స్పెషల్ సర్వీస్ మరియు ఫీచర్ లు
విమెన్ 20 సదస్సు: నాయకత్వ, యాజమాన్య పాత్రల్లో పరిమితులను ఛేదిస్తున్న మహిళలు
మహిళాసాధికారత శక్తిని వేడుకగా జరుపుకుంటున్న మహిళలు
Posted On:
16 JUN 2023 6:18PM by PIB Hyderabad
తమిళనాడులోని మహాబాలిపురంలో జరుగుతున్న విమెన్ -20 సదస్సు రెండో రోజు సమావేశం 16 ఉదయం జరిగింది. “కార్యాచరణకు పిలుపు: పరిమితిని ఛేదిద్దాం” అనే కీలకమైన అంశం మీద జరిగింది. దీని తరువాత “వాణిజ్యం, పెట్టుబడుల ద్వారా ఆర్థిక సాధికారత” అనే అంశం మీద “ సేవలు, మౌలిక సదుపాయాలలో పెట్టుబడి” మీద రెండు సమావేశాలు జరిగాయి. “మహిళా సాధికారతాశక్తిని వేడుకగా జరుపుకోవటం” మీద చర్చతో సదస్సు ముగిసింది.
“కార్యాచరణకు పిలుపు: పరిమితిని ఛేదిద్దాం” అనే అంశం మీద జరిగిన మొదటి సమావేశం ప్రధానంగా మహిళలు యాజమాన్యంలోనూ, నాయకత్వ పాత్రలోనూ పరిమితులను ఛేదించుకుంటూ ఎదగటం మీద దృష్టి సారించింది. ఈ సమావేశానికి ఐరోపా అధ్యయనాల మణిపాల్ కేంద్రం అధిపతి ప్రొఫెసర్ నీతా ఈనామ్ దార్ సమన్వయకర్తగా వ్యవహరించారు.చర్చలో పాల్గొన్న వారిలో మాజీ పోలీసు అధికారి భారతీ ఘోష్, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి, కర్ణాటక మాజీ చీఫ్ సెక్రెటరీ రత్న ప్రభ, సితారా షిప్పింగ్ డైరెక్టర్ సంజమ్ సాహి గుప్తా , టర్కీకి చెందిన సోషియాలజీ ప్రొఫెసర్, విమెన్ 20 ప్రతినిధి బృందం నాయకురాలు డాక్టర్ నర్సెమ్ కెక్కసిన్ అక్షయ్ ఉన్నారు.
ఈ సమావేశంలో బీజేపీ మహిళావిభాగం జాతీయ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే శ్రీమతి వానతి శ్రీనివాసన్ కీలకోపన్యాసం చేశారు. విధాన నిర్ణయాల ద్వారా, రాజకీయ ప్రాతినిధ్యం ద్వారా మహిళలను సాధికారం చేయటంలో ఆమె తన అనుభవాలను పంచుకున్నారు. ఇంటి యాజమాన్యానికీ, గృహ హింసకూ మధ్య ఉన్న సంబంధాన్ని ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇళ్ళు మహిళల పేర్లతో పెట్టటం వలన గృహ హింస గణనీయంగా తగ్గిందన్నారు. స్వయం సహాయక బృందాలు, పిఎం ముద్రా పథకం, మహిళలు మార్కెట్ కు సులువుగా చేరుకోగలిగే జెమ్ పోర్టల్ వంటి ప్రభుత్వ పథకాలను ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. కర్ణాటక పరిశ్రమల శాఖ కార్యదర్శిగా, చీఫ్ సెక్రెటరీ గా తాను ఎదుర్కున్న సంఘర్షణలను కె రత్న ప్రభ పంచుకున్నారు. మహిళలను నాయకత్వ పాత్రలలోకి తీసుకువెళ్లాల్సిన అవసరాన్ని ఆమె నొక్కి చెప్పారు. తన భావోద్వేగం, తన పట్టుదల, మొక్కవోని దీక్ష సాయంతో ఎదిగిన తీరును భారతీఘోష పంచుకున్నారు.
“వాణిజ్యం, పెట్టుబడుల ద్వారా ఆర్థిక సాధికారత” అనే అంశం మీద రెండవ సమావేశం జరిగింది. మహిళా సాధికారత లో వాణిజ్యం, పెట్టుబడులు ఎంత ప్రధాన పాత్ర పోషిస్తాయో ఈ సమావేశం చర్చింది. అదే విధంగా లింగ వివక్షకు తావులేకపోవటం, లింగ భేదం చూపించని వాణిజ్య విధానాలను ప్రస్తావించటం చూడవచ్చు. మహిళా వ్యాపార దక్షతను పెంపొందించటంలో పెట్టుబడి పాత్ర గురించి కూడా సమావేశం చర్చించింది.
