ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఢిల్లీలోని జాతీయ ఆరోగ్య కుటుంబ సంక్షేమ సంస్థ(NIHFW)లో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (AIIMS) కేంద్ర సంస్థ సముదాయం (సెంట్రల్ ఇనిస్టిట్యూట్ బాడీ -- సి ఐ బి) 7వ సమావేశం, చింతన్ శివిర్ జరిగింది. సమావేశానికి కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మాన్సుఖ్ మాండవీయ అధ్యక్షత వహించారు


AIIMS వంటి ఉత్తమ ఆరోగ్య సంస్థలలో అమలు/వినియోగం కోసం మెరుగైన పద్ధతులను అభివృద్ధి చేయడంలో చింతన్ శివిర్ సహాయపడుతుంది. ఉన్నత అధికారులు మరియు నిపుణులతో చర్చలు జరపడానికి ఒక వేదికను సమకూరుస్తుంది:డాక్టర్ మాండవీయ

"దేశప్రజలలో అన్ని ఆదాయవర్గాలకు లభ్యమయ్యే ధరల్లో మరియు అందుబాటులో ఉండే రీతిలో ఆరోగ్య సౌకర్యాలను సమకూర్చడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం కట్టుబడి ఉంది"

" చికిత్స చేయడం అనేది వైద్యునికి విజయంలో ఒక అంశం మాత్రమే. వారినుంచి ప్రజలు ఏం గ్రహిస్తారు, సమాజంలో వారి పాత్ర ఏమిటి అనేదే విజయం అంతిమ విలువ"

తదుపరి తరానికి వృద్ధి మరియు విజయాల వారసత్వాన్ని అందించవలసిందిగా అన్ని AIIMSల ప్రతినిధులను ప్రోత్సహించారు

Posted On: 29 JUL 2023 8:57PM by PIB Hyderabad

       కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా శనివారం జాతీయ ఆరోగ్య కుటుంబ సంక్షేమ సంస్థలో
AIIMS సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ బాడీ (CIB) 7వ సమావేశంలో, చింతన్ శివిర్ లో ప్రసంగించారు.  ఈ సమావేశంలో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రులు డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్,  ప్రొఫెసర్ ఎస్. పి.  సింగ్ బాఘేల్, పార్లమెంటు సభ్యులు శ్రీ మనోజ్ తివారీ, శ్రీ రమేష్ బిధూరి మరియు నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వి. కె. పాల్ కూడా  పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్, ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ కోటేచా, ఆరోగ్య సేవల  డైరెక్టర్ జనరల్ డాక్టర్ అతుల్ గోయెల్ , ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ  ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ  శ్రీ సుధాంశ్ పంత్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థకు చెందిన అన్ని ఆసుపత్రుల  ఆర్థిక, మౌలిక సదుపాయాలు, ఖాళీలు, నియామకాలు, విధానాల అమలు, సవాళ్లు , సేకరణ వ్యవహారాలు చూసే అత్యున్నత నిర్ణయాధికార సంస్థ CIB. మునుపటి CIB సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలు ఏ మేరకు అమలయ్యాయో  సమీక్షించడమే శనివారం నాటి  CIB సమావేశం ఎజెండా.

           సమావేశంలో మాట్లాడుతూ డాక్టర్ మాండవీయ AIIMS వంటి ఉత్తమ  ఆరోగ్య సంస్థలలో అమలు/వినియోగం కోసం మెరుగైన పద్ధతులను అభివృద్ధి చేయడంలో చింతన్ శివిర్  సహాయపడుతుందని ఉన్నత అధికారులు మరియు నిపుణులతో చర్చలు జరపడానికి ఒక వేదికను సమకూరుస్తుందని అన్నారు.  దేశప్రజలలో  అన్ని ఆదాయవర్గాలకు లభ్యమయ్యే ధరల్లో మరియు అందుబాటులో ఉండే  రీతిలో ఆరోగ్య సౌకర్యాలను సమకూర్చడానికి  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని  ప్రభుత్వం  కట్టుబడి ఉందని చెప్తూ,  ఈ చింతన్ శివిర్ ద్వారా AIIMSలో సౌకర్యాలను మరింత విస్తరించగలమని,  మరింత గట్టిగా  ఏర్పాట్లు  చేయగలమనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.  

