సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

'గ్రామోద్యోగ్ వికాస్ యోజన' కింద 130 మంది లబ్ధిదారులకు తేనెటీగల పెట్టెలు, పనిముట్ల పెట్టెలు పంపిణీ చేసిన దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్

Posted On: 05 JUL 2023 2:52PM by PIB Hyderabad

దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా, 04 జులై 2023న, 130 మంది లబ్ధిదారులకు తేనెటీగల పెట్టెలు, పనిముట్ల పెట్టెలను పంపిణీ చేశారు. కేంద్ర సూక్ష్మ, చిన్న & మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే 'ఖాదీ అండ్‌ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్' (కేవీఐసీ) దిల్లీ స్టేట్‌ కార్యాలయం, 'గ్రామోద్యోగ్ వికాస్ యోజన' కింద ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

Image

జగత్‌పూర్ గ్రామంలోని చైన్సుఖ్ వాటిక వద్ద జరిగిన ఈ వేడుకలో దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా, ఈశాన్య దిల్లీ ఎంపీ శ్రీ మనోజ్ తివారీ, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ చైర్మన్ శ్రీ మనోజ్ కుమార్, కేవీఐసీ ఉత్తర ప్రాంతీయ సభ్యుడు శ్రీ నాగేంద్ర రఘువంశీ, కేవీఐసీ సీఈవో శ్రీ వినీత్ కుమార్, డిప్యూటీ సీఈవో, దిల్లీ కేవీఐసీ స్టేట్ కార్యాలయం డైరెక్టర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Image

భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేవీఐసీ పోషించిన కీలక పాత్ర గురించి శ్రీ వినయ్ కుమార్ సక్సేనా వివరించారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మద్దతుతో, 2017లో కేవీఐసీ ప్రారంభించిన హనీ మిషన్ విజయం గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు, 20 వేల మంది రైతులకు, తేనెటీగల పెంపకందార్లకు 2 లక్షల తేనెటీగ పెట్టెలు, హనీ కాలనీలను పంపిణీ చేశారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఉపాధి మార్గాలను సృష్టించారు, రైతుల ఆదాయం పెరిగింది. కేవీఐసీ ద్వారా దిల్లీ గ్రామాల్లో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల అభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహిస్తామని, తద్వారా 'స్వయంసమృద్ధి భారత్‌'ను బలోపేతం చేస్తామని శ్రీ సక్సేనా స్పష్టం చేశారు.

Image

తన నియోజకవర్గంలో చిన్న, కుటీర పరిశ్రమలను స్థాపించేలా యువతను ప్రోత్సహించేందుకు కేవీఐసీకి సహకరిస్తానని పార్లమెంటు సభ్యుడు శ్రీ మనోజ్ తివారీ సంసిద్ధత వ్యక్తం చేశారు. కేవీఐసీ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా యువత స్వయం ఉపాధి కల్పించుకోవచ్చని, ఇతరులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చని శ్రీ తివారీ పిలుపునిచ్చారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం బలమైన, సమర్థత గల, స్వావలంబన దేశంగా మారడంలో సాధించిన పురోగతిని కేవీఐసీ ఛైర్మన్ శ్రీ మనోజ్ కుమార్ ప్రశంసించారు. "మేక్ ఇన్ ఇండియా", "మేక్ ఫర్ వరల్డ్" ప్రాముఖ్యత గురించి, శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన "లోకల్ టు గ్లోబల్" దార్శనికత గురించి వివరించారు. "స్వయంసమృద్ధ భారత్‌" కార్యక్రమంలో భాగంగా, గ్రామీణ భారతదేశంలో కొత్త ఉపాధి అవకాశాలు కల్పించడానికి కేవీఐసీ నిరంతరం కృషి చేస్తోందని కుమార్ చెప్పారు. 2022-23 ఆర్థిక సంవత్సరం కేవీఐసీ అద్భుతమైన విజయాలు సాధించింది. సంస్థ 66 సంవత్సరాల చరిత్రలోనే అత్యధికంగా రూ.1.34 లక్షల కోట్లకు పైగా టర్నోవర్ సాధించింది.

Image

గ్రామోద్యోగ్ వికాస్ యోజన (జీవీవై) కింద 10 మందికి 100 తేనెటీగల పెట్టెలు, హనీ కాలనీలను ఈ కార్యక్రమంలో పంపిణీ చేశారు. దీంతోపాటు, శిక్షణ పొందిన 20 మందికి ప్లంబర్ పనిముట్ల పెట్టెలు, 50 మందికి పాదరక్షల మరమ్మతు పనిముట్ల పెట్టెలు అందించారు. ఈ పంపిణీ ద్వారా దిల్లీలోని జగత్‌పూర్ గ్రామానికి చెందిన 35 మంది లబ్ధి పొందారు. తోలు పరిశ్రమ కింద, ఒక స్వయం సహాయక బృందానికి తోలు పాదరక్షల తయారీ యంత్రం & సంబంధిత సామగ్రిని అందించారు. దీనివల్ల 10 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరింది. న్యూదిల్లీలోని కేవీఐసీ బహుళాంశ శిక్షణ కేంద్రంలో (ఎండీటీసీ) తోలు పాదరక్షల తయారీలో శిక్షణ పొందిన 40 మందికి ధృవపత్రాలు పంపిణీ చేశారు. దిల్లీ ప్రభుత్వం, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఉద్యోగులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

***(Release ID: 1937630) Visitor Counter : 145