ఆర్థిక మంత్రిత్వ శాఖ

రాజస్థాన్‌లో పట్టణ సేవల విస్తరణ కోసం $200 మిలియన్ల రుణంపై సంతకం చేసిన భారత్-ఏడీబీ

Posted On: 28 JUL 2023 2:37PM by PIB Hyderabad

'రాజస్థాన్ సెకండరీ టౌన్స్ డెవలప్‌మెంట్ సెక్టార్ ప్రాజెక్టు' కోసం భారత ప్రభుత్వం అదనపు రుణం తీసుకుంది. ఈ ప్రాజెక్టు కోసం 200 మిలియన్‌ డాలర్ల రుణ ఒప్పందంపై భారత ప్రభుత్వం, ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) ఈరోజు సంతకం చేశాయి. నీటి సరఫరా & పారిశుద్ధ్యం వ్యవస్థలను విస్తరించడానికి, ఎంచుకున్న పట్టణాల్లో జీవనశైలి, వారసత్వ జీవనాన్ని మెరుగుపరచడానికి ఈ ప్రాజెక్టు చేపట్టారు.

భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి ఉమ్లున్‌మాంగ్ ఉల్నామ్, ఏడీబీ ఇండియా రెసిడెంట్ మిషన్ కంట్రీ డైరెక్టర్ టేకో కొనిషి ఈ ఒప్పందంపై సంతకం చేశారు.

ఎంపిక చేసిన పట్టణ స్థానిక సంస్థల్లో నీటి సరఫరా & పారిశుద్ధ్యం సేవలను విస్తరించడానికి, ద్వితీయ స్థాయి పట్టణాల్లో ప్రాథమిక మౌలిక సదుపాయాల్లో అంతరాలను తగ్గించడానికి ఈ అదనపు రుణం రాజస్థాన్ ప్రభుత్వానికి అండగా నిలుస్తుందని ఉమ్లున్‌మాంగ్ ఉల్నామ్ చెప్పారు.

2020 సెప్టెంబర్‌లో ఆమోదించిన ఈ ప్రాజెక్టులో భాగంగా, రాజస్థాన్‌లోని ఎంపిక చేసిన ద్వితీయ స్థాయి పట్టణాల్లో ఇప్పటి వరకు 1,451 కిలోమీటర్ల నీటి సరఫరా పైపులు, 1,110 కిలోమీటర్ల మురుగు నీటి పైపులు, 68,098 గృహాలకు జల సౌకర్యాలను అనుసంధానించారు.

అదనపు రుణంతో కనీసం ఏడు పట్టణాల్లో నీటి సరఫరా వ్యవస్థలను మెరుగుపరచడం, అన్ని భూగర్భ జల వనరులను ఉపరితల జల వనరులకు మార్చడం, దాదాపు 700 కిలోమీటర్ల లీకేజీ నీటి పైపుల స్థానంలో కొత్తవి వేయడం, 1,400 కిలోమీటర్ల కొత్త నీటి సరఫరా పైప్‌లైన్లను ఏర్పాటు చేయడం, 77,000 గృహాలకు నీటి మీటర్ల కనెక్షన్లు అందించడం చేస్తారు. మూడు కొత్త నీటి శుద్ధి కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తారు.

కనీసం 580 కిలోమీటర్ల మురుగు కాలువలను బాగు చేయడం, మల పూడికను శుద్ధి చేయడానికి ఉప-శుద్ధి కేంద్రాలు సహా ఏడు మురుగు నీటి శుద్ధి కేంద్రాలను నిర్మించడం, కనీసం 54,000 ఇళ్లను మురుగు నీటి సరఫరా వ్యవస్థకు అనుసంధానించడం ద్వారా కనీసం ఎనిమిది పట్టణాల్లో పారిశుద్ధ్య వ్యవస్థలకు రుణ నిధులు కేటాయిస్తారు.

కనీసం ఎనిమిది వారసత్వ పట్టణాలు లేదా బలమైన పర్యాటక అవకాశాలు గల పట్టణాల్లో జీవనశైలి మెరుగుదల, వారసత్వ-సున్నితమైన పట్టణ అభివృద్ధి కోసం నీటి సౌకర్యం అభివృద్ధి చేయడం ఏడీబీ రుణ మద్దతులో ఉన్న కొత్త విషయం. ఈ నిధులతో, జీవించగల వాతావరణాన్ని మెరుగుపరచడం, ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించేలా కనీసం 20 వారసత్వ లేదా వారసత్వ తరహా నిర్మాణాలను పునరుద్ధరిస్తారు.

రాజస్థాన్ తయారీ పరిశ్రమలో నీటి భద్రత కల్పించడానికి, ప్రైవేట్ రంగ పెట్టుబడులు, రుణాలను ప్రోత్సహించడానికి పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా ప్రత్యేక సంస్థను ఏడీబీ అదనపు రుణం ద్వారా ఏర్పాటు చేస్తారు. పారిశ్రామిక అవసరాల కోసం, శుద్ధి చేసిన నీటిని మురుగునీటి శుద్ధి కేంద్రాల నుంచి తీసుకువెళ్లడానికి ప్రత్యేక పైపులైన్లను ఈ నిధులతో ఏర్పాటు చేస్తారు.

 

****



(Release ID: 1943770) Visitor Counter : 129


Read this release in: English , Urdu , Hindi , Tamil