శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ప్రపంచ స్థాయిలో భారతదేశం మరింత ఎదగడానికి చంద్రయాన్ ప్రయోగం సహకరిస్తుంది.. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
కోవిడ్ వ్యాక్సిన్ తయారీతో భారతదేశం సాధించిన విజయాన్ని చంద్రయాన్ మిషన్ మరింత ముందుకు తీసుకు
వెళ్తుంది డాక్టర్ జితేంద్ర సింగ్
చంద్రయాన్-3 భారతదేశ స్వదేశీ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడంతో పాటు ప్రపంచ స్థాయిలో దేశ స్థానాన్ని సుస్థిరం చేస్తుంది.. డాక్టర్ జితేంద్ర సింగ్
చంద్రయాన్-3 ప్రయోగానికి ఒక రోజు ముందుగా జరుగుతున్న ఇండో-యుకె సైన్స్ సదస్సు శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం సాధించిన అభివృద్ధికి నిదర్శనం.. డాక్టర్ జితేంద్ర సింగ్
శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం తో కలిసి పనిచేయడానికి అభివృద్ధి చెందిన దేశాలు ముందుకు వస్తున్నాయి.. డాక్టర్ జితేంద్ర సింగ్
భారతదేశంలో పరిశోధన ప్రతిభ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించిన ఇండియా అలయన్స్ వృత్తిలో రాణించడానికి, సామర్థ్యాన్నిపెంపొందించుకోవడానికి భారతీయ పరిశోధకులకు సహకారం అందించింది.. డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
13 JUL 2023 4:55PM by PIB Hyderabad
కోవిడ్ వ్యాక్సిన్ తయారీతో భారతదేశం సాధించిన విజయాలను చంద్రయాన్ మరింత ముందుకు తీసుకు వెళ్తుందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), పీఎంఓ లో సహాయ మంత్రి, అంతరిక్షం,అణుశక్తి సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, భూ శాస్త్ర శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. చంద్రయాన్ -3 ప్రపంచ స్థాయిలో భారతదేశం స్థానాన్ని మరింత సుస్థిరం చేస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. స్వదేశీ సామర్థ్యాలను వినియోగించి కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి చేసి విజయం సాధించిన భారతదేశం చంద్రయాన్-3 తో మరోసారి తన సామర్థ్యాలను నిరూపిస్తుందన్నారు.
హైదరాబాద్ లో ఈ రోజు జరిగిన 11వ ఇండియా అలయన్స్ వార్షిక సదస్సు 2023 లో డాక్టర్ జితేంద్ర సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ జితేంద్ర సింగ్ రేపు చంద్రయాన్-3 ప్రయోగం జరుగుతుందని తెలిపారు. ప్రయోగానికి ఒక రోజు ముందు జరుగుతున్న ఇండో-యుకె సైన్స్ కాన్‌క్లేవ్ శాస్త్ర సాంకేతిక రంగంలో భారతదేశం సాధించిన ప్రగతికి నిదర్శనం అన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం తో కలిసి పనిచేయడానికి అభివృద్ధి చెందిన దేశాలు ముందుకు వస్తున్నాయి అని చెప్పడానికి సదస్సు ఒక నిదర్శనం అని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

బయో మెడికల్ పరిశోధన రంగంలో భారత దేశంలో బలమైన, ప్రపంచ-స్థాయి మానవ వనరులను అభివృద్ధి చేయడానికి కేంద్ర బయోటెక్నాలజీ మంత్రిత్వ శాఖ, యూకేకు చెందిన వెల్‌కమ్ ట్రస్ట్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం మేరకు ఇండియా అలయన్స్ ఏర్పాటయింది.
గత 15 సంవత్సరాల కాలంలో భారతదేశ పరిశోధన రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు నిధులు సమకూర్చే అంశంలో ఇండియా అలయన్స్ కీలక పోషించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దేశంలో బయోమెడికల్, క్లినికల్ రీసెర్చ్ వ్యవస్థల్లో ఇండియా అలయన్స్ ప్రభావవంతమైన మార్పు తీసుకు వచ్చిందన్నారు. 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 2019లో ఇండియా అలయన్స్ టీమ్ సైన్స్ గ్రాంట్స్, క్లినికల్/పబ్లిక్ హెల్త్ రీసెర్చ్ సెంటర్‌లను ప్రారంభించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి వివిధ విభాగాలతో కలిసి పరిశోధనలు ప్రారంభించిందని ఆయన తెలియజేశారు.
