జల శక్తి మంత్రిత్వ శాఖ
బిహార్‌లో 'స్వచ్ఛత హి సేవ'లో పాల్గొన్న 5.8 కోట్ల మంది ప్రజలు
Posted On:
30 SEP 2023 4:45PM by PIB Hyderabad
జీవిక దీదీస్ (మహిళల స్వయం సహాయక సంఘాలు) బిహార్‌లో ''స్వచ్ఛత హి సేవ''- 2023 కార్యక్రమాలను ముందుండి నడిపిస్తున్నాయి, ‘వ్యర్థ రహిత భారతదేశం’ ప్రచారానికి నాయకత్వం వహిస్తున్నాయి. శ్రమదానం, పరిశుభ్రత కార్యకలాపాలపై స్థానికులకు అవగాహన కల్పించడం, పాల్గొనడం, ప్రోత్సహించడంపై ప్రధాన దృష్టి పెట్టారు. బిహార్ రాష్ట్రం మొత్తంలో సాధారణ స్థలాలు, మార్కెట్ ప్రదేశాలు, వీధులు, చెత్త ప్రదేశాలు, గంగా నది ఒడ్డు, పర్యాటక, చారిత్రక, మతపరమైన ప్రదేశాల్లో చెత్తను తీసేసేందుకు భారీ ప్రజా ఉద్యమం సాగుతోంది.
జీవిక బిహార్‌లో సుమారు 10 లక్షల మహిళా స్వయం సహాయక బృందాలు ఉన్నాయి. 74 వేలకు పైగా గ్రామ స్థాయి సంస్థల భారీ నెట్‌వర్క్ ఇది. తద్వారా, బిహార్‌లో 'స్వచ్ఛత హి సేవ' కోసం సుమారు 1.24 కోట్ల మంది మహిళలు ఏకం అయ్యారు, ‘నారీ శక్తి’ని ప్రతిబింబించారు.
హర్ దిన్-ఏక్ గావ్ (ప్రతి రోజు - ఒక గ్రామం) కోసం ఒక సమగ్ర ప్రణాళిక రూపొందించడం జరిగింది. రాష్ట్ర, జిల్లా స్థాయల్లోని ప్రభుత్వ అధికారులు సహా సమాజంలోని అన్ని వర్గాల నుంచి చురుకైన భాగస్వామ్యం నెలకొంది. జిల్లా మేజిస్ట్రేట్‌లు కూడా తమ సిబ్బందితో వచ్చి స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహిస్తూ శ్రమదానం చేపట్టారు. భారీగా జనసంచారం ఉండే ప్రదేశాలు, స్థానిక మార్కెట్లు, వీధులు మొదలైన ప్రదేశాలను శుభ్రపరిచే కార్యక్రమాలను డీఎంలు చేపడుతున్నారు. 'వ్యర్థ రహిత భారతదేశం'ను ప్రచారం చేయడానికి, స్థానిక పారిశుద్ధ్య అవసరాలను పరిష్కరించడానికి ప్రభుత్వం జన్ సంవాద్‌లు నిర్వహిస్తోంది. పారిశుద్ధ్య కార్మికులను, వారి సేవలకు గుర్తుగా సత్కరించడంతోపాటు, వారి కోసం ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నారు.
పాఠశాల స్థాయిలో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టడం, పాఠశాల పిల్లలకు పరిశుభ్రత ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం ద్వారా పిల్లలను సంపూర్ణ పారిశుద్ధ్యానికి తొలి మెట్టుగా మారుస్తున్నారు. తద్వారా, కుటుంబాలు, వారి చుట్టుపక్కల వారికి ఓడీఎఫ్ ప్లస్ సందేశాలను ప్రచారం చేసేలా పారిశుద్ధ్య ప్రచారకర్తలుగా వారిని మారుస్తున్నారు. సుమారు 30,000 పాఠశాల స్థాయి కార్యకలాపాలు చేపట్టారు, 65 లక్షలకు పైగా విద్యార్థులకు భాగస్వామ్యం కల్పించారు. వ్యక్తిగత గృహ మరుగుదొడ్లను నిర్మించడానికి గ్రామ స్థాయిలో సామూహిక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 36 వేల వ్యక్తిగత గృహ మరుగుదొడ్లు నిర్మించారు.
ప్రజా ప్రతినిధులు, క్షేత్రస్థాయి కార్యకర్తలు, సమాజంలోని ప్రముఖులతో జన సంవాద్ లేదా క్షేత్రస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు, తద్వారా గ్రామాలను ఓడీఎఫ్ ప్లస్‌గా మార్చేందుకు అందరూ కలిసి వస్తున్నారు. గృహ, సామాజిక స్థాయుల్లో ద్రవ & ఘన వ్యర్థాల నిర్వహణ కోసం అవగాహన, కార్యాచరణ చర్యలను రూపొందించడానికి స్వచ్ఛత చౌపల్స్ నిర్వహిస్తున్నారు.
రాష్ట్రంలోని 12 జిల్లాల్లోని 266 గ్రామ పంచాయతీల పరిధిలోని గంగా తీరాలను శుభ్రం చేసేందుకు రాష్ట్రం ప్రత్యేక ప్రచారానికి సిద్ధమైంది. సంఘాలు, నెహ్రూ యువ కేంద్రం, పారిశుధ్య కార్మికులు గంగానది ఒడ్డున పరిశుభ్రత పనుల్లో నిమగ్నమయ్యారు. అన్ని రకాల ప్రయత్నాల ద్వారా దాదాపు 5.80 కోట్ల మంది ప్రజలను 'స్వచ్ఛత హి సేవ'లో పాల్గొనేలా చేయడం ద్వారా పారిశుద్ధ్యం ప్రతి ఒక్కరి బాధ్యతగా బిహార్ మారుస్తోంది. తద్వారా, రాష్ట్రాన్ని ఓడీఎఫ్ ప్లస్ లక్ష్యాల దిశగా వేగంగా నడిపిస్తోంది.
(Release ID: 1962609)
Visitor Counter : 96