గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాల (ఈఎంఆర్ఎస్) ఉపాధ్యాయుడు డాక్టర్ యశ్పాల్ సింగ్ కు 2023 సంవత్సరపు జాతీయ ఉపాధ్యాయుల అవార్డు


ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుడు జాతీయ అవార్డుకు ఎంపిక కావడం గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు గర్వకారణం: శ్రీ అర్జున్ ముండా

Posted On: 06 SEP 2023 6:21PM by PIB Hyderabad

         జాతీయ ఉపాధ్యాయుల అవార్డు - 2023 అందుకున్న ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుడు డాక్టర్ యశ్‌పాల్ సింగ్‌ను కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ అర్జున్ ముండా బుధవారం సత్కరించారు.   దేశవ్యాప్తంగా జాతీయ అవార్డుకు ఎంపికైన 75 మంది అత్యంత ప్రతిభావంతులైన ఉపాధ్యాయులలో  డాక్టర్ యశ్‌పాల్ సింగ్ ఒకరు.  ఆయన మధ్యప్రదేశ్‌ రాష్ట్రం భోపాల్ లో ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నారు.   కఠినంగా, పారదర్శకంగా ఉండే మూడంచెల ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా ఎంపికయ్యారు.
డాక్టర్ యశ్‌పాల్ సింగ్ నాల్గవసారి జాతీయ అవార్డుకు ఎంపికకావడం గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు గర్వకారణం. భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు పొందారు.

         ఈ సందర్భంగా శ్రీ ముండా మాట్లాడుతూ, “ఈఎంఆర్ఎస్ కు  చెందిన ఉపాధ్యాయుడు నాలుగోసారి జాతీయ అవార్డు గ్రహీతగా ఎంపికకావడం ఆయన చేసిన ఆదర్శప్రాయమైన కృషికి గుర్తింపు కావడమే కాక ఇతర పాఠశాలల  ఉపాధ్యాయులు, విద్యార్థులు మరింత మెరుగైన రీతిలో పనిచేసేలా  ప్రేరేపించి ప్రోత్సహిస్తుంది.

       భోపాల్ ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాల స్థాయిని పెంచడానికి, పాఠశాల పేరును సమున్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి డాక్టర్ యశ్‌పాల్ సింగ్  విశేషమైన కృషి  చేయడం ద్వారా వృత్తి పట్ల తనకుగల  నిబద్ధతను  మరియు శ్రద్ధను చాటారు.
         
       పాఠశాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఏకలవ్య పాఠశాల విద్యార్థుల కోసం స్మార్ట్ క్లాస్‌రూమ్‌ల ఏర్పాటు, చెట్ల పెంపకం మరియు స్థిరమైన పర్యావరణ విధానాలను ప్రారంభించడం, ఈఎంఆర్ఎస్ పాఠశాలలో మధ్యలో బడిమానే పిల్లలు అసలు లేకుండా చూడటం, నైపుణ్యవృద్ధిని సుసాధ్యం చేయడం నిర్ధారించడం వంటివి అతని ప్రత్యేకతలు.

        గిరిజన బాలలకు ఈ పాఠశాలల్లో ప్రవేశాన్ని సుసాధ్యం చేయడానికి,  విద్యార్థులను జాతీయ జనజీవన స్రవంతిలోకి తేవడానికి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేస్తున్న కృషికి ఈ అవార్డు నిదర్శనం.  తద్వారా అది వారికి  ఉజ్వలమైన, విజయవంతమైన భవిష్యత్తు నిర్ధారణకు దారితీస్తుంది.   గిరిజన విద్యార్థులలో  విద్యాప్రమాణాలను పెంపొందించడానికి సహకారంతో పనిచేస్తున్న ఈఎంఆర్ఎస్ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులందరినీ కూడా ఇది గుర్తిస్తుంది.   షెడ్యూల్డ్‌ తెగల పిల్లలకు ఉన్నత,  
వృత్తిపరమైన విద్యాకోర్సులలో అవకాశాలను పొందేందుకు, వివిధ రంగాలలో ఉపాధిని పొందేందుకు వీలుగా వారికి నాణ్యమైన
విద్యను అందించడానికి  1997-98లో ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాల భావన ప్రారంభమైంది.

 

***


(Release ID: 1955527) Visitor Counter : 125