           ఆరవ CIB సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుకు చర్యలు తీసుకున్నందుకు ఆయన అభినందించారు.  చికిత్స చేయడం అనేది ఎవరైనా ఒక  వైద్యునికి విజయంలో ఒక అంశం మాత్రమేనని,  వారినుంచి ప్రజలు ఏం గ్రహిస్తారు, సమాజంలో వారి పాత్ర ఏమిటి అనేదే విజయం అంతిమ విలువ అని మంత్రి అభిప్రాయపడ్డారు.  దేశ ప్రజలు AIIMSను వైద్య విజ్ఞానంలో దేశంలోనే అగ్రగామి సంస్థగా పరిగణిస్తారని,  ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలని సమావేశానికి హాజరైన ఉన్నతాధికారులకు మంత్రి విజ్ఞప్తి చేశారు.  తదుపరి తరానికి వృద్ధి మరియు విజయాల వారసత్వాన్ని అందించవలసిందిగా అన్ని AIIMSల  ప్రతినిధులను ఆయన కోరారు.

       ప్రొఫెసర్ ఎస్. పి.  సింగ్ బాఘేల్  మాట్లాడుతూ దేశ ప్రయోజనం కోసం సమష్టి కృషి జరపాలని డెలిగేట్లను  ప్రధానంగా AIIMS ప్రతినిధులను కోరారు.
        డాక్టర్ వి.కె.పాల్ మాట్లాడుతూ AIIMS లో వైద్య విద్యార్థుల సంక్షేమానికి ప్రాముఖ్యం ఇవ్వాలని అన్నారు.   రోగులకు, వారి కుటుంబాలకు సలహాలు, సూచనల ప్రాధాన్యత గురించి ఆయన ప్రత్యేకంగా చెప్పారు.    శ్రీ రమేశ్ బిధూరి, శ్రీ మనోజ్ తివారి తదితరులు ప్రసంగించారు.  

           ఈ మేధోమథన సమ్మేళనానికి తమను ఆహ్వానించినందుకు మరియు AIIMS ప్రమాణాలను మెరుగుపరచడానికి తమ ఆంతరంగిక భావనలు, ఆలోచనలు, సూచనలు  పంచుకునే అవకాశాన్ని కల్పించినందుకు సమావేశానికి హాజరైన ప్రతినిధులు కేంద్ర ఆరోగ్య మంత్రికి  కృతజ్ఞతలు తెలియజేశారు. కొత్త AIIMS పనితీరుపై వివరణాత్మక చర్చలు జరిగాయి.  మునుపటి మునుపటి చింతన్ శివిర్ సిఫార్సులను అనుసరించడం, దాని అనంతర పరిణామాలపై చర్చ జరిగింది.  AIIMSని ప్రపంచ శ్రేణి సంస్థగా అభివృద్ధి చేసేందుకు మార్గనిర్దేశం చేయడం,  బోధనా సిబ్బంది ఎంపికకు స్టాండింగ్ సెలక్షన్ కమిటీ ఏర్పాటు చేయాలనే, ఆయుష్‌ కోసం  కొత్త AIIMSలో ప్రత్యేక అకడమిక్ డిపార్ట్‌మెంట్‌ సృష్టించడం మరియు ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షా యోజన (PMSSY) కింద ఏర్పాటు చేసే అన్ని కొత్త AIIMS లలో అందరికీ ఒకే విధమైన అలవెన్సులు ఇవ్వాలనే సంస్కరణలను ప్రతినిధులు సూచించడం జరిగింది.  

       ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు  సమ్మేళనానికి హాజరయ్యారు.  

***


(Release ID: 1944492) Visitor Counter : 108


Read this release in: English , Urdu , Hindi , Marathi