జల శక్తి మంత్రిత్వ శాఖ

రూరల్ వాష్ పార్టనర్స్ ఫోరమ్ జాతీయ సదస్సును ప్రారంభించిన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్


దార్శనికతతో కూడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో 12.6 కోట్లకు పైగా కుళాయి కనెక్షన్లు, 64% పైగా ఒడిఎఫ్ రహిత గ్రామాలు మేం సాధించాం : శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్

‘‘స్వచ్ఛతా క్రానికల్స్ – భారతదేశ పరివర్తత గాథలు : 75 పైగా ఒడిఎఫ్ ఉత్తమ విధానాల కాంపోడియం’’ పేరిట రూపొందించిన వైపరీత్య నిర్వహణ ప్రణాళిక మాన్యువల్ ను విడుదల చేసిన కేంద్ర మంత్రి

Posted On: 21 JUL 2023 4:56PM by PIB Hyderabad

కేంద్ర జలశక్తి శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్  షెఖావత్ న్యూఢిల్లీలోని విజ్ఞాన్  భవన్  లో ఆర్ డబ్ల్యుపిఎఫ్  తొలి వార్షికోత్సవం సందర్భంగా రూరల్  వాష్  పార్టనర్స్  ఫోరమ్ (ఆర్ డబ్ల్యుపిఎఫ్) రెండు రోజుల సదస్సును ప్రారంభించారు. గ్రామీణ వాష్  విభాగంలో పని చేస్తున్న డెవలప్  మెంట్/సెక్టర్  భాగస్వాముల కోసం కెపిఎంజి సహకారంతో మంచినీరు, పారిశుధ్య శాఖ (డిడిడబ్ల్యుఎస్) ‘‘స్వచ్ఛ సుజల్ భారత్ దిశగా వేగవంతమైన పురోగతి’’ థీమ్  తో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. డిడిడబ్ల్యుఎస్, జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్వహణలోని ప్రధాన కార్యక్రమాలు జల్  జీవన్  మిషన్ (జెజెఎం), స్వచ్ఛ భారత్  మిషన్ - గ్రామీణ్ (ఎస్  బిఎం-జి) వేగవంతమైన అమలుకు చర్యలు తీసుకోవడం దీని లక్ష్యం. మెరుగైన సహకారం, బలాలతో అభ్యాసం, జ్ఞాన భాగస్వామ్యం;  తేలిగ్గా అందించగల, పొదుపైన పరిష్కారాలు సాధించడం; ఉత్తమ విధానాలు, విజయ గాథలు పంచుకోవడం కోసం  రూరల్ వాష్ విభాగంలో పని చేస్తున్న వారందరినీ ఈ ఫోరం ఒక ఛత్రం కిందకు తీసుకువస్తుంది.

‘‘ప్రజల జీవితాలు మెరుగుపరచడం కోసం ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ప్రధానమంత్రి స్వయంగా చీపురు పట్టుకుని వీధులు శుభ్రం చేస్తారని గాని;  దృఢ సంకల్పం, దీక్షతో మరుగుదొడ్లు నిర్మిస్తారని గాని ఏ ఒక్కరూ కలగని ఉండరు. అన్ని రకాల అవరోధాలు ఛేదించి మేం లక్ష్యం సాధించాం. 2019 అక్టోబరు 2వ తేదీన భారత్ బహిరంగా మల విసర్జన రహిత దేశంగా మారింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజనరీ మార్గదర్శకంలో మేం 12.6 కోట్లకు పైబడిన పంపుల ద్వారా మంచినీటి కనెక్షన్లు సాధించాం. 64% పైబడిన ఒడిఎఫ్ ప్లస్ గ్రామాలు ఏర్పాటు చేశాం. సమాజంలో చివరి వ్యక్తికి కూడా అనుసంధానత సాధించాలంటే ఆర్ డబ్ల్యుపిఎఫ్ పాత్ర అత్యంత కీలకం’’ అని ప్రతినిధులనుద్దేశించి మాట్లాడుతూ కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్  షెఖావత్ అన్నారు.