భారత ప్రభుత్వం, వెల్‌కమ్ ట్రస్ట్ మధ్య కుదిరిన అవగాహనతో ఏర్పాటైన ఇండియా అలయన్స్ 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది అని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు నిధుల నిధుల సమీకరణకు ప్రాధాన్యత ఇచ్చిన ఇండియా అలయన్స్ వివిధ పథకాల ద్వారా నిధులు సమకూర్చి భారతదేశంలో పరిశోధన ప్రతిభను అభివృద్ధి చేసిందన్నారు. భారతీయ పరిశోధకులు వృత్తిలో రాణించి అభివృద్ధి సాధించడానికి అవసరమైన సానుకూల ప్రభావాన్ని ఇండియా అలయన్స్ అందించిందని ఆయన అన్నారు. సామర్థ్యం పెంపుదల, సాంకేతిక రంగాలపై ఇండియా అలయన్స్ ప్రభావం చూపిందన్నారు.
భారతదేశ పరిశోధన సంస్థల్లో పరిశోధన నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఇండియా అలయన్స్ పెట్టుబడి పెట్టిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. భారతదేశ పరిశోధన పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేసే అంశంలో నిర్వహణ సామర్థ్యం కీలకంగా ఉంటుందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. జాతీయ స్థాయిలో పనిచేస్తున్న ఇండియా అలయన్స్ కార్యక్రమాలతో 589 కి మించి ఎక్కువ మంది పరిశోధనా శాస్త్రవేత్తలు ప్రయోజనం పొందారు. భారతదేశంలోని 48 నగరాల్లోని 137 విభిన్న సంస్థలకు ఇండియా అలయన్స్ నిధులు సమకూర్చింది. జాతీయ అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించే అంశంపై ఇండియా అలయన్స్ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని ఆయన తెలిపారు.

ఇండియా అలయన్స్ అమలు చేస్తున్న కార్యక్రమాల వల్ల అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ వంటి దేశాల నుంచి భారతదేశానికి సహకారం అందిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. విదేశాల నుంచి అందిన సహకారంతో శాస్త్ర, పరిశోధన రంగాలు అంతర్జాతీయ ప్రమాణాల మేరకు అభివృద్ధి సాధించాయన్నారు.
యూరోపియన్ మాలిక్యులర్ బయాలజీ సంస్థతో కలిసి పనిచేస్తున్న ఇండియా అలయన్స్ ఇంతవరకు ప్రాధాన్యత లభించని రంగాల్లో పరిశోధనలు ప్రోత్సహించడానికి వివిధ సంస్థలతో కలిసి శాస్త్రీయ సైంటిఫిక్ సమావేశాలు నిర్వహించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. యూకే చెందిన క్యాన్సర్ రీసెర్చ్, ఆఫ్రికన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, స్విస్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ లాంటి అంతర్జాతీయ సంస్థల సహకారంతో ఇండియా అలయన్స్ పరిశోధన కార్యక్రమాలకు ప్రోత్సాహం అందిస్తోందని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు.
దేశంలో పరిశోధనలు చేపట్టేందుకు టీమ్ సైన్స్ గ్రాంట్స్, క్లినికల్ అండ్ పబ్లిక్ హెల్త్ రీసెర్చ్ సెంటర్ గ్రాంట్స్ ఆధ్వర్యంలో ఇండియా అలయన్స్ అంతర్జాతీయ స్థాయిలో, వివిధ సంస్థల మధ్య సమన్వయం సాధించి పరిశోధన కార్యక్రమాలకు ప్రోత్సాహం అందించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఇటీవల వచ్చిన మహమ్మారి పరిశోధనలు చేపట్టగల సామర్థ్యం వైద్యులకు ఉండాలని గుర్తు చేసిందన్నారు. ప్రాథమిక, క్లినికల్,ప్రజారోగ్య పరిశోధనల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు ఇండియా అలయన్స్ చేసిన కృషిని శిక్షణ పొందిన వైద్యుడిగా తాను గుర్తించానని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఎక్కువ మంది వైద్యులు పరిశోధనలు చేపట్టి సహకరించారని ఆయన అన్నారు.
కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఇండియా అలయన్స్ అనుబంధ సంస్థలు తమ సంస్థల్లో కోవిడ్ పరీక్షలు, చికిత్స కార్యక్రమాలు నిర్వహించాయని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. [ప్రజారోగ్య రంగంలో పరిశోధనలు ప్రోత్సహించడానికి ఇండియా అలయన్స్ క్లినికల్, పబ్లిక్ హెల్త్ ఫెలో షిప్పులు అందిస్తుందన్నారు. ఇటీవల క్లినికల్, ప్రజారోగ్య పరిశోధన సంస్థలకు ఇండియా అలయన్స్ గ్రాంటులు అందించడం ప్రారంభించిందని మంత్రి తెలిపారు.
యువ వైద్యులు పరిశోధనలు చేపట్టేలా ప్రోత్సహించడానికి ఇండియా అలయన్స్ డెవలపింగ్ ఇండియన్ ఫిజిషియన్ సైంటిస్ట్స్ (DIPS) పేరిట వర్క్‌షాప్‌లు నిర్వహించడం ప్రారంభించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. వైద్య రంగానికి చెందిన వివిధ విభాగాలు, సంబంధిత శాస్త్రాల మధ్య అవగాహన పెంపొందించడానికి వర్క్‌షాప్‌లు జరుగుతున్నాయన్నారు. దేశంలో ప్రజారోగ్య రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇండియా అలయన్స్ సహకారం అందిస్తుందని మంత్రి తెలిపారు. బహుళ రంగ పరిశోధనలు ప్రోత్సహిస్తున్న ఇండియా అలయన్స్ వన్ హెల్త్ రీసెర్చ్, హృదయ సంబంధ వ్యాధులు, అంటువ్యాధులు, గర్భాశయ క్యాన్సర్, మధుమేహం, గిరిజన ఆరోగ్యంపై పరిశోధనలు చేపట్టేందుకు సహకారం అందించిందన్నారు.

క్లినికల్, ప్రజారోగ్య రంగాలను పటిష్టం చేయడానికి ఇండియా అలయన్స్ అమలు చేస్తున్న చర్యలు ఆశించిన ఫలితాలు ఇస్తున్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఇండియా అలయన్స్ సహకారంతో చేపట్టిన పరిశోధనల వల్ల చర్మ సంబంధిత వ్యాధులకు
.ప్రత్యామ్నాయ చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు.పోషక జీవ లభ్యతను అంచనా వేయడానికి నూతన విధానాలు అందుబాటులోకి వచ్చాయని మంత్రి తెలిపారు. రాబిస్ పరిశోధనలో వన్ హెల్త్ విధానం,క్షయవ్యాధి చికిత్స కోసం టెలి-హెల్త్ విధానం అందుబాటులోకి వచ్చాయని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు.
వైద్య రంగానికి సంబంధించిన సమాచారాన్ని ఎక్కువగా వ్యాప్తి చేసి, శాస్త్రీయ రంగంలో ప్రజలు పాల్గొనేలా ప్రోత్సహించడానికి కార్యక్రమాలు అమలు జరగాల్సి ఉంటుంది. దీనికోసం యువ శాస్త్రవేత్తల వ్రాతపూర్వక, మౌఖిక సామర్ధ్యాలు పెంపొందించేందుకు ప్రతి ఏడాది సైన్స్ కమ్యూనికేషన్ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు. దీనివల్ల యువ శాస్త్రవేత్తలు తమ రంగాలలో మరింత రాణించడానికి అవకాశం కలుగుతుంది. ప్రజలకు కూడా శాస్త్రీయ అంశాలపై అవగాహన, ఉత్సాహం కలుగుతాయి.
సదస్సులో పరిశోధకులు తమ పరిశోధన ఫలితాలు అందిస్తారని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. బయో మెడికల్ రంగంలో సాధించిన ప్రగతి, వ్యాధి ఎదుర్కోగల సామర్థ్యం, అంటువ్యాధులు, మాతా శిశు ఆరోగ్యం, పశు వైద్య రంగంలో చేపట్టిన పరిశోధనలు లాంటి అంశాలు చర్చిస్తారు.
ప్రజారోగ్య రంగంలో ప్రజల భాగస్వామ్యం, కృత్రిమ మేధస్సు వినియోగం లాంటి అంశాలను సదస్సులో చర్చించి దీనికి అవసరమైన సహకారం, వ్యవస్థ అభివృద్ధి, భవిష్యత్ అవసరాలు లాంటి అంశాలపై సదస్సు చర్చించి, సవాళ్లు ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన విధానాలు, నూతన అవకాశాలు, ఆవిష్కరణలు, సాధించిన ప్రగతిపై సదస్సులో నిపుణులు ప్రసంగిస్తారని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
***
(Release ID: 1939267)
Visitor Counter : 175