విద్యుత్తు మంత్రిత్వ శాఖ
మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం వచ్చే మూడేళ్లలో ఉమ్మడిగా రూ.55,000 కోట్ల రుణాలు ఇవ్వడానికి ఎంవోయూ కుదుర్చుకున్న ఆర్‌ఈసీ, పీఎన్‌బీ
Posted On:
26 SEP 2023 6:39PM by PIB Hyderabad
విద్యుత్, మౌలిక సదుపాయాలు & లాజిస్టిక్స్ రంగానికి నిధులు సమకూర్చే అవకాశాలను సంయుక్తంగా అన్వేషించడానికి ఒక కన్సార్టియంగా ఏర్పడేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌తో (పీఎన్‌బీ) ఆర్‌ఈసీ లిమిటెడ్ ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ రెండు సంస్థలు కలిసి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం వచ్చే మూడేళ్లలో ఉమ్మడిగా రూ.55,000 కోట్ల రుణాలు ఇవ్వడానికి ఈ ఒప్పందం కుదిరింది.
ఆర్‌ఈసీ కార్యనిర్వాహక డైరెక్టర్ (మౌలిక సదుపాయాలు & లాజిస్టిక్స్) శ్రీ టి.ఎస్.సి. బోస్, పీఎన్‌బీ సీజీఎం (కార్పొరేట్ రుణాల విభాగం) శ్రీ రాజీవ ఈ రోజు గురుగావ్‌లో ఎంఓయూపై సంతకం చేశారు. ఆర్‌ఈసీ డైరెక్టర్ (ఫైనాన్స్) శ్రీ అజోయ్ చౌదరి, ఆర్‌ఈసీ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) శ్రీ వి.కె. సింగ్, ఆర్‌ఈసీ & పీఎన్‌బీ సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆర్‌ఈసీ లిమిటెడ్ అనేది ఒక మహారత్న కంపెనీ. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. దీనిని 1969లో స్థాపించారు. విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ, పునరుత్పాదక శక్తి, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు, హరిత హైడ్రోజన్ వంటి కొత్త సాంకేతికతల ప్రాజెక్టులకు దీర్ఘకాలిక రుణాలు, ఇతర ఆర్థిక ఉత్పత్తులను అందిస్తుంది. ఇటీవల, రహదారులు & ఎక్స్‌ప్రెస్‌వేలు, మెట్రో రైలు, విమానాశ్రయాలు, ఐటీ కమ్యూనికేషన్, సామాజిక & వాణిజ్య మౌలిక సదుపాయాలు (విద్యాసంస్థలు, ఆసుపత్రులు), పోర్టులు & ఎలక్ట్రో-మెకానికల్ (ఈ&ఎం) పనులతో కూడిన విద్యుత్‌యేతర మౌలిక సదుపాయాల విభాగంలోకి కూడా ఆర్‌ఈసీ విస్తరించింది. ఆర్‌ఈసీ రుణ పుస్తకం విలువ రూ. 4,54,393 కోట్లకు పైగా ఉంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒక ప్రభుత్వ సెక్టార్ బ్యాంక్. దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ వ్యాపారంలో పాలుపంచుకుంటోంది, అవస్థాపన ప్రాజెక్టులకు నిధులు అందిస్తుంది. మన దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఇది ఒకటి. ప్రపంచ దేశాల్లోనూ పీఎన్‌బీ శాఖలు పని చేస్తున్నాయి. 1894లో ప్రారంభమైన పీఎన్‌బీ, రూ. 22,14,741 కోట్ల ప్రపంచ స్థూల వ్యాపారం చేస్తోంది.
***
(Release ID: 1961139)
Visitor Counter : 152