హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మానవ అక్రమ రవాణా కేసులు

Posted On: 25 JUL 2023 4:57PM by PIB Hyderabad

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ  , క్రై మాక్ పేరుతో, నేరాలకు
 సంబంధించిన సమాచారాన్ని అందించే బహుళ ఏజెన్సీ వ్యవస్థను 2020  సంవత్సరంలో జాతీయస్థాయిలో ఏర్పాటు చేసింది.
కీలక నేరాలు, మానవ అక్రమ రవాణా కేసులకు సంబంధించిన సమాచారాన్ని క్రై –మాక్ దేశవ్యాప్తంగా  ఎప్పటికప్పుడు అందిస్తుంది.
దేశవ్యాప్తంగా గల పోలీసులను  అప్రమత్తం చేయడానికి ,  కీలకమైన నేరాల సమాచారం అందించడానికి , క్రై – మాక్ను ఏర్పాటు చేశారు.
క్రై –మాక్  ద్వారా  దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసు  అధికారుల మధ్య సమన్వయానికి క్రైమాక్ సమర్ధంగా ,సత్వర సమాచార సాధనంగా ఉపకరిస్తోంది.  ఏ నేరానికి సంబంధించిన సమాచారం అయినా సురక్షితంగా, కట్టుదిట్టమైనరీతిలో చేరవేయడానికి వీలు కల్పిస్తోంది.
దీనివల్ల బాధితులను గుర్తించడానికి, నేరాల నిరోధం, నేరాల గుర్తింపు, దర్యాప్తునకు కూడా ఇది ఉపయోగపడుతుంది.
జాతీయ నేర రికార్డుల బ్యూరో, వివిధ రాష్ట్రాలు,  కేంద్రపాలిత ప్రాంతాల నుంచి తనకు అందిన నేరాల సమాచారాన్ని క్రోడీకరించి ,దానిని ఇండియాలో నేరాలు పేరుతో వార్షిక నివేదికను వెలువరిస్తుంది.
తాజాగా ప్రచురణ అయిన నివేదిక 2021 నేర గణాంకాలకు సంబంధించినది .దీని ప్రకారం మానవ అక్రమ రవాణాకు  సంబంధించి 2021 లో మొత్తం 2,189 కేసులు నమోదు  కాగా, అందులో 1645 కేసులలో చార్జిషీటు దాఖలు చేశారు.

పోలీసుల, పబ్లిక్  ఆర్డర్ అనేవి రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూలు కింద రాష్ట్ర  జాబితాలోని అంశాలు. అందువల్ల, మానవ అక్రమ రవాణాను నిరోధించవలసిన  బాధ్యత ప్రధానంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు,  కేంద్రపాలిత ప్రాంతాలపై ఉంది.
అయినప్పటికీ, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రభుత్వాల చర్యలకు తోడుగా, మానవ అక్రమరవాణా తదితరాలను నిరోధించడం, ఇలాంటి సమస్యను  ఎదుర్కొనేందుకు ఎప్పటికప్పుడు
వివిధ అడ్వయిజరీల రూపంలో మార్గదర్శకాలు జారీ చేస్తుంటుంది. ఈ అడ్వయిజరీలు www.mha.gov.in. వెబ్సైట్ లో ఉంటాయి. 
మానవ అక్రమ రవాణా కేసులతో ప్రమేయం ఉన్నవ్యక్తులు, ముఠాలను గుర్తించేందుకు , వారికి సంబంధించిన సమాచారం, వారికిగల సంబంధాలు, వారు నేరాలకు పాల్పడే  తీరు వంటి వాటిపై సమాచారసేకరణకు,
నిఘాకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రాలు,  కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది.
అలాగే మానవ అక్రమ రవాణా  కేసులకు సంబంధించి అన్ని స్థాయిలలో తగిన చైతన్యం కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవలసిందిగా కూడా రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలను హోంమంత్రిత్వశాఖ కోరింది.
ఈ దిశగా కమ్యూనిటీ అవగాహనా కార్యక్రమాలు, స్థానిక పంచాయతీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి మానవ అక్రమ రవాణా ఘటనలు  జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.

దేశంలోని అన్ని జిల్లాలలో మానవ అక్రమరవాణా నిరోధానికి, మానవ అక్రమ రవాణా నిరోధ విభాగాలను ఏర్పాటుచేసేందుకు రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలకు హోంమంత్రిత్వశాఖ ఆర్థికసహాయం  కూడా అందించింది.
మానవ అక్రమరవాణా నిరోధానికి సంబంధించిన అంశాలపై  న్యాయ అధికారులు, పోలీసు అధికారులను చైతన్య పరిచేందుకు న్యాయ సదస్సులు,రాష్ట్రస్థాయి  సదస్సులనిర్వహణకు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా
హోం మంత్రి త్వశాఖ ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి శ్రీ అజయ్ కుమార్ మిశ్ర , ఒక లిఖితపూర్వక సమాధానంలో లోక్సభకు తెలిపారు.

***


(Release ID: 1942649)
Read this release in: English , Urdu , Tamil