అస్సాం కి చెందిన జేటీఐ గ్రూప్ డైరెక్టర్ జాహ్నబీ ఫూకన్ ఈ సమావేశానికి సమన్వయ కర్తగా వ్యవహరించారు. చర్చలో పాల్గొన్నవారిలో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యురాలు డాక్టర్ శమికా రవి, డబ్ల్యూ టీవో ట్రేడ్ అండ్ జెండర్ ఆఫీస్ అధిపతి అనౌష్ డెర్ బోగోస్సియాన్, సుప్రీంకోర్టు న్యాయవాది బన్సూరి స్వరాజ్, హార్వర్డ్ కెన్నడీ స్కూల్ బోర్డ్ డైరెక్టర్, మహిళా నెట్వర్క్ చీఫ్ డాక్టర్ స్టెఫనీ ఆస్ట్రిచ్, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ సైంటిఫిక్ అడ్వైజర్ డాక్టర్ మరీనా కె గ్లాజటోవా ఉన్నారు. మహిళలను ఆర్థికంగా సాధికారం చేస్తే అది ఆ మహిళలనే కాకుండా మొత్తం ఇంటినే మార్చివేస్తుందన్నారు. మధ్యలో బడి మానేసే పిల్లలు తగ్గుతారని, శారీరక, మానసికఆరోగ్యం మెరుగుపడుతుందని, పోషకాహారం కూడా ఎక్కువగా అందుతుందని విశ్లేషించారు. మహిళలను సాధికారం చేయటానికి అంతర్-మంత్రిత్వశాఖల సహకారం అవసరమని బోగోస్సియాన్ అభిప్రాయపడ్డారు. మహిళలఅ ఆర్థియ సాధికారత పెంచటానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్వరాజ్ వివరించారు.
సేవలు, మౌలిక రంగాలలో పెట్టుబడుల ద్వారా బాధ్యత ఆర్థిక వ్యవస్థకు బాట వేయటం మీద మూడో సమావేశం జరిగింది. ఎక్కువభాగం బాధ్యతల భారం పడేది మహిళలు, బాలికల మీదనే కావటం వల్ల ఆర్థిక వ్యవస్థల తీరుమీద ఈ బాధ్యతల భారం ఎలా ఉంటుందో చర్చించారు. ఈ సమావేశానికి మహిళల మీద పరిశోధనలు చేసే అంతర్జాతీయ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ కెల్సీ హారిస్ సమన్వయకర్తగా వ్యవహరించారు. బాధ్యతలసేవారంగానికి మెరుగైన మౌలిక వసతులు, నిధులు అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. అప్పుడే మెరుగైన సేవలు ఉంటాయని, ఈ రంగానికి లాంఛనమైన గుర్తింపు ఉంటుందని అన్నారు. ఈ చర్చలో పాల్గొన్న వారిలో మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి అదితి దాస్ రౌత్, జెండర్ స్పెషలిస్ట్ ఆయా మత్సూరా, ఒహాయో డిపార్ట్ మెంట్ ఆఫ్ డెవలప్ మెంటల్ డిజెబిలిటీస్ కు చెందిన ఎస్తేర్ ఆచూమి డెన్నిస్, నికోర్ అసోసియేట్స్ వ్యవస్థాపకులు మిటాలి నికోర్ , ఆస్ట్రేలియా ప్రధాని కార్యాలయంలో మహిళా ఆర్థిక సమానత్వపు టాస్క్ ఫోర్స్ సభ్యురాలు చియో సీ ఆండర్సన్ ఉన్నారు. ఇంటి బాధ్యతల భారం విషయంలో భారతదేశం అనేక చర్యలు తీసుకుంటున్నదని, సంబంధిత మౌలిక వసతుల మెరుగుదల, తగిన చట్టాల రూపకల్పన ద్వారా పరిస్థితులు మెరుగుపడేట్టు చూస్తున్నదని రౌత్ అన్నారు. సెలవు విధానం, బాధ్యతలు నిర్వహించినందుకు సబ్సిడీలు, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో అసలైన మౌలిక వసతులు అనే మూడు అంశాల మీద దృష్టిపెట్టటం అవసరమని నికోర సూచించారు. గృహిణుల వ్యక్తిగత బాధ్యతలమీద, ఒహాయో పాలనాయంత్రాంగం అమలు చేస్తున్న ఉత్తమ విధానాలమీద డెన్నిస్ తన అభిప్రాయాలు పంచుకున్నారు.
ఆఖరిసమావేశం మహిళల సాధికార శక్తిని వేడుకగా జరుపుకోవటం మీద దృష్టిపెట్టింది. అందరినీ కదిలించేలా భారతీ ఘోష్ చేసిన ప్రసంగంతో నాలుగో సమావేశం మొదలైంది. ఆ తరువాత విమెన్ 20 పూర్వ అధ్యక్షులు గుల్డెన్ టర్క్ టన్ (టర్కీ), లిండా లారా సబ్బాడిని (ఇటలీ), ఉలి సిలాలహీ (ఇండోనేసియా) , అడ్రియానా కారవల్హో (బ్రెజిల్), ప్రొఫెసర్ నార్నియా బోలర్ ముల్లర్ ( దక్షిణాఫ్రికా) ఈ సమావేశం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ముగింపు సమావేశంలో తమిళనాడు ఆర్థిక, మానవనరుల శాఖామంత్రి తంగమ్ తెన్నరసు కీలకోపన్యాసం చేశారు. ప్రతినిధులు అందరికీ మహాబలిపురానికి స్వాగతం పలికారు.
***
(Release ID: 1933240)
Visitor Counter : 123