కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

“అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల యుగంలో డిజిటల్ చేరిక” అనే అంశంపై సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసిన - ట్రాయ్

Posted On: 14 SEP 2023 6:11PM by PIB Hyderabad

“అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల యుగంలో డిజిటల్ చేరిక” అనే అంశంపై భారత టెలికాం నియంత్రణ సాధికార సంస్థ (ట్రాయ్) ఈరోజు 2023 సెప్టెంబర్, 14వ తేదీన ఒక సంప్రదింపుల పత్రాన్ని (సి.పి.ని) విడుదల చేసింది.  సమాజంలోని అన్ని విభాగాలు, పరిశ్రమలకు, ప్రత్యేకించి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎం.ఎస్.ఎం.ఈ.ల) చేరికను నిర్ధారించడంపై దృష్టి సారించి, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల యొక్క వేగవంతమైన పురోగతి ద్వారా ఎదురవుతున్న సవాళ్లు, అవకాశాలను అన్వేషించడం, పరిష్కరించడం ఈ సంప్రదింపుల పత్రం లక్ష్యం.

నేటి ప్రపంచంలో, ఆన్‌-లైన్‌ లో అనుసంధానం కావడం అనేది ఒక జీవన విధానంగా మారింది.  సమాచారాన్ని తెలుసుకోవడం, ప్రాథమిక సేవలను స్వీకరించడం, రిమోట్‌ గా పని చేయడం, విద్యను అభ్యసించడం, ఆర్థిక లావాదేవీలు నిర్వహించడం తో పాటు ప్రియమైన వారితో సన్నిహితంగా ఉండటం వంటి రోజువారీ విధుల కోసం అనుసంధానత అనేది ఒక ముఖ్యమైన సాధనంగా పనిచేస్తోంది.   దేశంలోని ప్రతి పౌరునికి సరైన సమయంలో డిజిటల్ చేరిక అనేది కీలకమైన సాధికారత అని ట్రాయ్ గుర్తించింది.  ఇది విఫలమైతే డిజిటల్ సేవలను అందుకోవడంలో అంతరాలు మరింతగా విస్తరిస్తాయి.  తద్వారా సమాజంలోని పెద్ద సంఖ్యలో ప్రజలు బాగా అనుసంధానమైన ఇతరులతో కలిసి  డిజిటల్ సేవల ప్రయోజనాలను పొందడంలో సమ్మిళిత వృద్ధిని కోల్పోతారు.  డిజిటల్ ఆర్థిక కార్యకలాపాలలో వ్యక్తుల భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి ఒక బలమైన విధానంతో పాటు, వాటాదారుల మధ్య సహకార ప్రయత్నాల అవసరాన్ని ఈ సంప్రదింపుల పత్రంలో ట్రాయ్ నొక్కి చెప్పింది. 

డిజిటల్ పరివర్తన లో భారతదేశం గణనీయమైన పురోగతిని సాధించింది. చందాదారుల పరంగా ప్రపంచంలో రెండవ అతిపెద్ద టెలికాం మార్కెట్‌ గా భారత్ అవతరించింది.  డేటా ఖర్చుల్లో గణనీయమైన తగ్గింపుతో పాటు మొబైల్ బ్రాడ్‌-బ్యాండ్ సబ్‌స్క్రిప్షన్లు, ఇంటర్నెట్ వినియోగంలో దేశం గణనీయమైన వృద్ధిని సాధించింది.  డిజిటల్ ఇండియా, నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్స్ పాలసీ 2018, నేషనల్ బ్రాడ్‌బ్యాండ్ మిషన్ 2019, భారత్‌-నెట్, కామన్ సర్వీస్ సెంటర్లు (సి.ఎస్.సి) తో పాటు, యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యు.ఎస్.ఓ.ఎఫ్) వంటి ప్రభుత్వ కార్యక్రమాలు దేశంలో కనెక్టివిటీని విస్తరించడంలో, డిజిటల్ చేరికను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించాయి. 

సమ్మిళిత ఆర్థిక సమాజం కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డి.పి.ఐ) విజయగాథ ప్రపంచవ్యాప్తంగా బాగా గుర్తించబడింది.  జన్-ధన్, ఆధార్, మొబైల్ (జె.ఏ.ఎం) మూడూ సంక్షేమ రాయితీల పారదర్శక ప్రత్యక్ష ప్రయోజనాలను వెనుకబడిన వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయడంలో కీలక పాత్ర పోషించాయి.  యు.పిఐ. వినియోగదారులకు సకాలంలో సౌకర్యవంతంగా ఒక బ్యాంకు ఖాతా నుండి మరొక ఖాతాకు డబ్బును బదిలీ చేయడానికి అధికారం ఇచ్చింది.  ఈ విజయాలు ఉన్నప్పటికీ, ఇంటర్నెట్ బ్రాడ్‌-బ్యాండ్ వ్యాప్తిలో అసమానతలతో పాటు, సమాజంలోని వివిధ విభాగాలు, భౌగోళిక ప్రాంతాల్లో దాని ప్రభావవంతమైన వినియోగం ఇప్పటికీ కొనసాగుతున్నట్లు గమనించబడింది.  బ్రాడ్‌-బ్యాండ్ కనెక్షన్లపై పనిచేసే సేవలు, అందుబాటులో దరఖాస్తులు, స్థోమత, ప్రభావవంతమైన, సురక్షితమైన వినియోగానికి, ప్రత్యేకించి అట్టడుగు వర్గాలకు చెందిన వ్యక్తులు, మహిళలు, బాలికలతో పాటు, మారుమూల, క్లిష్టమైన ప్రాంతాల్లో లేదా గ్రామాల్లో పనిచేస్తున్న సూక్ష్మ, చిన్న వ్యాపారవేత్తల భాగస్వామ్యానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. వీటిని సమయానుకూలంగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది.