కేంద్ర జలశక్తి, ఫుడ్  ప్రాసెసింగ్ శాఖ సహాయమంత్రి శ్రీ ప్రహ్లాద్  సింగ్ పటేల్ మాట్లాడుతూ గ్రామీణ ఇళ్లకు పంపుల ద్వారా నీటి కనెక్షన్లు అందించే లక్ష్యం సాధించడంలో ప్రభుత్వం, అభివృద్ధి భాగస్వాములు, పౌర సమాజం, కమ్యూనిటీ సహకార భాగస్వామ్యం గురించి తెలిపారు. ‘‘ఏడు చిన్న కలశాల నుంచి  ఒక పెద్ద కలశంలో నీరు పోయడం ‘ఏ ఒక్కరినీ విడిచిపెట్టకుండా’ గ్రామీణ ఇళ్లన్నింటికీ నాణ్యమైన మంచినీటిని చేర్చాలన్న లక్ష్యానికి చిహ్నం. వాష్ సెక్టర్  సాంకేతిక మద్దతు, పరిజ్ఞాన భాగస్వామ్యం, సహకారంతో స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్-రెండో దశ), జల్  జీవన్ మిషన్    అమలులో డిడిడబ్ల్యుఎస్  చేస్తున్న కృషికి ఈ ఫోరమ్  బలం చేకూరుస్తుంది’’ అని మంత్రి అన్నారు.

‘‘ఈ రెండు కార్యక్రమాల్లోనూ అభివృద్ధి, సెక్టార్  భాగస్వాముల మద్దతు సాధించడం విశేషమైన విషయం. కెపిఎంజి ఇండియా ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తుంది. ఇప్పటివరకు సాగిన ప్రయాణం అత్యంత ఉత్సుకత రేపేదిగా ఉంది. మేం 64% ఇళ్లకు టాప్  నీటి కనెక్షన్లు అందించడం, 64% గ్రామాలను ఒడిఎఫ్  ప్లస్  గ్రామాలుగా మార్చడంలో విజయం సాధించాం. ఏ రాష్ర్టం కూడా మూడింట ఒక వంతు కన్నా తక్కువ కవరేజి సాధించలేదు. దీర్ఘకాలిక స్థిరత్వ సాధనకు మౌలిక వసతులు కల్పించే బాధ్యత సమాజంపై ఉంది. ఇందుకు  సంబంధించిన సొల్యూషన్లు స్థానికంగా, సరసమైన ధరలకు, తేలికైన నిర్వహణా విధానంతో అందుబాటులో ఉండాలి’’ అని డిడిడబ్ల్యుఎప్  కార్యదర్శి శ్రీమతి వాణీ మహాజన్  అన్నారు.

ఆర్ డబ్ల్యుపిఎఫ్ భాగస్వాముల చురుకైన భాగస్వామ్యంతో ఏడాది కాలం  పాటు జరిగే కార్యకలాపాల గురించి, తమ శాఖలో వారి పాత్ర గురించి జల్  జీవన్  మిషన్  అదనపు కార్యదర్శి, మిషన్  డైరెక్టర్ శ్రీ వికాస్ షీల్  మాట్లాడారు. ‘‘స్వచ్ఛ సుజల్  భారత్  దిశగా వేగవంతమైన పురోగతి సాధించేందుకు దీటుగా వేదికను అభివృద్ధి చేయడంలో రూరల్  వాష్  పార్టనర్స్  ఫోరమ్ (ఆర్ డబ్ల్యుపిఎఫ్) కీలక భాగస్వామిగా ఉంటుంది. పరస్పర అంగీకారంతో ఈ కార్యక్రమం అభివృద్ధి కోసం 12 థీమాలిక్ విభాగాలను గుర్తించారు. డిడిడబ్ల్యుఎస్  లో ఆర్ డబ్ల్యుపిఎఫ్ సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యకలాపాలన్నింటినీ ముందుకు నడిపేందుకు కెపిఎంజి సమన్వయ వేదికగా ఉంటుంది. వాష్  మేథావుల వేదికగా ఆర్ డబ్ల్యుపిఎఫ్  వ్యవహరిస్తుంది. రాష్ర్టాలు, అభివృద్ధి భాగస్వాముల ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకునేందుకు వీలు కల్పిస్తుంది’’ అని ఆయన తెలిపారు.

