వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

భారతదేశం, లాటిన్ అమెరికా, కరేబియన్ ప్రాంతాల మధ్య సహకారం, విశ్వాసం పెంపొందించాల్సిన అవసరం ఉంది: కేంద్ర వాణిజ్య , పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్


భారత్, ఎల్ఎసి ప్రాంతాల మధ్య లోతైన సహకారం కోసం నాలుగు అంశాల ఎజెండాను సమర్పించిన శ్రీ గోయల్: వాణిజ్య పెట్టుబడుల ప్రవాహాలను పెంచడం, ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని పెంపొందించడం, ఆరోగ్య సంరక్షణ - ఫార్మాస్యూటికల్స్ లో సహకారం, ప్రపంచ సమస్యలను పరిష్కరించడం

వివిధ బహుళపక్ష వేదికల్లో భారతదేశం ఎల్ఎసి ప్రాంతం విస్తృత గ్లోబల్ సౌత్ సహకారం కోసం పనిచేయాలి: శ్రీ గోయల్

పెట్టుబడుల ప్రవాహాన్ని ఉత్తేజపరచడానికి , సరఫరా గొలుసులను ఏకీకృతం చేయడానికి భారతదేశం- ఎల్ఎసి ప్రాంతం మధ్య ద్వైపాక్షిక సహకారానికి ఉన్న అవకాశాలను ప్రముఖంగా వివరించిన శ్రీ గోయల్

విశ్వసనీయ భాగస్వాములుగా కలిసి పనిచేయడానికి భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో చేరాలని ఎల్ఎసి దేశాలను ఆహ్వానించిన శ్రీ గోయల్

Posted On: 04 AUG 2023 2:20PM by PIB Hyderabad

కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ, జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ భారతదేశం -  లాటిన్ అమెరికన్ ,  కరేబియన్ (ఎల్ఎసి) ప్రాంతం మధ్య సహకారం , నమ్మకాన్ని పెంపొందించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఢిల్లీలో  జరిగిన ' తొమ్మిదవ సీఐఐ ఇండియా-ఎల్ఏసీ కాన్ కేవ్' లో ప్రత్యేక మినిస్టీరియల్ సెషన్ ను ఉద్దేశించి మంత్రి ప్రసంగిస్తూ, భారతదేశం - ఎల్ ఎ సి  ప్రాంతం సాంస్కృతిక సంబంధాలను పంచుకుంటాయని, వలసవాద గతం నీడల నుండి ఉద్భవించాయని అన్నారు.

 

భాగస్వామ్యాలు, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్ టి ఎ ) తో మెరుగైన వాణిజ్యం, పెట్టుబడులు, సహకారాల ద్వారా వేగవంతమైన ఆర్థిక వృద్ధికి భారత్ ఆసక్తిగా ఉందని శ్రీ గోయల్ చెప్పారు.

భారతదేశం , ఎల్ఎసి ప్రాంతాల మధ్య లోతైన సహకారాన్ని పెంపొందించడానికి ఉద్దేశించిన సమగ్ర నాలుగు అంశాల ఎజెండాను ఆయన సమర్పించారు: (1) వాణిజ్య పెట్టుబడుల ప్రవాహాలను పెంచడం, (2) ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని పెంపొందించడం, (3) ఆరోగ్య సంరక్షణ,  ఫార్మాస్యూటికల్స్ రంగం లో సహకారం (4) ప్రపంచ సమస్యలను పరిష్కరించడం.

 

వాణిజ్య పెట్టుబడుల ప్రవాహాలను పెంపొందించడానికి ప్రతి దేశ తులనాత్మక,  పోటీ బలాలను క్యాష్ చేసుకునే ఒక పటిష్ట నిర్మాణాత్మక రోడ్ మ్యాప్ ను రూపొందించాలని శ్రీ గోయల్ సూచించారు. ఈ వ్యూహాత్మక విధానం భారత్, ఎల్ ఎ సి దేశాల మధ్య వాణిజ్య పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచడానికి దోహదపడుతుందని ఆయన అన్నారు. వివిధ బహుపాక్షిక వేదికలపై విస్తృత గ్లోబల్ సౌత్ సహకారం కోసం భారత్- ఎల్ ఎ సి  దేశాలు కృషి చేయాలని ఆయన అన్నారు.

