కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించడం, కంపెనీల చట్టం-2013 ప్రకారం కాంపౌండ్ చేయదగిన నేరాలను నేరరహిత జాబితాలోకి చేర్చడం కోసం 'పెండింగ్ కేసుల పరిష్కార ప్రత్యేక కార్యక్రమం-II' కింద వివిధ న్యాయస్థానాల వద్ద పెండింగ్‌లో ఉన్న మరో 7,338 వ్యాజ్యాల ఉపసంహరణకు ఎంసీఏ ఆమోదం
కేంద్ర ప్రభుత్వం కక్షిదారుగా ఉన్న పెండింగ్ కేసుల్లో 21.86% తగ్గింపు
మోసం, డిపాజిట్ల స్వీకరణ, చెల్లింపు బకాయిలు వంటి కాంపౌండ్ చేయలేని నేరాల్లో వ్యాజ్యాలు కొనసాగింపు
2017లో 'ప్రత్యేక కార్యక్రమం-I'లో 14,247 కేసులు ఉపసంహరణ
Posted On:
14 JUL 2023 7:32PM by PIB Hyderabad
సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించడం, కంపెనీల చట్టం-2013 ప్రకారం కాంపౌండ్ చేయదగిన నేరాలను నేరరహిత జాబితాలోకి చేర్చడం కోసం, కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ) 'పెండింగ్ కేసుల పరిష్కార ప్రత్యేక కార్యక్రమం-II' చేపట్టింది. దీని కింద, వివిధ న్యాయస్థానాల వద్ద పెండింగ్‌లో ఉన్న మరో 7,338 కేసులను ఉపసంహరించుకోవడానికి ఆమోదం తెలిపింది.
ఈ నిర్ణయం ఫలితంగా, కేంద్ర ప్రభుత్వం కక్షిదారుగా ఉన్న మొత్తం పెండింగ్ కేసుల్లో 21.86% తగ్గుతాయి. 2017లో చేపట్టిన 'ప్రత్యేక కార్యక్రమం-I'లో 14,247 కేసులను కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకుంది.
పెండింగ్‌లో ఉన్న అన్ని కేసులను క్షుణ్ణంగా సమీక్షించేందుకు ఒక కమిటీని మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. దీర్ఘకాలంగా కొనసాగుతున్న కాంపౌండ్ చేయదగిన నేరాలకు సంబంధించిన వ్యాజ్యాలను ఈ కమిటీ గుర్తించింది. మోసం, డిపాజిట్ల స్వీకరణ, చెల్లింపు బకాయిలు వంటి కాంపౌండ్ చేయలేని కేసుల్లో వ్యాజ్యాల ఉపసంహణను పరిగణనలోకి తీసుకోలేదు, వాటిని కొనసాగిస్తారు. ఈ నిర్ణయం వల్ల న్యాయస్థానాలపై భారం తగ్గడమే కాకుండా, ఆరోగ్యకరమైన కార్పొరేట్ పరిపాలన విధివిధానాలను కొనసాగిస్తూ దేశంలో కార్పొరేట్ రంగ వృద్ధిని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.
కంపెనీల చట్టం-2013 ప్రకారం నేరాలుగా పరిగణించే చర్యలను నేరరహిత జాబితాలోకి చేర్చడానికి కంపెనీల (సవరణ) చట్టం-2020 ప్రకారం ప్రభుత్వం చేసిన సవరణకు అనుగుణంగా ఉన్న వ్యాజ్యాలను ప్రత్యేక కార్యక్రమం-II కింద కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం బలవంతంగా వ్యాజ్యంలో భాగం కాకూడదన్న సూత్రంలో భాగంగా ఈ ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టారు.
****
(Release ID: 1939742)
Visitor Counter : 191