కెపిఎంజి జి అండ్ పిఎస్ అధిపతి శ్రీ నీలాచల్  మిశ్రా ఈ సమావేశంలో మాట్లాడుతూ రూరల్  వాష్  పార్టనర్స్  ఫోరమ్ గురించి, అభివృద్ధి/సెక్టార్  భాగస్వాముల భారీ పూల్  గురించి వివరించారు. దీర్ఘకాలిక సుస్థిరత కోసం శిక్షణ, సామర్థ్యాల నిర్మాణంలో రాష్ర్టాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అందించే మద్దతు గురించి కూడా వివరించారు. ‘‘ఈ భాగస్వామ్యం గత ఏడాది కాలంగా ఎన్నో కార్యకలాపాలు నిర్వహించింది. జెజెఎం డిజిటల్  అకాడమీ, ఆర్  డబ్ల్యుపిఎఫ్ ఇయర్  బుక్ కూడా విడుదల చేసింది. గ్రామీణ వాష్  సెక్టార్  పై అర్ధవంతమైన ప్రభావం సాధనకు కలిసికట్టుగా కృషి చేయడం కోసం మేం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం’’ అన్నారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ దిగువ కార్యకలాపాలు జరిగాయి.

[1]   డిజిటల్  వాష్  అకాడమీ సరఫరా వ్యవస్థలోని అడ్మినిస్ర్టేటర్లు, ఇంజనీర్లు, పంచాయతీ అధికారులు, టెక్నీషియన్లు, పారిశుధ్య కార్మికులు, ఫుట్ సోల్జర్ల సామర్థ్యాలను నిర్మిస్తుంది. అకాడమీ వారికి అవసరమైన ప‌రిజ్ఞానాన్ని, నైపుణ్యాలను అందిస్తూ మిషన్  లక్ష్యాల సాధనకు సమర్థవంతంగా కృషి చేస్తుంది. అకాడమీ స్థాపనకు అవసరమైన మద్దతు అందించిన లాభాపేక్ష లేని సంస్థ ఎకో ఇండియా.    

[2] ఆర్ డబ్ల్యుపిఎఫ్  యాన్యువల్ ఇయర్  బుక్, వెబ్  పేజి : అభివృద్ధి భాగస్వాములు భిన్న ప్రాంతాల్లో, విభిన్న థీమ్  లతో నిర్వహించిన పనులను ఇయర్  బుక్  లో వివరించడంతో పాటు, వెబ్  పేజీలో ఆ పనుల చిత్రాలను ప్రదర్శిస్తారు. విభిన్న సంస్థలు క్షేత్ర స్థాయిలో చేసిన పనులకు గుర్తింపు లభించడం వల్ల భాగస్వాములు మరింత మెరుగ్గా పని చేయడానికి, నిర్దేశిత లక్ష్యాలను ప్రభుత్వం సాధించడానికి వీలు కలుగుతుంది.

[3] స్వచ్ఛతా క్రానికల్స్ -  భారతదేశానికి చెందిన పరివర్తిత గాథలు :  75 అత్యుత్తమ ఒడిఎఫ్  ప్లస్ ఉత్తమ విధానాల కాంపోడియం ఈ రంగంలో ఇన్నోవేషన్లను ప్రదర్శించడంతో పాటు ఎస్  బిఎం-జి రెండో దశ లక్ష్యాల సాధనలో  అవరోధాలు అధిగమించడానికి, చైతన్యం పెంచడానికి  తీసుకున్న చర్యలు; రాష్ర్టాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ప్రారంభించిన ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు ఇందులో ఉంటాయి.

