వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ఎగుమతి చేసేందుకు దిగుమతి చేసుకునే ముడి ఉత్పత్తులను సుంకం రహితంగా మార్చే 'ముందస్తు అనుమతి పథకం' అమలు చేస్తున్న డీజీఎఫ్‌టీ


ముందస్తు అనుమతి, నిబంధనల ఖరారు అంశాల్లో కీలక మెరుగుదల

Posted On: 17 JUL 2023 3:20PM by PIB Hyderabad

విదేశీ వాణిజ్య విధానం కింద, 'ముందస్తు అనుమతి పథకాన్ని' 'డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్' (డీజీఎఫ్‌టీ) అమలు చేస్తోంది. ఎగుమతి చేసేందుకు దిగుమతి చేసుకునే ముడి ఉత్పత్తులను ఈ పథకం సుంకం రహితంగా మారుస్తుంది.  ఇన్‌పుట్-ఔట్‌పుట్ నిబంధనల ప్రకారం, ముడి పదార్ధాల అర్హతను నిర్దిష్ట రంగ నిబంధనల కమిటీ నిర్ణయిస్తుంది.

విదేశీ వాణిజ్యాన్ని, నిబంధనలను మరింత సమర్థవంతంగా, సులభంగా మార్చడానికి గత సంవత్సరాల్లోని తాత్కాలిక ప్రమాణాలతో, వినియోగదారు-స్నేహపూర్వక, శోధించదగిన డేటాబేస్‌ను డీజీఎఫ్‌టీ రూపొందించింది. విదేశీ వాణిజ్య విధానం-2023 ప్రకారం, నిబంధనల కమిటీ సమీక్ష అవసరం లేకుండానే ఈ ప్రయోజనాలను ఏ ఎగుమతిదారైనా ఉపయోగించుకోవచ్చు. డీజీఎఫ్‌టీ వెబ్‌సైట్‌ (https://dgft.gov.in) ద్వారా డేటాబేస్ ఉపయోగించుకోవచ్చు. ఎగుమతి/దిగుమతి ఉత్పత్తి వివరణ, సాంకేతిక అంశాలు, భారతీయ పన్ను వర్గీకరణ ఐటీసీ (హెచ్‌ఎస్‌) నిబంధనలను ఈ వెబ్‌సైట్‌లో వినియోగదార్లు శోధించవచ్చు.

డేటాబేస్‌ను శోధించడానికి, ఎగుమతిదారు లేదా ప్రజలు డీజీఎఫ్‌టీ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అందులో, సర్వీసెస్‌ --> అడ్వాన్స్ ఆథరైజేషన్/డీఎఫ్‌ఐఏ --> అడ్-హాక్ నామ్స్‌లోకి వెళ్లాలి. ఉత్పత్తి వివరణ తాత్కాలిక ప్రమాణాలు, 'హ్యాండ్‌బుక్ ఆఫ్ ప్రొసీజర్స్‌'లో (హెచ్‌బీపీ) పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా ఉంటే, దరఖాస్తుదార్లు 'నో-నార్మ్ రిపీట్' కింద దరఖాస్తు చేసుకోవచ్చు. నిబంధనల కమిటీని మళ్లీ సంప్రదించాల్సిన అవసరం లేకుండా ముందస్తు అనుమతి పొందేందుకు ఈ ఎంపిక ఉపయోగపడుతుంది. దీంతోపాటు, పనిభారం తగ్గుతుంది, ప్రక్రియ వేగంగా జరుగుతుంది. ఎఫ్‌టీపీ/హెచ్‌బీపీలో పేర్కొన్న నిబంధనలకు లోబడి ఈ ప్రక్రియ సాగుతుంది.

ముందస్తు అనుమతిని, నిబంధనల ప్రక్రియను ఈ పథకం మరింత సులభతరం చేస్తుంది, ఫలితంగా, ఎగుమతిదార్లకు కాల జాప్యం ఉండదు, వ్యాపార సౌలభ్యం మెరుగుపడుతుంది, భారం తగ్గుతుంది.

***



(Release ID: 1940258) Visitor Counter : 183