విద్యుత్తు మంత్రిత్వ శాఖ
అరుణాచల్ ప్రదేశ్‌లో నిలిచిపోయిన 11.5 గిగా వాట్ల కన్నా ఎక్కువ సామర్ధ్యం గల జలవిద్యుత్ ప్రాజెక్టులను కేంద్ర విద్యుత్ , అక్షయ ఇంధన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ రంగ జలవిద్యుత్ ప్రాజెక్టులకు శనివారం అప్పగించారు.
12 జలవిద్యుత్ ప్రాజెక్టులను అమలు చేయడం వల్ల అరుణాచల్ రాష్ట్ర సంపద వృద్ధికి, గొప్పతనానికి ఎంతో తోడ్పడుతుంది: కేంద్ర విద్యుత్, అక్షయ ఇంధన వనరుల మంత్రి ఆర్. కె. సింగ్
12 జలవిద్యుత్ ప్రాజెక్టుల ద్వారా అరుణాచల్ రాష్ట్రానికి ₹ 1.26 లక్షల కోట్ల పెట్టుబడులు రాగలవని అంచనా.
Posted On:
12 AUG 2023 6:00PM by PIB Hyderabad
రాష్ట్రంలో నిలిచిపోయిన 12 జల విద్యుత్ ప్రాజెక్టులను పునరుజ్జీవింపజేసి తిరిగి పనిచేసేలా అమలులోకి తేవడానికి భారత ప్రభుత్వం, అరుణాచల్ రాష్ట్ర ప్రభుత్వం కలిసి ముందుకు వచ్చాయి. ఈ దిశలో శనివారం ఆగస్టు 12, 2023న ఇటానగర్ లో
ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఇందులో దాదాపు 11,517 మెగావాట్ల స్థాపిత సామర్ధ్యం ఉన్న 12 జలవిద్యుత్ ప్రాజెక్టులను
రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విద్యుత్, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వరంగ సంస్థలకు కేటాయించింది. ఒప్పందంపై సంతకాలు జరిగే కార్యక్రమానికి కేంద్ర విద్యుత్, అక్షయ ఇంధన శాఖ మంత్రి శ్రీ ఆర్.కె. సింగ్, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పెమా ఖండూ, అరుణాచల్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ చౌనా మీ; కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి పంకజ్
అగర్వాల్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఇతర అధికారులు హాజరయ్యారు.
సమావేశంలో మాట్లాడుతూ జలవిద్యుత్ ప్రాజెక్టుల అమలువల్ల అరుణాచల్ రాష్ట్ర సంపద వృద్ధికి, గొప్పతనానికి ఎంతో తోడ్పడుతుందని శ్రీ ఆర్. కె. సింగ్ అన్నారు. “రాష్ట్ర తలసరి ఆదాయం మహారాష్ట్ర, గుజరాత్ కంటే ఎక్కువ అవుతుంది. అమెరికా, కెనడా, నార్వే మొదలైన అన్ని అభివృద్ధి చెందిన దేశాలు తమ జలవిద్యుత్ సామర్థ్యంలో 80%-90% ఉపయోగంలోకి తెచ్చాయి. మనదేశంలో కూడా జలవిద్యుత్ సామర్థ్యాన్ని ఉపయోగించుకున్న రాష్ట్రాలు సంపన్నంగా మారాయి. జలవిద్యుత్ ఒక హరిత ఇంధన వనరు. దాని వినియోగం భూగర్భ జలాల స్థాయిని పెంచడమే కాక వృక్ష మరియు జంతుజాలం వృద్ధిని ప్రోత్సహిస్తుంది.
ఈ ఒప్పంద పత్రాలపై సంతకం చేయడం మరియు ప్రభుత్వరంగ జలవిద్యుత్ సంస్థలకు ఈ ప్రాజెక్టులను కేటాయించడం అపారమైన అరుణాచల్ జల-విద్యుత్ సామర్థ్యాన్ని వినియోగించుకోవడంలో ఒక ముఖ్యమైన అడుగు కాగలదు. మొత్తం 12 ప్రాజెక్టులలో
2,620 మెగావాట్ల సామర్ధ్యం గల ఐదు ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (నీప్కో)కు ,
5,097 మెగావాట్ల సామర్ధ్యం గల ఐదు ప్రాజెక్టులను సత్లజ్ జలవిద్యుత్ నిగమ్ లిమిటెడ్ (ఎస్ జె వి ఎన్ ఎల్)కు, 3,800 మెగావాట్ల సామర్ధ్యం గల మిగిలిన రెండు ప్రాజెక్టులను జాతీయ జలవిద్యుత్ కార్పొరేషన్ (ఎన్ హెచ్ పి సి)కి కేటాయించారు.
క్ర.సం.
ప్రాజెక్ట్ పేరు , దానిని కేటాయించిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పేరు
1.
టాటో - II హెచ్ ఇ పి (700 మెవా) -- నీప్కో
2
టాటో - I హెచ్ ఇ పి (180 మెవా) -- నీప్కో
3
హీయో - హెచ్ ఇ పి - (240 మెవా) -- నీప్కో
4
నయింగ్ - హెచ్ ఇ పి (1000 మెవా ) -- నీప్కో
5
హిరాంగ్ హెచ్ ఇ పి (500 మెవా) -- నీప్కో
6
ఈటాలిన్ హెచ్ ఇ పి (3097 మెవా) -- సత్లజ్ (ఎస్ జె వి ఎన్ ఎల్)
7
అత్తుంలి హెచ్ ఇ పి (680 మెవా) - సత్లజ్
8
ఈమిని హెచ్ ఇ పి (500 మెవా) - సత్లజ్
9
అములిన్ హెచ్ ఇ పి (420 మెవా) - సత్లజ్
10
మిహిందొన్ అములిన్ హెచ్ ఇ పి (400 మెవా) - సత్లజ్
11
ఎగువ సుబాన్సిరి హెచ్ ఇ పి (2000 మెవా) - ఎన్ హెచ్ పి సి
12
మధ్య సుబాన్సిరి (కమల) హెచ్ ఇ పి (1800 మెవా) - ఎన్ హెచ్ పి సి
ఈ ప్రాజెక్టులను 15 సంవత్సరాల క్రితం అభివృద్ధి చేయడం కోసం ప్రైవేటు రంగ సంస్థలకు కేటాయించడం జరిగింది. అయితే వివిధ కారణాల వల్ల అవి పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. అందుచేత నత్తనడకన సాగుతున్న ప్రాజెక్టులకు ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ జలవిద్యుత్ సంస్థలను ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ప్రాజెక్టుల అభివృద్ధి ద్వారా 2030 నాటికి 500 గిగా వాట్ల శిలాజేతర ఇంధన సామర్ధ్యం సాధించాలనే లక్ష్యాన్ని సాధించడానికి దోహదం చేస్తుంది. 2070 నాటికి కర్బనం లేని ఉద్గారాలను సాధించే లక్ష్యానికి జలవిద్యుత్ కూడా సమర్ధవంతమైన సహకారం అందించగలదు.
ఈ ప్రాంతంలో ఈ ప్రాజెక్టుల ద్వారా భారీ ఉపాధి అవకాశాలు ఏర్పడగలవని, స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంపొందించడంతో పాటు ఈ ప్రాంతంలో నైపుణ్యాభివృద్ధి మరియు సాంకేతిక నైపుణ్యాన్నిపెంపొందించగలవని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుల వల్ల అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సుమారు ₹1,26,500 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేశారు.
***
(Release ID: 1948848)
Visitor Counter : 132