గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

సఫాయిమిత్రల కోసం చండీగఢ్ స్వచ్ఛతా బహుమతి


ప్రత్యేకంగా పారిశుధ్య పనుల కోసం శానిటేషన్ బూత్ మరియు రూపే స్టోర్ ప్రారంభం

Posted On: 26 SEP 2023 5:47PM by PIB Hyderabad

 

        ప్రస్తుతం దేశవ్యాప్తంగా 'స్వచ్ఛతా పక్షం  - స్వచ్ఛతే సేవ  2023' జోరుగా సాగుతోంది. పర్వత ప్రాంత పట్టణాలు, పర్యాటక ప్రదేశాలు మరియు బీచ్‌లలో రాష్ట్రాలు విస్తృతమైన పరిశుభ్రత ప్రచారాలలో  క్రియాశీలకంగా  పాల్గొంటున్నాయి. విశేషమేమిటంటే, ఇప్పటివరకు 13 కోట్ల మంది పౌరులు 15 రోజుల ప్రచారోద్యమంలో  చేరారు. దానికితోడు  దేశవ్యాప్తంగా వివిధ నగరాలలో పరిపాలనా సంస్థల  ద్వారా 'సఫాయిమిత్ర సురక్షా శిబిరాలు' నిర్వహించడం జరుగుతోంది.  దీని ప్రాథమిక లక్ష్యం పారిశుధ్య కార్మికులు మరియు వారిపై ఆధారపడిన వారికి సంక్షేమ పథకాలను అందించడం, వారి సంపూర్ణ శ్రేయస్సు, జీవన నాణ్యతను మెరుగుపరచడంపై దృష్టి సారించి చర్యలు తీసుకోవడం.

        స్వచ్ఛత  కార్యక్రమంలో భాగంగా దేశప్రజలందరూ కలసికట్టుగా బాపు జయంతి సందర్భంగా అక్టోబర్ 1వ తేదీ ఉదయం 10 గంటలకు స్వచ్ఛత కోసం 1 గంట  శ్రమదానంలో పాల్గొని ఆయనకు ‘స్వచ్ఛాంజలి’ ఘటించాలని  మన్ కీ బాత్ 105వ ఎపిసోడ్‌లో
గౌరవనీయులైన ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు.   స్వచ్ఛతా హి సేవా అభియాన్‌పై ప్రధానమంత్రి మాట్లాడుతూ
 “అక్టోబర్ 1వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు పరిశుభ్రతపై పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. మీరు కూడా సమయాన్ని వెచ్చించి పరిశుభ్రతకు సంబంధించిన ఈ ప్రచారంలో సహకరించండి. మీరు మీ వీధిలో లేదా పరిసరాల్లో లేదా పార్క్, నది, సరస్సు లేదా మరేదైనా బహిరంగ ప్రదేశంలో కూడా ఈ పరిశుభ్రత ప్రచారంలో జత కలవవచ్చు" అని అన్నారు.

        చండీగఢ్‌లో ఇటీవల 'సఫాయిమిత్ర సురక్ష శివిర్' పేరిట నాలుగు రోజుల శిబిరాన్ని నిర్వహించారు. శిబిరం సందర్బంగా  దాదాపు 1,300 మంది సఫాయిమిత్రలు ఆయుష్మాన్ భారత్, అటల్ పెన్షన్ యోజన, జీవన్ జ్యోతి బీమా యోజన, సురక్ష బీమా యోజన వంటి వివిధ ప్రభుత్వ పథకాలలో  తమ పేర్లు నమోదు చేసుకున్నారు, ప్రమాదాలు మరియు వైకల్యాలకు వ్యతిరేకంగా సమగ్ర బీమాను సమకూరుస్తున్నారు.  అనేక మంది సఫాయిమిత్రల కుటుంబ సభ్యులు కొత్త బ్యాంక్ ఖాతాలను తెరిచారు మరియు సమీకృత బీమా ప్రతిపాదనల  నుంచి  ప్రయోజనం పొందారు.


          చండీగఢ్ నగరపాలక సంస్థ (ఎంసిసి)  తమ సఫాయిమిత్రల శ్రేయస్సు మరియు పని పరిస్థితులను మెరుగుపరచడానికి క్రియాశీల చర్యగ సారంగపూర్ గ్రామంలో అత్యాధునిక 'శానిటేషన్ బూత్'ను ప్రారంభించింది. ఈ ఆధునిక సదుపాయం సఫాయిమిత్రలు వారి సాధారణ పనిని నిర్వహించడానికి సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తుంది.  దుర్భర వాతావరణ పరిస్థితుల నుండి బూత్ సఫాయి మిత్రలకు ఆశ్రయం కల్పిస్తుంది. వాటిని తీక్షణమైన  సూర్యకాంతి నుండి శీతాకాలంలో ఎముకలు కొరికే చలి నుండి కాపాడుతుంది. వీటిలో  తాగునీరు, ప్రథమ చికిత్స వస్తు సామగ్రి మరియు సరైన వెలుతురు వంటి అవసరమైన సౌకర్యాలు ఉన్నాయి.  దానిలో ఉన్న సదుపాయాలు సఫాయిమిత్రలు రోజంతా హాయిగా పని చేయడాన్ని నిశ్చయం చేస్తుంది. కొత్తగా ఏర్పాటుచేసిన శానిటేషన్ బూత్   నగర పరిశుభ్రతను కాపాడటానికి  సఫాయిమిత్రలు చేస్తున్న కృషిని,  నిబద్ధతను గుర్తించి వారి పని పరిస్థితులను మెరుగుపరచాలన్న ఎంసిసి  అంకితభావాన్ని ఉద్ఘాటిస్తున్నది.

           సఫాయిమిత్ర సురక్షా శివిర్‌ను మరింత మెరుగుపరచడానికి, మహిళా భవన్‌లో ఒక ప్రత్యేక రూపాయి స్టోర్ స్థాపించడం జరిగింది.  దానిలో  RRR కేంద్రం నుండి సేకరించిన విభిన్న రకాల వస్తువులను నిల్వచేయడం జరిగింది. సఫాయిమిత్రలకు, వారి కుటుంబాలకు మద్దతు ఇచ్చే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ స్టోర్ నుంచి ప్రతి ఆధార్ కార్డ్ హోల్డర్ రెండు వస్తువులను ఎంపిక చేసుకోవచ్చు. స్వచ్ఛతా పఖ్వాడా ప్రచారంలో భాగంగా చండీగఢ్ చేపట్టిన శానిటేషన్ బూత్, ప్రత్యేక రూపే స్టోర్‌ ఏర్పాటు వంటి వినూత్న కార్యక్రమాలు
సఫాయిమిత్రల స్ఫూర్తిని ఉన్నత స్థానంలో ఉంచగలవు.



****



(Release ID: 1961542) Visitor Counter : 79


Read this release in: English , Urdu , Hindi