శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

“సిఆర్‌టిడిహెచ్ ద్వారా ఎంఎస్‌ఎంఇ రంగానికి సాధికారత”పై లక్నోలోని ‘ఐఐటిఆర్‌’లో ముగిసిన మేధోమథన శిబిరం

Posted On: 25 AUG 2023 1:19PM by PIB Hyderabad

   లక్నోలోని భారత విషవిజ్ఞాన పరిశోధన సంస్థ (ఐఐటిఆర్‌) ప్రాంగణంలో “సార్వత్రిక పరిశోధన-సాంకేతిక అభివృద్ధి కూడలి (సిఆర్‌డిటిహెచ్‌) ద్వారా ‘ఎంఎస్‌ఎంఇ’ రంగానికి సాధికారత” ఇతివృత్తంగా 2023 ఆగస్టు 24న రెండో మేధోమథన శిబిరం నిర్వహించబడింది. కేంద్ర శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని శాస్త్రవిజ్ఞాన-పారిశ్రామిక పరిశోధన విభాగం (డిఎస్‌ఐఆర్‌) తన ‘సిఆర్‌డిటిహెచ్‌’ కార్యక్రమం కింద ‘ఐఐటిఆర్‌’తో సంయుక్తంగా ఈ శిబిరాన్ని  నిర్వహించింది.

   విద్యా, పారిశ్రామిక రంగాల మధ్య సంబంధాల బలోపేతం లక్ష్యంగా ఈ శిబిరం నిర్వహించబడింది. ఈ సందర్భంగా శాస్త్ర-సాంకేతిక రంగాలతోపాటు పారిశ్రామిక పరిశోధన-అభివృద్ధిని ప్రోత్సహించడంలో, సాంకేతిక ఆవిష్కరణలను బలోపేతం చేసే సంస్కృతిని పెంపొందించడంలో సంయుక్త పరిశోధనలు, సమాచార భాగస్వామ్యం ఎంతటి కీలక పాత్ర పోషిస్తాయో వక్తలు నొక్కిచెప్పారు. దేశవ్యాప్తంగా పరిశోధన-అభివృద్ధి కార్యకలాపాలను  ‘సిఆర్‌డిటిహెచ్‌’ ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగా విస్తృత మద్దతుతోపాటు మార్గనిర్దేశం చేస్తుంది. ఆ విధంగా ‘ఎంఎస్‌ఎంఇ' రంగాన్ని బలోపేతం చేయడం, వృద్ధిహిత వాతావరణం సృష్టించడం, ‘స్వయం సమృద్ధ భారతం’ లక్ష్యసాధన దిశగా సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

   ఈ మేధోమథన శిబిరం ప్రారంభ కార్యక్రమాల్లో ‘డిఎస్‌ఐఆర్‌’ కార్యదర్శి, శాస్త్ర-పారిశ్రామిక పరిశోధన మండలి (సిఎస్‌ఐఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ ఎన్‌.కలైసెల్వి; లక్నోలోని ‘ఐఐటిఆర్‌’ డైరెక్టర్‌ డాక్టర్‌ భాస్కర్‌ నారాయణ్‌; ‘డిఎస్‌ఐఆర్‌’ పరిధిలోని ‘సిఆర్‌డిటిహెచ్‌’ అధిపతి డాక్టర్‌ సుజాత చక్లనోబిస్‌ ప్రసంగించారు. తొలుత డాక్టర్‌ ఎన్‌.కలైసెల్వి మాట్లాడుతూ- ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వప్నమైన ‘స్వయం సమృద్ధ భారతం’ సాధన దిశగా ‘ఎంఎస్‌ఎంఇ’లతోపాటు  అంకుర సంస్థలకు, ఆవిష్కర్తలకు మద్దతివ్వడంలో ‘సిఆర్‌డిటిహెచ్‌’ల ప్రాధాన్యాన్ని వివరించారు. అలాగే విభిన్న భాగస్వాములు తమ పరిశోధన-అభివృద్ధి ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసేలా ప్రోత్సహించడంలో “డిఎస్‌ఐఆర్‌’-సిఆర్‌డిటిహెచ్‌-ఐఐటిఆర్‌”ల సంయుక్త కృషిని డాక్టర్‌ భాస్కర్‌ నారాయణ్‌ కొనియాడారు.

