఒకటిగా నిలిచిందని, ఇప్పుడు కొత్త భవన సముదాయం నిర్మాణంతో మొదటి స్థానానికి చేరుకోకుండా ఎవరూ ఆపలేరని అన్నారు.  

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00281ZA.jpg

కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి మాట్లాడుతూ,  గాంధీనగర్ లో విద్యకు మంచి మౌలిక సదుపాయాలు, వాతావరణం ఉన్నాయని   లా యూనివర్శిటీ, నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్శిటీ, రక్షా శక్తి యూనివర్శిటీ, దీన్ దయాళ్ పెట్రోలియం యూనివర్శిటీ తో పాటునేడు నైపర్ కూడా ఇక్కడ ప్రారంభమవుతోందని, ఇది ఇక్కడి అన్ని విద్యా సంస్థలకు కొత్త శక్తిని ఇస్తుందని తెలిపారు. నైపర్ విద్యారంగంలోనే కాకుండా వైద్యరంగంలో పరిశోధనల్లో కూడా ప్రపంచంలోనే అగ్రగామి సంస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. పరిశోధనా రంగంలో భారత్ ప్రావీణ్యం సాధిస్తే తప్ప ప్రపంచంలో ఔషధ తయారీ రంగంలో ఆధిపత్యం చెలాయించలేమని ఆయన అన్నారు. గాంధీనగర్ లోని నైపర్ ప్రఖ్యాత సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా అవతరించిందని, రాబోయే రోజుల్లో ఇది మరింత అభివృద్ధి చెందుతుందని శ్రీ షా అన్నారు. విద్య, పరిశోధన, నాణ్యత, ప్రతిభా కేంద్రంగా సృష్టించి ఉత్పత్తి, ప్రజాసేవతో అనుసంధానం చేయాలనే లక్ష్యంతో నైపర్ ను రూపొందించారు. ఫార్మసీ అనేది విద్య  వ్యక్తికి ప్రయోజనం చేకూర్చడమే కాకుండా మానవ జీవితాన్ని ఆరోగ్యంగా, దీర్ఘాయువుగా మార్చడానికి కూడా ఉపయోగ పడే రంగమని  ఆయన అన్నారు. ఇక్కడ చదివే విద్యార్థులు జీవితాల ను మెరుగు పరచుకోవడమే కాకుండా కోట్లాది మంది ఆరోగ్యవంతమైన జీవితానికి కూడా దోహద పడతారని అన్నారు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0032Z7P.jpg

ప్రస్తుతం భారతదేశంలో 7 ఎన్ ఐ పి ఇ ఆర్ లు ఉన్నాయని, వాటిలో మొహాలీ, గౌహతి పూర్తిగా పనిచేస్తున్నాయని, నేడు గాంధీ నగర్ లోని నైపర్ కూడా పూర్తిస్థాయిలో పని చేయబోతోందని శ్రీ అమిత్ షా చెప్పారు. హాజీపూర్, హైదరాబాద్, కోల్కతా, రాయ్ బరెలి లో నైపర్ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. నేడు దేశవ్యాప్తంగా సాంకేతిక, ఉన్నత విద్యారంగంలో నైపర్ పెద్ద పేరుగా నిలిచిందన్నారు. సుమారు 8,000 మంది విద్యార్థులు ఇక్కడి నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ప్రొఫెషనల్ రంగంలో విజయం సాధించారని శ్రీ షా చెప్పారు. నైపర్ విద్యార్థుల పేరిట 380కి పైగా పేటెంట్లు రిజిస్టర్ కాగా, 7 వేలకు పైగా పరిశోధనా పత్రాలు ప్రచురితమయ్యాయి. ఇక్కడ అత్యాధునిక ప్రయోగశాల నిర్మాణానికి మోదీ ప్రభుత్వం రూ.2,200 కోట్లు విడుదల చేసిందని, ఇది రాబోయే రోజుల్లో విద్యార్థులు పరిశోధనా రంగంలో ముందుకు సాగడానికి దోహదపడుతుందన్నారు. ఫార్మాస్యూటికల్ పరిశ్రమల్లో నైపర్ తనకంటూ ఒక మంచి స్థానాన్ని ఏర్పరుచుకుందని, పరిశ్రమలు ,  నైపర్ మధ్య 270 కి పైగా అవగాహన ఒప్పందాలు కుదిరాయని, ఇది నైపర్ కు విజ్ఞానాన్ని వ్యాపారంతో అనుసంధానించే నైపుణ్యం ఉందని రుజువు చేస్తోందని  శ్రీ షా అన్నారు.