 

ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడానికి, పెట్టుబడుల ప్రవాహాన్ని ఉత్తేజపరిచేందుకు ద్వైపాక్షిక సహకారానికి ఉన్న అవకాశాలను మంత్రి వివరించారు. ముఖ్యంగా టూరిజం, హాస్పిటాలిటీ, హెల్త్ కేర్ వంటి రంగాల్లో సప్లై చైన్స్ ను ఏకీకృతం చేయాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు.

వనరులను సమీకరించడం ద్వారా, భారతదేశం - ఎల్ఎసి ప్రాంతం ప్రపంచ ప్రభావాలతో చౌకైన పరిష్కారాలను అభివృద్ధి చేయగలవని శ్రీ గోయల్ అన్నారు.

 

హెల్త్ కేర్, ఫార్మాస్యూటికల్స్ సహకారం కోసం, ఫార్మాస్యూటికల్ రంగంలో పరస్పర గుర్తింపు ఒప్పందాల ప్రాముఖ్యతను, స్మార్ట్ రెగ్యులేటరీ విధానాలను అవలంబించ వలసిన అవసరాన్ని మంత్రి స్పష్టంగా చెప్పారు. అధిక ధరల మందులపై ఆధారపడటాన్ని నిరోధించడానికి , సంక్లిష్ట సవాళ్లకు  సహకార పరిష్కారాలకు మార్గం సుగమం చేయడమే ఈ విధానం లక్ష్యమని శ్రీ గోయల్ అన్నారు.

 

ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి, భారతదేశం- ఎల్ఎసి దేశాల సమిష్టి కృషి అత్యంత క్లిష్టమైన ప్రపంచ సమస్యలకు కూడా సృజనాత్మక పరిష్కారాలకు దారితీస్తుందనే విశ్వాసాన్ని మంత్రి వ్యక్తం చేశారు. సమకాలీన ప్రపంచ సవాళ్లు మనమందరం భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడం, సరఫరా గొలుసులను ఏకీకృతం చేయడం , మన ఖనిజ వనరులు, సాంకేతికత, నైపుణ్యాలు, శ్రామిక శక్తి మొదలైన వాటిని ఉపయోగించుకోవడం ద్వారా సహకార పద్ధతిలో కలిసి పనిచేయాలని పిలుపునిస్తున్నాయని శ్రీ గోయల్ అన్నారు.

పేదరికం, వాతావరణ మార్పులు, అసమానతలు మొదలైన సవాళ్లను పరిష్కరించడానికి ఇది సహాయపడుతుందని మంత్రి అన్నారు.

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలన్న భారత ఆకాంక్షను శ్రీ పీయూష్ గోయల్ ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ ప్రతిష్టాత్మక లక్ష్యం బలమైన భారత్-ఎల్ఎసి  భాగస్వామ్యాలకు అనేక మార్గాలను తెరుస్తుందని, ఇది సానుకూల ప్రపంచ ప్రభావానికి ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. విశ్వసనీయ భాగస్వాములుగా కలిసి పనిచేయడానికి , భాగస్వామ్య ప్రయోజనాలను విస్తరించడానికి భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో చేరాలని ఎల్ఏసీ దేశాలను మంత్రి ఆహ్వానించారు.

 

భవిష్యత్ తరాలకు ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడానికి భారతదేశం , ఎల్ ఏసీ ప్రాంతం కలిసి పనిచేయాలని శ్రీ గోయల్ అన్నారు. భారత్, ఎల్ఏసీ ప్రాంతం మధ్య వాణిజ్య వృద్ధికి నమ్మకమైన వాతావరణాన్ని పెంపొందించడానికి కృషి చేయాలని మంత్రి అన్నారు. జనాభా డివిడెండ్ తో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ కనెక్టివిటీ, బలమైన స్థూల ఆర్థిక మౌలికాంశాలు మొదలైనవి ఆర్థిక వృద్ధికి భారత్ ను ప్రముఖ భాగస్వామిగా చూపిస్తాయని మంత్రి తెలిపారు.