దేశంలోని మొబైల్ ఇంటర్నెట్ వినియోగ అంతరం, గ్రామీణ-పట్టణ ఇంటర్నెట్ వ్యాప్తి అసమానతలు, ఇంటర్నెట్ యాక్సెస్‌ లో లింగ అంతరాలు మొదలైన వాటితో పాటు కొన్ని గ్లోబల్ సూచీల నుండి గుర్తించబడిన ఖాళీలు వంటి డిజిటల్ ఇన్‌క్లూజన్‌లో వివిధ అంతరాలను ట్రాయ్ తన సంప్రదింపు పత్రంలో విశ్లేషించింది.  ముందస్తుగా ప్రాధాన్యత ఇచ్చే చేరిక, ప్రతి వ్యక్తికి ప్రయోజనం చేకూర్చే పర్యావరణ వ్యవస్థను సృష్టించగలదు.  మరింత సమానమైన, అందుబాటులో ఉన్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థను అది ప్రోత్సహిస్తుంది.

కృత్రిమ మేధస్సు / మెషిన్ లెర్నింగ్ ఆధారిత సేవలతో పాటు, ఈ సాంకేతికతలను అవలంబించడానికి, ఉపయోగించుకోవడానికి అయ్యే అనుబంధ ఖర్చులతో సహా సాంకేతిక పురోగతి వేగం, 5-జి సేవల ప్రారంభం తో పాటు, ముఖ్యంగా అట్టడుగు వర్గాలు, వెనుకబడిన ప్రాంతాల కోసం డిజిటల్ విభజనను మరింత విస్తృతం చేసే అవకాశం ఉంది.  మౌలిక సదుపాయాలు సమానంగా అందుబాటులో లేకపోవడం, పరిమిత డిజిటల్ అక్షరాస్యత, స్థోమత సమస్యలు సమానమైన పంపిణీ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల వినియోగానికి ఆటంకం కలిగించడంతో పాటు, డిజిటల్ చేరికలో ఉన్న అసమానతలను మరింత తీవ్రతరం చేస్తాయి.  సమగ్ర డిజిటల్ చేరికను నిర్ధారించడానికి వీలుగా, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల కారణంగా ఏర్పడే అవకాశం ఉన్న అంతరాలను పరిష్కరించడం అత్యవసరం.

నూతన, అభివృద్ధి చెందుతున్న డిజిటల్ సాంకేతిక పరిష్కారాలను స్వీకరించడం ద్వారా దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎం.ఎస్.ఎం.ఈ) రంగం ఎదుర్కొంటున్న వివిధ సవాళ్లను కూడా ట్రాయ్  గుర్తించింది.  ఎం.ఎస్.ఎం.ఈ. రంగం, ముఖ్యంగా ఏ.ఎస్.ఎం.ఈ. లలో ఎక్కువ భాగంగా ఉన్న సూక్ష్మ-సంస్థలు దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా దోహదం చేస్తున్నందున, నూతన, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిష్కారాల ద్వారా డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు మరింత సహకారం అందించడానికి ఎం.ఎస్.ఎం.ఈ. లకు అధికారాలు కల్పించడం అత్యవసరం. 

సంబంధిత భాగస్వాములు తమ అభిప్రాయాలు తెలియజేయడం కోసం సంప్రదింపుల పత్రాన్ని ట్రాయ్ వెబ్‌సైట్‌ (www.trai.gov.in) లో చూడవచ్చు. 

సంప్రదింపులకు సంబంధించిన సమస్యల గురించి సంబంధిత భాగస్వాములు తమ అభిప్రాయాలను 2023 అక్టోబర్, 16వ తేదీ లోగా  వ్రాతపూర్వకంగా తెలియజేయవచ్చు.  వ్యాఖ్యలు, ప్రతి-వ్యాఖ్యలు ఎలక్ట్రానిక్ రూపంలో ఈ-మెయిల్‌: advisorit[at]trai[dot]gov[dot]in, ద్వారా పంపుతూ ఒక కాపీ Ja-cadiv[at]trai[dot]gov[dot]in కి కూడా పంపాలి.

ఏదైనా వివరణ / సమాచారం కోసం, శ్రీ ఆనంద్ కుమార్ సింగ్, సలహాదారు (సి.ఏ.&ఐ.టి) ని +91-11- 23210990 అనే టెలిఫోన్‌లో సంప్రదించవచ్చు.

***


(Release ID: 1957936) Visitor Counter : 141


Read this release in: English , Urdu , Hindi