ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పశ్చిమ బంగాల్‌లో ఆరోగ్య సేవలను సమీక్షించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా.మన్‌సుఖ్‌‌ మాండవీయ


పశ్చిమ బంగాల్‌ పౌరులందరికీ నాణ్యమైన సంరక్షణ ఆరోగ్య సేవలు అందించడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది: డా.మాండవీయ

"పశ్చిమ బంగాల్‌ ప్రజల ప్రయోజనాల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేయాలి"

“పశ్చిమ బంగాల్‌ ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించే గొప్ప కార్యక్రమం పీఎం-అభిమ్‌. రాష్ట్రంలోని పౌరులందరికీ టెలీమెడిసిన్ సేవలు అందుబాటులో ఉండేలా కృషి చేస్తున్నాం”

"10,358 ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య & వెల్‌నెస్‌‌ కేంద్రాలు 16 కోట్లకు పైగా ప్రజల సందర్శనలతో పశ్చిమ బంగాల్‌లో పని చేస్తున్నాయి"

Posted On: 25 AUG 2023 2:22PM by PIB Hyderabad

“పశ్చిమ బంగాల్‌ పౌరులందరికీ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది. పశ్చిమ బంగాల్‌ ప్రజల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేయాలి. రాష్ట్రంలో నాణ్యమైన ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం" అని కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డా.మన్‌సుఖ్‌ మాండవీయ చెప్పారు. పశ్చిమ బంగాల్‌లో ఆయన పర్యటించారు. రాష్ట్రంలో ఆరోగ్య సేవలను అందించే వివిధ కార్యక్రమాలపై కేంద్ర మంత్రి ఈ రోజు సమీక్ష నిర్వహించారు.

తన పర్యటనలో భాగంగా, ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య & వెల్‌నెస్‌‌ కేంద్రాలు, జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం అమలు తీరును కేంద్ర మంత్రి సమీక్షించారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమం (ఎన్‌హెచ్‌ఎం), ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయల కార్యక్రమం (పీఎం అభిమ్‌), టెలీమెడిసిన్ సేవలు, వైద్య విద్య, సికిల్ సెల్ అనీమియా నిర్మూలన కార్యక్రమం కింద విడుదల చేసిన నిధుల వినియోగం గురించి వాకబు చేశారు. 

“ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య & వెల్‌నెస్‌ కేంద్రాలు ప్రజల ఇళ్లకు సమీపంలోనే ఉండి, సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలను అందించే గొప్ప చొరవ”గా డా.మాండవీయ చెప్పారు.

జాతీయ ఆరోగ్య కార్యక్రమం కింద పశ్చిమ బంగాల్‌కు ఈ కింది వనరులు జారీ అయ్యాయని కేంద్ర మంత్రి వివరించారు:

  1. రూ.288.72 కోట్ల వ్యయంతో 800 ఉప కేంద్రాలకు ఆమోదం
  2. రూ.10 కోట్లతో 2 పట్టణ సామాజిక ఆరోగ్య కేంద్రాలు, రూ.27.75 కోట్లతో 37 కొత్త పట్టణ పీహెచ్‌సీలు మంజూరు
  3. 404 ఆయుష్మాన్ భారత్ పట్టణ ఆరోగ్య & వెల్‌నెస్‌ కేంద్రాలకు ఆమోదం

 

జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం, జాతీయ ఆరోగ్య కార్యక్రమం కింద విడుదల చేసిన నిధుల స్థితిగతులపైనా కేంద్ర ఆరోగ్య మంత్రి సమీక్షించారు. "2025 నాటికి క్షయ వ్యాధిని నిర్మూలించడానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది. జాతీయ ఆరోగ్య కార్యక్రమం కింద విడుదల చేసిన నిధులను సమర్థవంతంగా ఉపయోగించుకునేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం" అని చెప్పారు.

15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం, పశ్చిమ బంగాల్‌లో రూ.180.12 కోట్లతో 223 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు, రూ.290 కోట్లతో 719 ఉప కేంద్రాలకు ఆమోదం లభించిందని డా.మాండవీయ వెల్లడించారు. పశ్చిమ బంగాల్‌లో 16,82,87,430 మంది సందర్శనలతో 10,358 ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య & వెల్‌నెస్‌ కేంద్రాలు పని చేస్తున్నాయని, 2,08,42,397 టెలీ సంప్రదింపులు నిర్వహించామని చెప్పారు.

ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయల కార్యక్రమం, టెలీమెడిసిన్ సేవల గురించి మాట్లాడిన కేంద్ర మంత్రి, “పశ్చిమ బంగాల్‌ ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి పీఎం అభిమ్‌ ఒక గొప్ప కార్యక్రమం. రాష్ట్రంలోని పౌరులందరికీ టెలీమెడిసిన్ సేవలు అందుబాటులో ఉండేలా కృషి చేస్తున్నాం" అన్నారు. ఈ రంగంలో, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ఈ కింది విధంగా వివరించారు:

  1. రూ.727 కోట్ల వ్యయంతో 22 అత్యవసర వైద్య బ్లాకులు మంజూరు
  2. రూ.47.38 కోట్లతో 23 సమీకృత ప్రజా ఆరోగ్య పరీక్ష కేంద్రాలు మంజూరు
  3. రూ.535.50 కోట్ల వ్యయంతో 510 పట్టణ ఆరోగ్య & వెల్‌నెస్‌ కేంద్రాలకు ఆమోదం

వైద్య విద్య, సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన కార్యక్రమాన్ని కూడా కేంద్ర మంత్రి సమీక్షించారు. “పశ్చిమ బంగాల్‌ ప్రజలకు నాణ్యమైన వైద్య విద్యను అందించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. సికిల్ సెల్ అనీమియా నిర్మూలన కార్యక్రమం విజయవంతం కావడానికి అవసరమైన అన్ని చర్యలను కూడా తీసుకుంటున్నాం" అని చెప్పారు.

                                                                      

****


(Release ID: 1952254) Visitor Counter : 104


Read this release in: English , Urdu , Hindi , Tamil