రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వంతెనలు, ఇతర నిర్మాణాల ఆకృతులు & నిర్మాణాన్ని బలోపేతం చేయడానికి డీఎంఆర్‌సీతో ఎన్‌హెచ్‌ఏఐ ఒప్పందం

Posted On: 20 SEP 2023 5:49PM by PIB Hyderabad

ప్రపంచ స్థాయి జాతీయ రహదారులను నిర్మించే ప్రయత్నాల్లో భాగంగా, వివిధ వంతెనలు/నిర్మాణాల ఆకృతులు, ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టుల భద్రత అంశాలు, ఎన్‌హెచ్‌ఏఐ అధికార్ల సామర్థ్యాన్ని పెంచడానికి దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌తో (డీఎంఆర్‌సీ) ఎన్‌హెచ్‌ఏఐ ఈ రోజు ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్‌హెచ్‌ఏఐ చైర్మన్ శ్రీ సంతోష్ కుమార్ యాదవ్, డీఎంఆర్‌సీ మేనేజింగ్ డైరెక్టర్ డా.వికాస్ కుమార్ సమక్షంలో ఎంవోయూపై సంతకాలు జరిగాయి. రెండు సంస్థల సీనియర్ అధికార్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై వంతెనలు, నిర్మాణాలు, సొరంగాలు, ఆర్‌ఈ గోడలకు సంబంధించిన ప్రణాళిక, రూపకల్పన, నిర్మాణం, నిర్వహణను సమీక్షించే ఎన్‌హెచ్‌ఏఐ 'డిజైన్ డివిజన్'ను ఈ ఒప్పందం బలోపేతం చేస్తుంది.

ఒప్పందం ప్రకారం, ప్రస్తుతం కొనసాగుతున్న ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టుల్లోని అన్ని వంతెనలు/నిర్మాణాల ఆకృతుల సమీక్షించడంలో డీఎంఆర్‌సీ సేవలను అందిస్తుంది. ఎంపిక చేసిన వంతెనలు, నిర్మాణాలు, సొరంగాలు, ఆర్‌ఈ గోడలు, ఇతర ప్రత్యేక నిర్మాణాల ఆకృతులపైనా సమీక్ష ఉంటుంది. స్వతంత్ర్య వంతెనలు, ప్రత్యేక నిర్మాణాలను సమీక్షించేందుకు వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) దశలో ఎన్‌హెచ్‌ఏఐకి డీఎంఆర్‌సీ సాయం చేస్తుంది.

ఎంపిక చేసిన వంతెనలు, ప్రత్యేక నిర్మాణాల కట్టుబడి పద్ధతులు, తాత్కాలిక నిర్మాణాలు, ఆవిష్కరణ పద్ధతులను సమీక్షించడంలోనూ డీఎంఆర్‌సీ సాయం చేస్తుంది. దీంతోపాటు, ఎన్‌హెచ్‌ఏఐ అధికారుల సామర్థ్యం పెంచడానికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను డీఎంఆర్‌సీ నిర్వహిస్తుంది.

ఈ ఒప్పందం రెండేళ్ల పాటు అమల్లో ఉంటుంది. ఉత్తమ విధానాలను పంచుకోవడం, దేశ నిర్మాణ లక్ష్యంలో దోహదపడే రవాణా అవస్థాపన నెట్‌వర్క్‌ను మెరుగుపరిచేందుకు కలిసి పనిచేయడం వంటి అంశాల్లో రెండు ప్రభుత్వ సంస్థల మధ్య సహకారాన్ని ఈ చొరవ ప్రతిబింబిస్తుంది.

 

***


(Release ID: 1959252) Visitor Counter : 107


Read this release in: English , Urdu , Hindi , Punjabi