భారత ఎన్నికల సంఘం

రాజకీయ పార్టీలు ఇకపై ఆన్‌లైన్‌లో ఆర్థిక ఖాతాలు సమర్పించవచ్చు


మూడురకాల నివేదికల సమర్పణకు ఎన్నికల కమిషన్‌ వెబ్‌ పోర్టల్‌ ప్రారంభం;

విరాళాల నివేదిక.. తనిఖీ పూర్తయిన వార్షిక ఖాతా..
ఎన్నికల వ్యయ నివేదికల రూపంలో వివరాల దాఖలు వెసులుబాటు;

ప్రత్యక్ష నివేదికల దాఖలులో ఇబ్బందుల తొలగింపు.. ప్రామాణిక
రూపంలో సకాలంలో సమర్పణకు వీలు కల్పించడమే లక్ష్యం;

ఆన్‌లైన్ పోర్టల్ ప్రయోజనాన్ని వివరించే మాన్యువల్.. తరచూ తలెత్తే ప్రశ్నలకు జవాబులు అందించిన కమిషన్; తద్వారా రాజకీయ పార్టీలకు శిక్షణ

Posted On: 03 JUL 2023 4:48PM by PIB Hyderabad

   దేశంలోని రాజకీయ పార్టీలు ఇకపై తమ ఆర్థిక ఖాతాల వివరాలను ఆన్‌లైన్‌లో దాఖలు చేయవచ్చు. ఇందుకోసం భారత కేంద్ర ఎన్నికల సంఘం (ఇసిఐ) వెబ్‌ పోర్టల్‌ (https://iems.eci.gov.in/) ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. దీనిద్వారా విరాళాల నివేదిక, తనిఖీ పూర్తయిన వార్షిక ఖాతా, ఎన్నికల వ్యయంపై నివేదిక రూపంలో సమర్పించవచ్చు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951తోపాటు ఎన్నికల సంఘం నిర్దిష్ట కాలావధిలో కొన్నేళ్లుగా జారీచేస్తూ వస్తున్న పారదర్శకత నియమాలకు అనుగుణంగా అన్ని రాజకీయ పార్టీలు తమ ఆర్థిక నివేదికలను ఎన్నికల సంఘం/రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారులకు ఎప్పటికప్పుడు సమర్పించడం తప్పనిసరి.

   నేపథ్యంలో దీనికి సంబంధించి ‘ఇసిఐ’ ఇటీవల అన్ని రాజకీయ పార్టీలకూ లేఖ రాసింది. ప్రత్యక్ష నివేదికల దాఖలులోగల ఇబ్బందులను తొలగించడం ద్వారా పార్టీలకు తగిన వెసులుబాటు కల్పించడం, ఆర్థిక నివేదికలను సూచించిన/ప్రామాణిక స్వరూపంలో సకాలంలో దాఖలు చేసేలా చూడటం లక్ష్యాలుగా ఆన్‌లైన్‌ దాఖలుపై నిర్ణయం తీసుకున్నట్లు ఆ లేఖలో వివరించింది. రాజకీయ పార్టీల సమాచారం ఆన్‌లైన్ లభ్యత వల్ల నిబంధనలకు కట్టుబాటు, పారదర్శకత స్థాయిని పెంచుతుందని కమిషన్‌ భావిస్తోంది. ఈ నిర్ణయం వెనుక రాజకీయ పార్టీలకుగల కీలక స్థానాన్ని తన లేఖలో ప్రముఖంగా ప్రస్తావించింది. ఎన్నికల ప్రక్రియలలో- ముఖ్యంగా ఆర్థిక వివరాల వెల్లడి ద్వారా ప్రజాస్వామ్య కర్తవ్య నిర్వహణ, పారదర్శకత సూత్రాలకు కట్టుబాటు వాటి బాధ్యతలని గుర్తుచేసింది.

   కొత్తగా ఏర్పాటయ్యే ఆన్‌లైన్ పోర్టల్‌ద్వారా నమోదిత మొబైల్ నంబరుకు సందేశాలతోపాటు రాజకీయ పార్టీల అధీకృత ప్రతినిధుల నమోదిత ఇమెయిల్‌ చిరునామాలకు కమిషన్‌ అప్రమత్తత సందేశాలను పంపే సదుపాయం కూడా ఉంది. తద్వారా నిబంధనల మేరకు నిర్ణీత గడువులో ఖాతాల సమర్పణ కచ్చితంగా పూర్తయ్యేందుకు ఇది తోడ్పడుతుంది. దీనికి సంబంధించి ఆన్‌లైన్ మాడ్యూల్, ఆన్‌లైన్‌లో నివేదికల దాఖలు విధానాన్ని వివరిస్తూ రేఖాచిత్రాలతో కూడిన సమగ్ర మార్గదర్శక కరదీపికను, తరచూ తలెత్తే సందేహాలకు సమాధానాలను కూడా కమిషన్‌ అన్ని రాజకీయ పార్టీలకూ పంపింది. ఆర్థిక ఖాతాల ఆన్‌లైన్ దాఖలుపై మరింత మార్గదర్శకత్వం దిశగా వివిధ రాజకీయ పార్టీలు ఎంపికచేసే సభ్యులకు శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది.

   కవేళ ఆన్‌లైన్ విధానంలో ఆర్థిక నివేదిక దాఖలుకు విముఖత చూపే రాజకీయ పార్టీలు అందుకుగల హేతుబద్ధ కారణాలను లిఖితపూర్వకంగా కమిషన్‌కు తెలపాలి. తదనుగుణంగా నిర్దేశిత స్వరూపంలో సీడీలు/పెన్‌డ్రైవ్‌సహా హార్డ్ కాపీల ద్వారా నివేదికల దాఖలు విధానాన్ని  కొనసాగించవచ్చు. ఆయా పార్టీలు పంపిన లిఖితపూర్వక వివరణతోపాటు వాటి ఆర్థిక ఖాతాల నివేదికలను కమిషన్‌ ఆన్‌లైన్‌లో ప్రచురిస్తుంది.

*****



(Release ID: 1937105) Visitor Counter : 204