నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అందరికీ ఆరోగ్యం దిశగా కేంద్ర ఓడరేవులు… నౌకాయానం.. జలమార్గాల మంత్రిత్వశాఖ చొరవ


న్యూ మంగళూర్‌ రేవులో ‘పీపీపీ’ కింద రూ.107 కోట్ల అంచనా వ్యయంతో
150 పడక మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తున్న కేంద్ర ప్రభుత్వం;

రేవు ఉద్యోగులు/సీఐఎస్‌ఎఫ్‌/రిటైర్డ్‌ సిబ్బంది.. వారి కుటుంబాలకు ఈ ఆస్పత్రి ద్వారా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలు లభ్యం: శ్రీ సర్బానంద సోనోవాల్

Posted On: 22 JUN 2023 5:11PM by PIB Hyderabad

   దేశంలో ఆరోగ్య సంరక్షణ సేవాప్రదాన నిబంధనలు-సంక్షేమ విధానాలను అవగతం చేసుకోవడంలో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను ఒక ముఖ్యమైన సూచికగా భారత దేశం గుర్తించింది. ఈ నేపథ్యంలో న్యూ మంగళూరు పోర్ట్ అథారిటీ (ఎన్‌ఎంపిఎ) ఓడరేవు వద్ద రూ.107 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వ-ప్రైవేట్‌ భాగస్వామ్యం కింద 150 పడకల మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి కేంద్ర ఓడరేవులు-నౌకాయానం-జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఇటీవల ఆమోదం తెలిపారు. “ఈ ఆస్పత్రి ఓడరేవు ఉద్యోగులు, సీఐఎస్‌ఎఫ్‌, రిటైర్డ్ సిబ్బంది-వారి కుటుంబాలతోపాటు రేవు పరిసర ప్రాంతాల ప్రజలకూ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తుంది. తద్వారా దేశంలో చిట్టచివరి వ్యక్తికీ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందాలన్న మన గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత సాకారం అవుతుంది” శ్రీ సోనోవాల్ ఈ సందర్భంగా అన్నారు.

   ప్రస్తుతం ‘ఎన్‌ఎంపిఎ’ పరిధిలో 32 పడకల ఆస్పత్రి ఉండగా ఇందులో రేవు ఉద్యోగులకు ఓపీడీ, రోగనిర్ధారణ సేవలు అందిస్తోంది. అయితే, తాజాగా నిర్మితం కానున్న 150 పడకల మల్టీ-స్పెషాలిటీ ఆస్పత్రిలో అనేకరకాల జబ్బులు, అనారోగ్య పరిస్థితుల నివారణకు చికిత్స చేయగల సామర్ధ్యంతో విస్తృత వైద్య సేవలందిస్తుంది. ఇందులో రోగులకు అవసరమైన ‘ఐపీడీ’ సౌకర్యాలు, ‘ఐసీయూ’, అధునాతన (సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ వంటి) రోగనిర్ధారణ సౌకర్యాలు  మొదలైనవి), అలాగే మల్టీ-స్పెషాలిటీ (ఆంకాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ వగైరా) సేవలు అందుతాయి. ఇవేకాకుండా అత్యవసర సంరక్షణ, రోగ నిర్ధారణ, శస్త్ర-సాధారణ చికిత్స, వంటి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం ఓడరేవులోగల ఆస్పత్రిలో లభించని ఈ సేవలన్నీ ఇకపై ఒకే ప్రాంగణంలో లభించనుండటం విశేషం.

   ప్రాజెక్టు కోసం ఓడరేవు ప్రాధికార సంస్థ మూడెకరాల స్థలాన్ని నిర్మాణదారులకు అప్పగిస్తుంది. అలాగే కార్యకలాపాల కోసం ప్రస్తుతం 1.3 ఎకరాల్లో నడుస్తున్న ఆస్పత్రిని స్వాధీనం చేస్తుంది. కొత్త ఆస్పత్రి ప్రారంభం తర్వాత ఈ పాత ఆస్పత్రిని తిరిగి రేవు ప్రాధికార సంస్థలకు అప్పగిస్తారు. రేవు ఉద్యోగుల చికిత్సకయ్యే వార్షిక వ్యయాన్ని ఈ ప్రాజెక్టు హేతుబద్ధీకరిస్తుంది. ఇది ఐదు కిలోమీటర్ల పరిధిలోని పనంబూర్, బైకంప్డి, కుళై, సూరత్‌కల్ తదితర ప్రాంతాల నివాసులకూ ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తుంది. అలాగే ప్రత్యేక వైద్య నిపుణులు, ఇతర వైద్యులు, ఫార్మసిస్టులు, నర్సింగ్ తదిరత పారా మెడికల్ సిబ్బంది ఉద్యోగాల కల్పనకు దోహదం చేస్తుంది.

 

*****


(Release ID: 1934630) Visitor Counter : 128


Read this release in: English , Urdu , Hindi , Odia