   ప్రస్తుత మేధోమథన శిబిరం ప్రాధాన్యం గురించి డాక్టర్‌ సుజాత చక్లనోబిస్‌ తన ప్రసంగంలో వివరించారు. ఈ సందర్భంగా ఆవిష్కరణల ఆవశ్యకతను నొక్కిచెబుతూ- ఈ పర్యావరణ వ్యవస్థలో ‘ఎంఎస్‌ఎంఇ’లు ఎంతో కీలకమైనవని స్పష్టం చేశారు. పరిశోధన-అభివృద్ధి రంగంతోపాటు అంతర్జాతీయ స్థాయి తయారీ కూడలిగా భారతదేశాన్ని తీర్చిదిద్దడంలో గణనీయ పాత్ర పోషిస్తాయని ఆమె పేర్కొన్నారు. ప్రారంభ కార్యక్రమాల్లో భాగంగా సాంకేతికాభివృద్ధి-ఆవిష్కరణల కేంద్రం ప్రాంగణంలో “డిఎస్‌ఐఆర్‌’-సిఆర్‌డిటిహెచ్‌-ఐఐటిఆర్‌” భవనాన్ని, ఈ మూడు సంస్థల నవీకృత వెబ్‌సైట్‌ను కూడా డాక్టర్‌ సుజాత చక్లనోబిస్‌, డాక్టర్‌ భాస్కర్‌ నారాయణ్‌ ప్రారంభించారు. అనంతరం ‘ఎంఎస్‌ఎంఇ’లు, “డిఎస్‌ఐఆర్‌’-సిఆర్‌డిటిహెచ్‌-ఐఐటిఆర్‌”ల మధ్య కుదిరిన రెండు అవగాహన ఒప్పందాలపై ఆయా సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు.

   అనంతరం లక్నోలోని ‘సిఎస్‌ఐఆర్‌-ఐఐటిఆర్‌’ డైరెక్టర్‌ ప్రసంగిస్తూ- “డిఎస్‌ఐఆర్‌’-సిఆర్‌డిటిహెచ్‌-ఐఐటిఆర్‌”లో భవిష్యత్‌ సాంకేతిక ఆవిష్కరణల గురించి సంక్షిప్తంగా వివరించారు. ఈ కృషిలో ‘విద్యా-ఎంఎస్‌ఎంఇ’ రంగాల మధ్య సమన్వయానికిగల ప్రాధాన్యం గురించి ఇతివృత్త ఆధారిత చర్చాగోష్ఠిలో నొక్కిచెప్పారు.  ఆ తర్వాత డాక్టర్‌ పార్థసారథి, డాక్టర్‌ బి.శ్రీకాంత్‌ మాట్లాడుతూ- “డిఎస్‌ఐఆర్‌’-సిఆర్‌డిటిహెచ్‌-ఐఐటిఆర్‌”లో సాగే కార్యకలాపాలుసహా  ‘ఎంఎస్‌ఎంఇ’ల కో్సం అవకాశాల అన్వేషణ కృషి గురించి వివరించారు.

   ఈ శిబిరంలో పాల్గొన్న ‘ఎంఎస్‌ఎంఇ’, అంకుర/ఆవిష్కరణ సంస్థల ప్రతినిధులను ఐదు బృందాలుగా విభజించారు. ఆయా సంస్థలు తమ పరిశోధన-అభివృద్ధి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించుకోవడంపై సూచనలివ్వడంతోపాటు సంక్షిప్త ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు. ఇతివృత్త ఆధారిత కార్యక్రమంలో భాగంగా ప్రతినిధుల మధ్య ‘చర్చాగోష్ఠి’కి ‘డిఎస్‌ఐఆర్‌’లో ‘సైంటిస్ట్‌-ఎఫ్‌’ డాక్టర్‌ విపిన్‌ సి.శుక్లా సమన్వయకర్తగా వ్యవహరించారు. ‘ఎంఎస్‌ఎంఇ’, అంకుర/ఆవిష్కరణ సంస్థలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఈ గోష్ఠిలో కూలంకషంగా చర్చించారు. ఆయా సమస్యల పరిష్కారం దిశగా ‘పిఐ, లక్నోలోని “డిఎస్‌ఐఆర్‌-సిఆర్‌డిటిహెచ్‌-ఐఐటిఆర్‌” ప్రతినిధులు సూచనలు, సలహాలు ఇచ్చారు.

   ఈ కార్యక్రమంలో “డిఎస్‌ఐఆర్‌-సిఆర్‌డిటిహెచ్‌-ఐఐటిఆర్‌” బృందంతోపాటు ‘డిఎస్‌ఐఆర్‌’ సీనియర్ అధికారులు డాక్టర్ రణ్‌జీత్ బైర్వా, డాక్టర్ కైలాష్ పేట్కర్ పాల్గొన్నారు. అలాగే సూక్ష్మ-చిన్న-మధ్యతరహా (ఎంఎస్‌ఎంఇ) పరిశ్రమలు, అంకుర సంస్థల ప్రతినిధులతోపాటు ఉత్తరప్రదేశ్‌ జిల్లా రిసోర్స్ పర్సన్లు, వ్యక్తిగత ఆవిష్కర్తలు, పరిశ్రమల సమాఖ్య, పారిశ్రామిక సంఘాలు, అసోచామ్ల నుంచి పెద్ద సంఖ్యలో ప్రతినిధులు కూడా ఈ కీలక కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా డిఎస్‌ఐఆర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ కైలాష్ సి. పేట్కర్ వందన సమర్పణ చేస్తూ ప్రముఖులు, నిర్వాహకులు, భాగస్వామ్య ప్రతినిధులు, మీడియా సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.

*****


(Release ID: 1952350) Visitor Counter : 143


Read this release in: Urdu , English , Hindi , Tamil