వ్యవసాయ మంత్రిత్వ శాఖ
వరి గడ్డి నిర్వహణ
Posted On:
25 JUL 2023 5:07PM by PIB Hyderabad
పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, దిల్లీ ఎన్‌సీటీల్లో ఉత్పత్తయిన వరి గడ్డిని సమర్ధవంతంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం 'పంట వ్యర్థాల నిర్వహణ' పథకం మార్గదర్శకాలను సవరించింది. లబ్ధిదారు/అగ్రిగేటర్ (రైతులు, గ్రామీణ పారిశ్రామికవేత్తలు, రైతుల సహకార సంఘాలు, రైతు ఉత్పత్తిదార్ల సంస్థలు (FPOలు), పంచాయతీలు), వరి గడ్డిని వినియోగించే పరిశ్రమల మధ్య కుదిరే ఒప్పందం ప్రకారం వరి గడ్డి సరఫరా గొలుసు కోసం సాంకేతిక-వాణిజ్య నమూనా ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు నిబంధనలు రూపొందించడం జరిగింది. 1.50 కోట్ల రూపాయల వరకు ఖరీదు చేసే యంత్రాల వ్యయంపై 65% వరకు ఆర్థిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. ప్రాజెక్టు ప్రాథమిక ప్రమోటర్‌గా ఉన్న పరిశ్రమ ఆ ప్రాజెక్టు వ్యయంలో 25%, మిగిలిన 10% మొత్తాన్ని లబ్ధిదారు/అగ్రిగేటర్ భరించాలి. రాబోయే మూడేళ్లలో, ఈ కార్యక్రమం ద్వారా 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల మిగులు వరి గడ్డిని సేకరించాలని భావిస్తున్నారు. ప్రతి ప్రాజెక్టు సంవత్సరానికి 4500 టన్నుల వరి గడ్డిని సేకరించగదని భావిస్తే, 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల వరి గడ్డిని సేకరించేందుకు మొత్తం 333 ప్రాజెక్టులను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అంచనా. వరి గడ్డి నిర్వహణ కోసం చేసే పర్యావరణహిత ప్రయత్నాలకు ఈ చర్య మద్దతుగా ఉంటుంది, వరి గడ్డిని కాల్చడం వల్ల ఏర్పడే వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో సాయపడుతుంది. బయోమాస్ విద్యుత్ ఉత్పత్తి, జీవ ఇంధన రంగాల్లో తుది వినియోగదారు పరిశ్రమల కోసం వరి గడ్డి సరఫరా గొలుసును బలోపేతం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యం. తద్వారా, ఆ రంగాల్లో కొత్త పెట్టుబడులకు మార్గం ఏర్పడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను కూడా అది సృష్టిస్తుంది.
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఈ రోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారం అందించారు.
*****
(Release ID: 1942635)
Visitor Counter : 126