నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం కోసం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తో అవగాహన ఒప్పందాలపై సంతకం చేసిన - ఐ.ఆర్.ఈ.డి.ఏ.
Posted On:
18 SEP 2023 8:37PM by PIB Hyderabad
కేంద్ర నూతన, పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ కింద పరిపాలనా నియంత్రణలో ఉన్న భారత ప్రభుత్వ మినీ రత్న (కేటగిరీ - I) సంస్థ, భారత పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (ఐ.ఆర్.ఈ.డి.ఎ) బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బి.ఓ.ఎం) తో ముఖ్యమైన అవగాహన ఒప్పందం (ఎం.ఓ.యు) పై ఈరోజు, 2023 సెప్టెంబర్, 18వ తేదీన సంతకం చేసింది. దేశవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల ఏర్పాటు కోసం రుణాలను ప్రోత్సహించడం, సులభతరం చేయడం ఈ ఒప్పందం లక్ష్యంగా పెట్టుకుంది.
అన్ని పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు సహ-రుణాలు, సహకార మద్దతు, రుణ సిండికేషన్, పూచీకత్తు, ఐ.ఆర్.ఈ.డి.ఏ. రుణగ్రహీతల కోసం ట్రస్టు, రిటెన్షన్ ఖాతా నిర్వహణతో పాటు 3, 4 సంవత్సరాల కాల వ్యవధి లో స్థిరమైన స్థిర వడ్డీ రేట్లను నెలకొల్పడానికి నిబద్ధతతో సహా అనేక సేవలను ఈ ఎమ్.ఓ.యు. లో పొందుపరచడం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం, ఐ.ఆర్.ఈ.డి.ఏ. ద్వారా జారీ చేసే బాండ్లలో నిర్ణీత నిబంధనలు, షరతులకు అనుగుణంగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పెట్టుబడి పెట్టవచ్చు.
ఈ ఎం.ఓ.యు. పై ఐ.ఆర్.ఈ.డీ.ఏ. జనరల్ మేనేజర్ (టెక్నికల్ సర్వీసెస్) శ్రీ భరత్ సింగ్ రాజ్‌పుట్; బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, జనరల్ మేనేజర్ (రిటైల్ & ఎం.ఎస్.ఎం.ఈ. క్రెడిట్) శ్రీ రాజేష్ సింగ్ న్యూఢిల్లీ లోని ఐ.ఆర్.ఈ.డీ.ఏ. వ్యాపార కేంద్రంలో సంతకం చేశారు. ఐ.ఆర్.ఈ.డీ.ఏ. చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రదీప్ కుమార్ దాస్ తో పాటు, రెండు సంస్థలకు చెందిన ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో ఈ సంతకాల కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఐ.ఆర్.ఈ.డీ.ఏ. చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ దాస్ మాట్లాడుతూ, “భారతదేశంలో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడానికి కొనసాగుతున్న మా ప్రయత్నాలలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తో ఈ ఒప్పందం మరొక ముఖ్యమైన ముందడుగు. ఈ ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా, హరిత ఇంధన ప్రాజెక్టుల కోసం బలమైన ఆర్థిక పర్యావరణ వ్యవస్థను అందించడంతో పాటు, స్వచ్ఛమైన, స్థిరమైన శక్తిని మరిన్ని సంఘాలు, పరిశ్రమలకు అందుబాటులోకి తీసుకురావాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. గౌరవనీయులైన ప్రధానమంత్రి నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా, 2070 నాటికి భారతదేశం ఉద్గార రహిత దేశం కావాలన్న లక్ష్యాన్ని సాధించే దిశగా ఆర్థిక సంస్థలు, ప్రభుత్వ సంస్థలు కలిసి పనిచేయవలసిన ప్రాముఖ్యతను ఈ భాగస్వామ్యం నొక్కి చెబుతుంది." అని పేర్కొన్నారు.
గ్రీన్ హైడ్రోజన్, ఆఫ్-షోర్ విండ్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలతో సహా పునరుత్పాదక ఇంధన రంగానికి గణనీయమైన నిధుల అవసరాన్ని పరిష్కరించడానికి, పెద్ద, పెద్ద ప్రాజెక్టుల కోసం సహ-రుణాలు ఇవ్వడంలో సహకరించడానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో అవగాహన ఒప్పందాలపై ఐ.ఆర్.ఈ.డి.ఏ. సంతకాలు చేసింది.
****
(Release ID: 1959810)
Visitor Counter : 139