నైపర్ ద్వారా ఫార్మాస్యూటికల్, మెడికల్ రంగాల్లో వివిధ కోర్సుల్లో సుమారు 16 స్పెషలైజేషన్లను అందిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి తెలిపారు. దేశంలో ఔషధాల కోసం యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ (ఎ పి ఐ), కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కె ఎస్ఎం) ఉత్పత్తిని పెంచడానికి మోదీ ప్రభుత్వం సమగ్ర విధానాన్ని అవలంబించిందని, రాబోయే పదేళ్లలో భారత్ వీటిపై స్వావలంబన సాధించి వాటి ఎగుమతులను ప్రారంభిస్తుందన్నారు. 16 ఎపిఐలు , 2 కెఎస్ఎమ్ ల కోసం చౌకైన, స్థిరమైన , భరించ కలిగిన ప్రక్రియను అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని శ్రీ షా చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  నాయకత్వంలో భారతదేశం ఎపిఐ, కెఎస్ఎమ్ రంగాలలో స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా, రాబోయే 10 సంవత్సరాలలో ఎపిఐలు ,కెఎస్ఎమ్ లను ఎగుమతి చేయగల స్థితిలో ఉంటుందని శ్రీ షా అన్నారు. నైపర్ లో రీసెర్చ్ పోర్టల్ ను ప్రారంభించామని, ఇది పరిశోధక నిపుణులకు అనేక ప్రయోజనాలను అందిస్తుందని ఆయన అన్నారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన ప్రధాన మంత్రి భారతీయ  ఔషధి యోజన దేశంలోని కోట్లాది మంది పేద ప్రజలకు భరోసాగా మారిందని శ్రీ అమిత్ షా అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 10 వేల జన ఔషధి కేంద్రాల్లో 50 శాతం నుంచి 90 శాతం తక్కువ ధరలకు 1,800 మందులు, 285 శస్త్రచికిత్స పరికరాలను పేదలకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. “నేడు ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలు పేదలకు ఆశీర్వాద కేంద్రాలుగా మారాయి. పరిశ్రమలు కూడా ఈ పథకానికి సహకరిస్తున్నాయి. దేశంలోని పేద ప్రజల జీవితాలను సులభతరం చేయడంలో, మరింత అందుబాటులో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి” అని ఆయన అన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత  వల్ల గత 9 సంవత్సరాలలో పేద ప్రజలు జన ఔషధ కేంద్రాలలో మందులు కొనుగోలు చేయడం వల్ల దాదాపు రూ.30,000 కోట్లు ఆదా అయ్యాయని శ్రీ షా తెలిపారు. ఒక్క 2022-23 సంవత్సరంలోనే రూ.7,500 కోట్లు ఆదా అయినట్టు  చెప్పారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పిఎల్ ఐ పథకం కింద ఔషధ ఉత్పత్తి రంగంలో 48 చిన్న, పెద్ద పరిశ్రమల కోసం రూ.4,000 కోట్ల పెట్టుబడికి ఆమోదం తెలిపిందని, ఈ పెట్టుబడిలో గణనీయమైన భాగం ఇప్పటికే అందించడం జరిగిందని కేంద్ర హోం మంత్రి తెలిపారు. పిఎల్ఐ పథకం కింద దేశీయంగా వైద్య పరికరాల ఉత్పత్తిని కూడా ప్రోత్సహిస్తున్నామని, సుమారు రూ.2000 కోట్ల పెట్టుబడులక కోసం 26 మంది పెట్టుబడిదారులకు మోదీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. బల్క్ డ్రగ్ ఫార్మా పార్కులను ప్రోత్సహించేందుకు మోదీ ప్రభుత్వం రూ.3 వేల కోట్లతో 3 బల్క్ డ్రగ్ ఫార్మా పార్కులను నిర్మించిందని చెప్పారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమగ్ర దృక్పథంతో lవైద్య పరికరాల తయారీ రంగంలో భారత దేశం స్వావలంబన సాధించేందుకు జాతీయ వైద్య పరికరాల విధానం - 2023ను కూడా తీసుకువచ్చారని ఆయన తెలిపారు. 47 దేశాల నుండి దాదాపు 250 రకాల పరికరాలు, 70 స్టార్టప్ లు, 4,000 మందికి పైగా కొనుగోలుదారులు ,అమ్మకందారులు, 10,000 మందికి పైగా సందర్శకులు పాల్గొన్న వైద్య పరికరాల తయారీ రంగంలో మొదటి ఎక్స్ పోను 2023 లో గాంధీనగర్ లో నిర్వహించామని శ్రీ షా తెలిపారు.

ఆయుష్మాన్ భారత్ పథకం, పి హెచ్ సి లు, సి హెచ్ సి సలు, వెల్ నెస్ సెంటర్లను బలోపేతం చేయడం, యోగా ద్వారా ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, వైద్య సీట్లను రెండున్నర రెట్లు పెంచడం వంటి చర్యలతో గత తొమ్మిదేళ్లలో ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో కృషి చేశారని శ్రీ అమిత్ షా తెలిపారు. వీటన్నింటితో పాటు దేశంలో ఏడు ఎన్ ఐ పి ఇ ఆర్ లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మోదీ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లుగా దేశంలో ఆరోగ్య రంగంలో సమగ్ర దృక్పథంతో పనిచేసిందని, దేశ ప్రజల ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చిందని శ్రీ అమిత్ షా తెలిపారు. 

***



(Release ID: 1962613) Visitor Counter : 103


Read this release in: English , Urdu , Assamese , Tamil