[4] స్వచ్ఛ సర్వేక్షణ్  గ్రామీణ్ (ఎస్ఎస్ జి) 2023 కింద ఫీల్డ్  అసెస్  మెంట్  ఫ్రేమ్  వర్క్, ర్యాంకింగ్ ప్రోటోకాల్ :  ఎస్ఎస్  జి 2023 కింద నిర్వహించిన కార్యకలాపాలకు రాష్ర్టాలు,  కేంద్రపాలిత ప్రాంతాలకు ర్యాంకింగ్  లు ఇస్తారు.

[5] మాన్యువల్  డిజాస్టర్  మేనేజ్  మెంట్ ప్రణాళిక (డిఎంపి) భద్రతకు హామీ ఇవ్వడంతో పాటు డిడిడబ్ల్యుఎస్  కింద అమలు జరుగుతున్న జల్  జీవన్  మిషన్ (జెజెఎం), స్వచ్ఛ భారత్ మిషన్ -  గ్రామీణ్ (ఎస్ బిఎం-జి) కింద వాష్  ఆస్తులు, సేవల్లో నష్టం తగ్గించడానికి దోహదపడుతుంది.

[6] నాలుగు స్టార్టప్ లకు సన్మానం : డిడిడబ్ల్యుఎస్ మద్దతుతో ఇన్వెస్ట్  ఇండియా నిర్వహించిన టెక్నాలజీ చాలెంజ్  కార్యక్రమంలో పొదుపుతో కూడిన, జలనాణ్యతను పరీక్షించే కిట్లు రూపొందించినందుకు నాలుగు స్టార్టప్  లను జలశక్తి శాఖ మంత్రి సన్మానించారు. ఎలికో, క్లూయిక్స్, హ్యురిస్టిక్స్  నీటి ఆధారిత డాష్  బోర్డుతో అనుసంధానం చేయదగిన  డిజిటల్  పోర్టబుల్  మల్టీ పారామీటర్ నీటి నాణ్యతా టెస్టింగ్ డివైస్  లను రూపొందించాయి. దాని ద్వారా రూపొందించే నివేదికలు కార్యక్రమం  పర్యవేక్షణకు ఉపయోగపడతాయి. ఎర్త్  ఫేసెస్  రూపొందించిన ఎన్ఏబిఎల్ గుర్తింపు పొందిన మరో డివైస్  నీటి విశ్లేషణ, స్వచ్ఛతకు ఉపయోగపడుతుంది.

రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన మిషన్ డైరెక్టర్లు, సీనియర్ అధికారులు; జెజెఎం, ఎస్ బిఎం-జి ఇన్ చార్జి కార్యదర్శులు, కేంద్రప్రభుత్వ మంత్రిత్వ శాఖల ప్రతినిధులు, వాష్ రంగంలో పని చేస్తున్న కార్పొరేట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్ డబ్ల్యుపిఎఫ్  వివరాలను  www.rwpf.in  వెబ్  సైట్  లో చూడవచ్చు.

ఈ కార్యక్రమం తర్వాత నీరు,  పారిశుధ్యంపై థీమాటిక్ సెషన్లు జరిగాయి. అవి

a)     కమ్యూనిటీ ఔట్  రీచ్, ఎంగేజ్ మెంట్  - మౌలిక వసతుల నుంచి కమ్యూనిటీ యాజమాన్య నిర్మాణం వరకు జన్ ఆందోళన్

b)     జెజెఎం, ఫిర్యాదుల పరిష్కార విభాగాల సమర్థవంతమైన, ప్రభావవంతమైన  నిర్వహణ

c)     భద్రతతో కూడిన పారిశుధ్యం

d)     ప్లాస్టిక్ వ్యర్థాల విభాగంలో  సర్కులర్  ఎకానమీ

 

యునిసెఫ్, ఆగాఖాన్  ఫౌండేషన్, అఖిల భారత స్వయం పాలనా సంస్థ (ఎఐఐఎల్ఎస్ జి), వాటర్  ఎయిడ్, వాష్  ఇన్  స్టిట్యూట్, సెంటర్ ఫర్ ఎన్విరాన్ మెంట్ ఎడ్యుకేషన్ (సిఇఇ) ఈ సెషన్లను నిర్వహించాయి.

 

***



(Release ID: 1943031) Visitor Counter : 73


Read this release in: English , Urdu , Hindi