 

ఈ సెషన్ లో ఎల్ ఎ సి  ప్రాంతానికి చెందిన పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. వారిలో - వెనిజులాలోని పాపులర్ పవర్ ఆఫ్ ఎకానమీ అండ్ ఫైనాన్స్ అండ్ ఫారిన్ ట్రేడ్ మంత్రిత్వ శాఖకు చెందిన విదేశీ వాణిజ్యం, పెట్టుబడుల ప్రోత్సాహక ఉప మంత్రి  జోహన్ అల్వారెజ్; రిపబ్లిక్ ఆఫ్ క్యూబాలోని సియెన్ ఫ్యూగోస్ ప్రావిన్స్ పీపుల్స్ పవర్ గవర్నర్ శ్రీ అలెగ్జాండర్ కరోనా క్వింటెరో; మెక్సికో ప్రభుత్వ నువో లియోన్ రాష్ట్ర గవర్నర్ శామ్యూల్ అలెజాండ్రో గార్సియా సెపుల్వేడా; రిపబ్లిక్ ఆఫ్ హోండురాస్ ప్రెసిడెన్సీ కార్యాలయంలో సెక్రటరీ ఆఫ్ స్టేట్  రోడోల్ఫో పాస్టర్ డి మారియా వై కాంపోస్; ఆంటిగ్వా అండ్ బార్బుడా పర్యాటకం, పౌర విమానయానం, రవాణా , పెట్టుబడి మంత్రి హెన్రీ చార్లెస్ ఫెర్నాండెజ్; ప్లూరినేషనల్ స్టేట్ ఆఫ్ బొలీవియా అభివృద్ధి ప్రణాళికా మంత్రి సెర్గియో అర్మాండో కుసికాంకి లోయిజా; గ్రెనడా ప్రభుత్వ మొబిలైజేషన్, ఇంప్లిమెంటేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ మంత్రి ఆండీ జోసెఫ్ విలియమ్స్ ఉన్నారు.

 

మొత్తం మీద భారతదేశం - ఎల్ఎసి ప్రాంతం సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవడం, ఒకరి బలాలను మరొకరు ఉపయోగించుకోవడం , ప్రపంచ సంక్షేమం , పురోగతికి సమిష్టిగా దోహదం చేయడం తో కూడిన భాగస్వామ్య దార్శనికతను ఈ సెషన్ ఆవిష్కరించింది.

'భాగస్వామ్య, సుస్థిర వృద్ధి కోసం ఆర్థిక భాగస్వామ్యాలను పెంపొందించడం' అనే ప్రధాన ఇతివృత్తంతో 12 విభిన్న రంగాల్లో '9వ సీఐఐ ఇండియా-ఎల్ఏసీ కాన్ క్లేవ్‘  లో చర్చలు జరిగాయి. ఈ ఇతివృత్తం పరస్పర శ్రేయస్సు కోసం బలమైన , శాశ్వత ఆర్థిక సంబంధాలను పెంపొందించే సమిష్టి లక్ష్యాన్ని నొక్కి చెబుతుంది.

 

వాణిజ్య శాఖ వాణిజ్య, పెట్టుబడుల ఔట్ రీచ్ వ్యూహంలో భాగంగా ఇన్వెస్ట్ ఇండియా, ఇ ఇ పి సి, ఫార్మెక్సిల్, కెమెక్సిల్,ఇఎస్సి , ఎ సి ఎం , ఎస్ ఐ ఎ ఎం వంటి ఎగుమతి ప్రోత్సాహక మండలుల సహకారంతో సీఐఐ ఇండియా-ఎల్ ఎ సి సదస్సును నిర్వహించారు. సదస్సు సందర్భంగా వాణిజ్య శాఖ లాటిన్ అమెరికా, కరీబియన్ దేశాలతో ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించింది.

 

***



(Release ID: 1945958) Visitor Counter : 57