ఆయుష్

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో సాంప్రదాయ వైద్యంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ


ఆగస్టు 1, 18 తేదీల్లో సంప్రదాయ వైద్య విధానంపై అతిపెద్ద అంతర్జాతీయ కార్యక్రమం

భారతదేశం సాంప్రదాయ వైద్య రంగంలో గత 9 సంవత్సరాల కాలంలో భారతదేశం 8 రెట్లు అభివృద్ధి సాధించింది... : కేంద్ర ఆయుష్ కార్యదర్శి

Posted On: 16 AUG 2023 6:14PM by PIB Hyderabad

 గుజరాత్‌లోని గాంధీనగర్‌లో 2023 ఆగస్టు 17, 18 తేదీల్లో సాంప్రదాయ వైద్య విధానంపై ఆయుష్ మంత్రిత్వ శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండు రోజుల  అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నాయి.  నిర్వహిస్తున్నాయి. సదస్సు వివరాలను  ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య శ్రీ రాజేశ్ కోటేచా ఈరోజు గుజరాత్‌లోని గాంధీనగర్‌లో మీడియాకు వివరించారు.  మీడియా సమావేశంలో   ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ లవ్ అగర్వాల్ కూడా పాల్గొన్నారు. 

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తొలిసారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో డబ్ల్యూహెచ్‌ఓ ఏర్పాటు చేసిన గ్లోబల్ సెంటర్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్స్ ను నెలకొల్పిందని ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి తెలిపారు.  2023 ఆగస్టు 17, 18 తేదీల్లో గాంధీనగర్‌లో ఆయుష్ మంత్రిత్వ శాఖతో కలిసి సాంప్రదాయ వైద్య విధానంపై  ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తుందన్నారు. ఆరోగ్య రంగంలో ఎదురవుతున్నసవాళ్లను ఎదుర్కోవడంలో సాంప్రదాయ, పరిపూరకరమైన, సమగ్ర వైద్యం అనుసరించాల్సిన వ్యూహాన్ని సదస్సులో చర్చించి ఖరారు చేస్తామన్నారు. 

 సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ కోసం ఆయుష్‌ మంత్రిత్వ శాఖ సాంప్రదాయ వైద్య  వ్యవస్థలను బహుముఖంగా అభివృద్ధి  చేయడానికి కార్యక్రమాలు అమలు చేస్తున్నదని శ్రీ రాజేశ్ కోటేచా తెలిపారు.  ప్రధానఆరోగ్య సంరక్షణతో పాటు క్యాన్సర్, టీబీ, అంటువ్యాధులు, స్త్రీ, శిశు ఆరోగ్యం వంటి వ్యాధులపై శాస్త్రీయ దృక్పథంతో ఆయుష్ రంగంలో ఆధారాలతో కూడిన పరిశోధనలు జరుగుతున్నాయన్నారు.

సాంప్రదాయ వైద్య రంగంలో భారతదేశ సామర్ధ్యాన్ని  ప్రదర్శించడానికి జీ-20 రూపంలో ఒక ప్రత్యేక అవకాశం లభించిందని  శ్రీ రాజేశ్ కోటేచా అన్నారు.   గత 9 సంవత్సరాల కాలంలో  భారతదేశం సాంప్రదాయ వైద్య రంగంలో ఎనిమిది రెట్లు అభివృద్ధి సాధించిందని తెలిపిన  శ్రీ రాజేశ్ కోటేచా సంవత్సరం చివరి నాటికి దేశవ్యాప్తంగా 12,500 పైగా  ఆయుష్ ఆధారిత హెల్త్ వెల్నెస్ సెంటర్లు పనిచేయడం ప్రారంభిస్తాయన్నారు.  ఇప్పటికే 8,500 కేంద్రాలు పనిచేస్తున్నాయని వివరించారు. 

 ఆయుష్ వీసా భారతీయ సాంప్రదాయ ఔషధ వ్యవస్థలను ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకు వచ్చి  సమగ్ర ఆరోగ్య సంరక్షణ రంగంలో నూతన శకానికి నాంది పలుకుతుందని కోటేచా తెలిపారు. సదస్సులో ఏర్పాటు చేస్తున్న ఆయుష్ ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందన్నారు. వినూతన రీతిలో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్లో   ఇంటరాక్టివ్ కియోస్క్‌లను ఏర్పాటుచేసి ఆయుష్ ప్రాధాన్యత వివరిస్తామన్నారు. 

 ఆయుష్ సాంప్రదాయ వైద్యంపై అతిపెద్ద అంతర్జాతీయ సదస్సును  భారత ప్రభుత్వం,  ప్రపంచ ఆరోగ్య సంస్థ   కలిసి నిర్వహిస్తున్నాయని శ్రీ  కోటేచా. తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేసిన  గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ప్రాముఖ్యతను ఆయన వివరించారు. అభివృద్ధి చెందుతున్న దేశంలో ఇటువంటి కేంద్రం ఏర్పాటు కావడం ఇదే తొలిసారి అని ఆయన చెప్పారు. 

రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి 30 దేశాల నుంచి ఆరోగ్య మంత్రులు హాజరుకానున్నారు. 90 కి పైగా దేశాలకు చెందిన ప్రతినిధులు, విద్యావేత్తలు,  ప్రభుత్వ ప్రతినిధులు మరియు సాంప్రదాయ వైద్య రంగానికి చెందిన ప్రముఖ సంస్థలు ఆయుష్ రంగానికి చెందిన వివిధ అంశాలు చర్చిస్తారు. 

భారతదేశ ఆరోగ్య సంరక్షణ రంగం, రంగం సాధించిన  పురోగతి,  ఎదుర్కొంటున్న సవాళ్లుతదితర అంశాలను శ్రీ లవ్ అగర్వాల్ వివరించారు.ఆరోగ్య రంగంలో భారతదేశం సాధించిన పురోగతి జీ- 20 దేశాలకు ప్రయోజనం కలిగిస్తుందని అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంరక్షణ రంగంలో జీ-20 దేశాలు కలిసి పనిచేసే అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు.

ప్రపంచ దేశాల ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలకు భారతదేశం అందిస్తున్న  సహకారాన్ని శ్రీ లవ్ అగర్వాల్ వివరించారు. . ప్రపంచంలోని మారుమూల  ప్రాంతాల్లో ఏర్పాటైన యోగా కేంద్రాలు ప్రజలకు ఆరోగ్య సంరక్షణ అందిస్తున్నాయన్నారు.  ఆధునిక, ఆయుష్ వైద్యం ద్వారా భారతదేశం ప్రజలకు  సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ అందిస్తోందని  ఆయన తెలిపారు. 

 

***



(Release ID: 1949725) Visitor Counter : 150