రక్షణ మంత్రిత్వ శాఖ
తొమ్మిదో 'అంతర్జాతీయ యోగా దినోత్సవం' సందర్భంగా 'భారతమాల' నిర్మించిన భారత సైన్యం
Posted On:
21 JUN 2023 2:36PM by PIB Hyderabad
తొమ్మిదో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని భారత సైన్యం ఘనంగా జరుపుకుంది. భారతదేశంలో సూర్యుడి తొలి కిరణాలు సోకే డోంగ్‌లోని తూర్పు అంచు నుంచి, 1971 యుద్ధం జరిగిన రాజస్థాన్‌లోని లాంగేవాలా ఇసుక దిబ్బల వరకు, సియాచిన్‌లోని ఎత్తైన మంచు ప్రాంతాల నుంచి నుంచి అండమాన్ & నికోబార్ దీవులు సహా కన్యాకుమారిలోని దక్షిణ కొన వరకు, దేశ సరిహద్దు ప్రాంతాలన్నింటిలో యోగా నిర్వహించడం ద్వారా సైన్యం 'భారతమాల'ను ఏర్పాటు చేసింది. సైనికులు, వారి కుటుంబాలు, పిల్లలు, పౌరులు ఈ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. అన్ని ప్రదేశాల్లో స్థానిక ప్రజలు యోగా కార్యకలాపాలకు సహకరించారు.
న్యూదిల్లీలోని దిల్లీ కాంట్‌లో ఉన్న కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమానికి ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత్-ఆఫ్రికా భాగస్వామ్యం నేపథ్యంలో, ఐక్యరాజ్యసమితి మిషన్ కోసం ఆఫ్రికా దేశాల్లో ఉన్న భారతీయ సైన్యం, ఇతర దేశాల్లో ఉన్న శిక్షణ బృందాలు ఆయా ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించాయి.
యుగయుగాలుగా భారతీయ సంస్కృతిలో భాగంగా ఉన్న యోగా, వివిధ రూపాలతో ప్రపంచవ్యాప్తంగా ఆదరణ సంపాదించింది. యోగా ద్వారా అనారోగ్యాల నుంచి విముక్తి, వైద్య ప్రభావాలను శాస్త్రీయ సమాజం కూడా గుర్తించింది. మోహరించిన ప్రదేశంతో సంబంధం లేకుండా, యోగాను రోజువారీ కార్యకలాపాల్లో భాగం చేయడంలో భారతీయ సైన్యం ఎప్పుడూ ముందంజలో ఉంటుంది. జాతీయ స్థాయి ప్రయత్నాల్లో భాగంగా, స్థానిక ప్రజలను, ప్రత్యేకించి మారుమూల సరిహద్దు ప్రాంతాల్లో యోగా పట్ల అవగాహన పెంచడం, యోగా విస్తరణ కోసం కార్యశాలలు నిర్వహించడం వంటివి భారత సైన్యం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంది.


*****
(Release ID: 1934306)
Visitor Counter : 130